మరో ప్రజాప్రస్థానానికి ఏడాది పూర్తి | maro praja prasthanam complete one year | Sakshi
Sakshi News home page

మరో ప్రజాప్రస్థానానికి ఏడాది పూర్తి

Oct 19 2013 1:53 AM | Updated on Mar 18 2019 9:02 PM

రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తప్ప మరో రాజకీయ శక్తి ఎదగకూడదని ఆ రెండు పార్టీలు కుమ్మక్కయి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న రోజులు

* ఇడుపులపాయలో 2012 అక్టోబర్ 18న మొదలైన పాదయాత్ర
* 2013 ఆగస్టు 4న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగింపు
* 14 జిల్లాల్లో 3,112 కిలోమీటర్ల సుదీర్ఘయాత్ర
* కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలపై దండయాత్ర
* అన్నకిచ్చిన మాటకోసం చరిత్ర సృష్టించిన షర్మిల
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తప్ప మరో రాజకీయ శక్తి ఎదగకూడదని ఆ రెండు పార్టీలు కుమ్మక్కయి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న రోజులు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లో ఉంటే తమ నాటకాలు సాగవని అక్రమంగా నిర్బంధించిన రోజులు... కష్టకాలంలో రాష్ట్ర ప్రజలకు తామున్నామంటూ భరోసా కల్పించడానికి జగన్‌మోహన్‌రెడ్డి తన సోదరి షర్మిలను దూతగా పంపించారు... ఆ రెండు పార్టీల కుట్రలను భగ్నం చేయడానికి బ్రహ్మాస్త్రంలా ప్రయోగించారు... మరో ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల సాహసోపేతమైన సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టి ఏడాది పూర్తయింది. గత ఏడాది అక్టోబర్ 18 ఇడుపులపాయలోని తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులర్పించి బయలుదేరిన షర్మిల నిరాఘాటంగా 230 రోజుల్లో పాదయాత్ర పూర్తిచేశారు.

అశేష జనవాహిని మధ్య వైఎస్సార్‌జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభించి 2013 ఆగస్టు 4 వ తేదీనాటికి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 14 జిల్లాల్లో 3112 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. వైఎస్సార్ జిల్లాతో మొదలుపెట్టి అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, గుంటూరు, కృష్ణా, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మరో ప్రజాప్రస్థానం యాత్ర సాగింది. ఈ 14 జిల్లాల్లో 116 అసెంబ్లీ నియోజకవర్గాలు, తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లు, 45 మున్సిపాలిటీలు, 195 మండలాల్లో ఏర్పాటు చేసిన అనేక బహిరంగ సభల్లో షర్మిల మాట్లాడారు.

మొత్తంగా 2,250 గ్రామాల నుంచి సాగిన ఈ సుదీర్ఘయాత్రలో ప్రజలు పడుతున్న కష్టనష్టాలెన్నింటినో ఆమె ప్రత్యక్షంగా చూడగలిగారు. 190కిపైగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి నేరుగా ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఇంతటి దారుణమైన ప్రభుత్వాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని ప్రజలకు తెలియజెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు? ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారన్న విషయాన్ని ఆమె దాదాపు ప్రతి సభలోనూ ప్రజలకు విడమరిచారు.

రాష్ట్రంలో మూడో రాజకీయ శక్తి ఎదగకూడదన్న లక్ష్యంతో జగన్‌మోహన్‌రెడ్డిపై పన్నిన కుట్రలు, కుతంత్రాలను విజయవంతంగా ప్రజలకు వివరించారు. ప్రజాకంటక పాలన అందిస్తున్న కాంగ్రెస్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టినా తెలుగుదేశం పార్టీ మద్దతునిచ్చి ఆ ప్రభుత్వాన్ని కాపాడిన తీరును ఎండగట్టారు. అన్న మాటకు కట్టుబడి పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిల సాహసాన్ని పార్టీ నేతలు గుర్తుచేసుకుని శుక్రవారం రోజున ఆమెకు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement