గురుకుల పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీ

Minister Shankara Narayana Checks BC Boys Residential School In Krishna - Sakshi

సాక్షి, కృష్ణా: ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలోని మహత్మా జ్యోతిబాపూలే బాలుర సంక్షేమ గురుకుల పాఠశాలలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రికార్డులను పరిశీలించి విద్యార్థుల తరగతి గదులను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా  ఆయన అడిగిన పాఠ్యాంశాలలోని  ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం చెప్పలేక పోయారు. అదేవిధంగా తెలుగు సంధులు ఎన్ని అని అడిగిన ప్రశ్నకు గెస్ట్‌ ఫ్యాకల్టీ కూడా సమాధానం చెప్పలేక పోవడంతో మంత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వసతి గృహాలు, విద్యాసంస్థల్లో విద్యా విధానాల అమలును తెలుసుకునేందుకే ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. గడిచిన ఐదేళ్లలో శాశ్వత ఉపాధ్యాయులు లేకపోవడంతో వసతి గృహాల పాఠశాలలు గాడి తప్పాయన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అణగారిన వర్గాల పిల్లలు నష్టపోయారని, విద్యను ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేసిందని మండిపడ్డారు.

అదే విధంగా.. టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకొనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లు రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను గాలికి వదిలేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం మనబడి నాడు-నేడు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. నూతన విద్యాసంవత్సరంలో 1నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీషు  మీడియం విద్యను తీసుకురానున్నామన్నారు. పేద ప్రజానీకానికి సంక్షేమ ఫలాలు అందాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులకు వసతుల కల్పన, నిర్వహణలో అలసత్వం  వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి పేద విద్యార్థులకు విద్యతో  పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మెరుగుపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రతి పేదింటి విద్యార్థికి విద్య అందాలన్నదే సీఎం జగన్‌ ఆకాంక్ష అన్నారు. విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని మంత్రి వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top