క్రీడల్లో సిక్కోలు నెంబర్‌ వన్‌

Ministers Opening Indoor Mini Stadium In Srikakulam District - Sakshi

జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో గుర్తింపు 

జిల్లాలో ఆటలకు మరింత ప్రోత్సాహం

రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి

రణస్థలం/రణస్థలం రూరల్‌: ఒలింపిక్స్, కామ న్‌వెల్త్, ఆసియా క్రీడల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 25మంది క్రీడాకారులు పాల్గొనడం అరుదైన విషయమని, ప్రశంసనీయమని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రీడా వికాస కేంద్రాన్ని (ఇండోర్‌ మినీ స్టేడియం) ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ అధ్యక్షతన మంత్రులు ముత్తంశెట్టి, ధర్మాన కృష్ణదాస్‌లు ప్రారంభించారు. అనంతరం కాసేపు బ్యాడ్మింటన్‌ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడాకారులకు తలమానికం అయిన కోడి రామ్మూర్తి స్టేడియంను గత ప్రభుత్వం విస్మరించిందని, సీఎం జగన్‌తో మాట్లాడి 2020లో స్టేడియంను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అలాగే పైడిభీమవరంలో పరిశ్రమలు అధికంగా ఉన్నందున  కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా రూ.10 లక్షల వ్యయంతో జిమ్‌ ఏర్పాట య్యేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌కు సూచించారు.

అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఆలయాలను, భావనపాడు, ఉద్దానం కొబ్బరి తోటలను పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామన్నారు. క్రీడా వికాస కేంద్రానికి వైఎస్సార్‌ క్రీడా వికాస కేంద్రంగా పేరు పెడుతున్నామని తెలిపారు. 14 రోజులపాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో నవరత్నాలతోసహా 19 బిల్లులు ఆమోదించామని, ప్రభుత్వ వచ్చిన రెండు నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్న ఘనత దేశంలో ఒక్క సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు.

క్రీడాకారుల కీర్తి శాశ్వతం..
మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ క్రీడలతోనే ఆరోగ్యవంతమైన సమాజం స్థాపన సాధ్యమవుతుందన్నారు. రాజకీయ నాయకులకు ఐదేళ్లపాటే పదవీ కాలం ఉంటుందని, అదే క్రీడాకారులుగా రాణిస్తే ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. కరణం మల్లేశ్వరి, పీవీ సింధు, సచిన్‌ టెండూల్కర్‌ వంటి క్రీడాకారులు ప్రపంచానికి గుర్తింపు తెచ్చారని తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో క్రీడలకు అధిక నిధులు కేటాయించేలా చూడాలని క్రీడాశాఖమంత్రికి సూచించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిలాంటి నాయకుడు మరో 30 ఏళ్లు సీఎంగా కొనసాగాలన్నారు.

ఇవే తన చివరి ఎన్నికలని, వచ్చేసారి మళ్లీ పోటీ చేయనని, అయినా జీవితాంతం జగన్‌ అండగా నిలుస్తానని అన్నారు. ఎంపీ బెల్లాన చంధ్రశేఖర్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ క్రీడావికాస కేంద్రంలో వాలీబాల్, 200 మీటర్ల ట్రాక్, బ్యాడ్మింటన్‌ వంటి క్రీడలకు కోచ్‌ను నియమించాలని కోరారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎచ్చెర్ల మండలంలోని పొన్నాడ సమీపంలో 5 ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేయాలని, ఎస్‌.ఎం.పురం పెద్ద చెరువును పర్యాటకంగా అభివృద్ధి పర్చాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ జె.నివాస్, ఎమ్మెల్సీ రఘువర్మ మాట్లాడారు. క్రీడా వికాస కేంద్రాన్ని త్వరితగతిన పూర్తి చేసినందుకు ఇంజనీర్లు, కాంట్రాక్టకు షీల్డ్‌లు ఇచ్చి దుశ్సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, సెట్‌శ్రీ సీఈవో వి.వి.ఆర్‌.ఎస్‌ మూర్తి, డీఎస్‌డీవో బి. శ్రీనివాసరావు, కోచ్‌ శ్రీధర్, అంబేడ్కర్‌ యూనివర్సిటీ పీడీ శ్రీనివాసరావు, ఆర్డీవో ఎం.వి.రమణ, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top