రాష్ట్ర డీజీపీ వి.దినేష్‌రెడ్డి తన అధికారాలతో మీడియా హక్కులను కాలరాస్తున్నారని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) ఫిర్యాదు చేసింది.
గవర్నరుకు ఏపీయూడబ్ల్యూజే ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ వి.దినేష్‌రెడ్డి తన అధికారాలతో మీడియా హక్కులను కాలరాస్తున్నారని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) ఫిర్యాదు చేసింది. యూనియన్ నేతృత్వంలో సీనియర్ పాత్రికేయుల బృందం గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నరును కలిసింది. మీడియా విషయంలో డీజీపీ వ్యవహరిస్తున్న తీరును వివరించి వినతిపత్రం అందజేసింది.
పాతబస్తీలో మతగురువును డీజీపీ కలిసిన వ్యవహారంపై వార్త ప్రచురించిన నేపథ్యంలో హిందూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్‌ను పోలీసులు వేధించడం పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమేనని వారు వివరించారు. నగేష్‌కుమార్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నప్పటికీ పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. జీ-24 గంటల చానల్‌వారిని బెదిరించి క్షమాపణ చెప్పించుకున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. దీనిపై కలుగజేసుకుని ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమసుందర్, వై.నరేందర్‌రెడ్డితోపాటు వివిధ పత్రికల సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు సంతకాలు చేశారు.
జీ టీవీ ప్రతినిధులకు ఊరట
వేధించొద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ‘డీజీపీపై కథనం’ కేసు లో జీటీవీ ప్రతినిధులకు ఊరట కలిగింది. వీరిపై నమోదైన మూడు ఫిర్యాదుల్లో ఒక దానిని మాత్రమే ఎఫ్‌ఐఆర్‌గా పరిగణించి, మిగిలిన రెండింటినీ స్టేట్‌మెంట్లుగా తీసుకోవాలని పోలీసులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఆదేశించా రు. కేసు విచారణను సీసీఎస్ పోలీసులు చేపట్టాలని, జీ టీవీ ఉద్యోగులను వేధించరాదని ఆదేశించారు.