యుద్ధనౌకలో మిస్‌ఫైర్!

యుద్ధనౌకలో మిస్‌ఫైర్!


• నేవీ సబ్ లెఫ్టినెంట్ తేజ్‌వీర్ సింగ్ మృతి

• ఐఎన్‌ఎస్ కతార్‌లో పిస్టల్ శుభ్రం చేస్తుండగా ఘటన

• ఆత్మహత్య అనే అనుమానాలు


సాక్షి, విశాఖపట్నం/మల్కాపురం: పిస్టల్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలిన (మిస్‌ఫైర్) సంఘటనలో తూర్పు నావికాదళానికి చెందిన సబ్ లెఫ్టినెంట్ తేజ్‌వీర్ సింగ్ మరణించారు. హర్యానాకు చెందిన సింగ్ విశాఖ కేంద్రంగా ఐఎన్‌ఎస్ కుతార్ యుద్ధ నౌకలో విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నౌకలో విధి నిర్వహణలో ఉన్నారు. తన 9 ఎంఎం పిస్టల్‌ను శుభ్రపరుస్తుండగా ప్రమాదవశాత్తూ అది పేలింది. తీవ్రంగా గాయపడిన సింగ్‌ను వెంటనే నేవల్ ఆస్పత్రి ఐఎన్‌ఎస్ కళ్యాణికి తరలించారు.



ఆయన ప్రాణాలు కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, తేజ్‌వీర్ సింగ్ చనిపోయారని నేవీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. హర్యానాలోని సింగ్ కుటుంబసభ్యులకు ఈ మేరకు సమాచారం తెలియజేశారు. అయితే సింగ్ ఆత్మహత్య చేసుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు నేవీ అధికారులు ఒక సూసైడ్ నోటును గుర్తించినట్లు తెలుస్తోంది. నౌకాదళ అధికారులు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. వారి ఫిర్యాదు మేరకు మల్కాపురం సీఐ  కేశవరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



సబ్‌మెరైన్‌లో విద్యుత్ షాక్‌తో సైలర్ మృతి

ఐఎన్‌ఎస్ సింధుధ్వజ్ సబ్‌మెరైన్‌లో విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రికల్ పవర్ సైలర్ పవన్‌కుమార్ పాండే మృత్యువాత పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేవీ అధికారుల కథనం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మెయింటెనెన్స్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పాండే షాక్‌కు గురికాగానే నేవల్ ఆస్పత్రి ఐఎన్‌ఎస్ కళ్యాణికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు ఆయన మృతి చెందారు. ఈ రెండు ఘటనలపై నౌకాదళం విచారణకు ఆదేశించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top