సభలో ‘దిశ’ బిల్లు ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత

Minister Mekathoti Sucharitha Introduce AP Disha Act In Assembly - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చారిత్రత్మక  ‘దిశ’ బిల్లును హోంమంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం దిశ బిల్లును తీసుకోచ్చిందని తెలిపారు. ఇటీవలి కాలంలో మహిళలపై దాడులు పెరిగాయని.. దిశ ఘటనతో ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారని చెప్పారు. దిశ ఘటన విని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారని చెప్పారు. మహిళల రక్షణ కోసమే సీఎం వైఎస్‌ జగన్‌ దిశ చట్టాన్ని తీసుకోచ్చారని వెల్లడించారు. మహిళలపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఏపీ మహిళలకు సీఎం జగన్‌ రక్ష : తానేటి వనిత 
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలందరికీ సీఎం వైఎస్‌ జగన్‌ రక్ష అని తెలిపారు. ఎవరైనా మహిళపై దాడి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం ఏరులై పారిందని గుర్తుచేశారు. మద్యాన్ని హెల్త్‌ డ్రింక్‌గా ప్రమోట్‌ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో జరిగిన కాల్‌మనీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరారు.  

ఏపీ దిశ యాక్ట్‌-2019లోని ముఖ్యంశాలు..
మహిళలు, బాలికలపై అత్యాచారం లాంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష

నేరాన్ని నిర్దారించే ఆధారాలున్నప్పుడు(కన్‌క్లూజివ్‌ ఎవిడెన్స్‌) 21 రోజుల్లోనే తీర్పు

వారం రోజుల్లో దర్యాప్తు.. 14 రోజుల్లో విచారణ పూర్తి

 ప్రస్తుతం ఉన్న నాలుగు నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదింపు 

► మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాకు ప్రత్యేక కోర్టులు 

► ప్రత్యేక కోర్టుల్లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం

► ఐపీసీలో 354(ఇ), 354(ఎఫ్‌) సెక్షన్ల చేర్పునకు గ్రీన్‌సిగ్నల్‌

► సోషల్‌ మీడియాలో మహిళల్ని కించపరిస్తే 2 నుంచి 4 ఏళ్ల జైలు

► మొదటిసారి తప్పుడు పోస్టింగ్‌కు రెండేళ్ల జైలు శిక్ష

► రెండోసారి తప్పుడు పోస్టింగ్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష

► పిల్లలపై లైంగిక నేరాలకు 10 నుంచి 14 ఏళ్ల వరకూ శిక్ష, నేరం తీవ్రతను బట్టి జీవిత ఖైదు

► పోక్సో చట్టం కింద ఇప్పటివరకూ ఉన్న కనీస శిక్ష అయిదేళ్లకు పెంపు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top