మంత్రాలయంలో ‘‘తిక్క’’ చేష్టలు..

The Mantralayam Constituency TDP Candidate Thikka Reddy is Doing Badly - Sakshi

టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి హల్‌చల్‌ 

సాక్షి, మంత్రాలయం :  మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి చేష్టలు శ్రుతిమించాయి.  ఆయన తీరు కారణంగా మంత్రాలయం మండలం ఖగ్గల్‌ గ్రామంలో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిక్కారెడ్డి  గన్‌మెన్‌లు అత్యుత్సాహం ప్రదర్శించి.. ఫైరింగ్‌ చేయడంతో ఆయనతో పాటు ఏఎస్‌ఐకి  గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ముందస్తు వ్యూహంలో భాగంగా ఎన్నికల ప్రచార నిమిత్తం తిక్కారెడ్డి అనుచరులతో కలిసి శనివారం ఉదయం 8.30 గంటలకు ఖగ్గల్‌ గ్రామం చేరుకున్నారు.

ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కుతూ అంగన్‌వాడీసెంటర్‌ ఎదుట టీడీపీ జెండాను ఎగురవేశారు. తర్వాత గ్రామ వీధుల్లో ప్రచారం ముగించుకుని మళ్లీ అంగన్‌వాడీ కేంద్రం వద్దకే వచ్చి కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఐదేళ్లలో తమ గ్రామం వైపు రాలేదని, ఒక్క అభివృద్ధి పనీ చేయలేదని, పైగా ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా జెండా ఎలా ఎగురవేస్తారంటూ కొందరు యువకులు నిలదీశారు. అదే సమయంలో గ్రామానికి ప్రచారం నిమిత్తం వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా అంగన్‌వాడీ సెంటర్‌ వద్దకు సమీపించారు.

వారు మామూలుగానే వస్తుండగా.. తిక్కారెడ్డి గన్‌మెన్‌ శ్రీనివాసులు మాత్రం ఆవేశంతో ఊగిపోతూ గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. బెంబేలెత్తిన ఇరువర్గాలతో పాటు గ్రామస్తులు కేకలు వేశారు. దీంతో శ్రీనివాసులు మరింత రెచ్చిపోయాడు. మరో గన్‌మెన్‌ ఆర్‌.విజయ్‌కుమార్‌తో కలిసి గాల్లోకి, నేలపైకి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తిక్కారెడ్డి ఎడమ కాలి మోకాలి పైభాగంలోనూ, ఏఎస్‌ఐ వేణుగోపాల్‌ కుడి కాలికి గాయాలయ్యాయి.  

దారి మళ్లించి గ్రామ ప్రవేశం 
వ్యూహంలో భాగంగా తిక్కారెడ్డి ముందుగా మంత్రాలయం చేరుకున్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ మంత్రాలయం మండలం సౌలహళ్లి గ్రామానికి ప్రచారానికి వెళ్తున్నట్లు చెప్పి, కోసిగి మీదుగా ఐరన్‌గల్లు నుంచి ఖగ్గల్‌ గ్రామం చేరుకున్నారు. వెళ్లే సమయంలో ఎవరూ విలేకరులు రావద్దంటూ తన అనుకూల మీడియాను వెంటేసుకుని వెళ్లారు. గ్రామంలో అలజడి సృష్టించాలనుకుని.. ఎన్నికల కోడ్‌ను సైతం ఉల్లంఘించి అంగన్‌వాడీ కేంద్రం ఎదురుగా పార్టీ జెండాను ఎగుర వేశారు. గ్రామస్తులకు ఇష్టం లేకున్నా వీధుల్లో పర్యటించారు. కాగా.. ఉద్రిక్తత నేపథ్యంలో ఆదోని డీఎస్పీ వెంకటరాముడు నేతృత్వంలో పోలీసు బలగాలను  గ్రామంలో మోహరించారు. ఆరుగురు సీఐలు, 12 మంది ఎస్‌ఐలతో పాటు స్పెషల్‌ పార్టీ పోలీసులు గ్రామం చేరుకున్నారు. టీడీపీ నాయకుడు సురేష్‌నాయుడు ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సతీమణి జయమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, మురళీరెడ్డి, భీమిరెడ్డి, పలువురిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. 

తిక్కారెడ్డిపై ఫిర్యాదు 
పాలకుర్తి తిక్కారెడ్డి, అనుచరులు ఖగ్గల్‌ గ్రామ చావిడిలో కూర్చున్న యువకులను పిలిచి టీడీపీకి ఓటేయాలని అడిగారు. గ్రామానికి ఏ పనీ చేయనందున తాము వేయబోమని అయ్యప్ప, అనుమంతు, సురేంద్ర అనే యువకులు చెప్పారు. దీంతో తిక్కారెడ్డితో పాటు టీడీపీ నాయకులు మాధవరం రాజశేఖర్‌రెడ్డి, గుడిసె శివన్న, గోతులదొడ్డి సరేష్‌నాయుడు, బూదూరు మల్లికార్జునరెడ్డి, రామాంజి, మంత్రాలయం యేబు యువకులపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు అయ్యప్ప మాధవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన తిక్కారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆర్‌వో మోహన్‌దాసుకు వైఎస్సార్‌సీపీ నాయకులు అత్రితనయగౌడ్, బెట్టనగౌడ్, వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేశారు.  

‘కొడకల్లారా’ అంటూ ...  
ఉద్రిక్తత పరిస్థితుల్లో సహనం పాటించాల్సిన గన్‌మెన్‌ శ్రీనివాసులు ‘కొడకల్లారా.. కాల్చి పాడేస్తా’నంటూ రెచ్చిపోయాడు. అలా అంటూ కొన్ని క్షణాల్లోనే తుపాకీ తీసుకుని కాల్పులకు పాల్పడ్డాడు. కాల్పుల్లో గన్‌మెన్‌లిద్దరూ 13 రౌండ్లు పేల్చినట్లు డీఎస్పీ వెంకటరాముడు తెలిపారు.  సంఘటన ప్రాంతంలో ఎనిమిది ఖాళీ బుల్లెట్లు కనిపించాయి. మిగతా వాటి ఆచూకీ లభ్యం కాలేదు. కాల్పుల్లో గాయపడి కింద పడగానే తిక్కారెడ్డి కూడా ‘కొడకల్లారా’ అంటూ అనుచిత వ్యాఖ్యలు అందుకున్నారు. కాల్పుల్లో గాయపడిన ఇరువురిని హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.  

గన్‌మెన్ల సస్పెన్షన్‌ 
కర్నూలు : మంత్రాలయం మండలం ఖగ్గల్‌ గ్రామంలో శనివారం జరిగిన ఘటనలో ప్రైవేటు వ్యక్తులు ఎవరూ కాల్పులు జరపలేదని పోలీసు విచారణలో తేలింది. అక్కడి ఘటనపై కేసు నమోదు చేసి.. ఆదోని డీఎస్పీ వెంకటరాముడితో ఎస్పీ ఫక్కీరప్ప విచారణ చేయించారు. కాల్పులు జరపాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో అత్యుత్సాహం ప్రదర్శించి కాల్పులు జరిపిన గన్‌మెన్లు క్రమశిక్షణ ఉల్లంఘించడమే కాక నిర్లక్ష్యంగా విధులు నిర్వహించినట్లు తేలడంతో ఏఆర్‌ పీసీలు ఎం.సి.శ్రీనివాసులు (నం.1414), ఆర్‌.విజయ్‌కుమార్‌(నం.805)లను సస్పెండ్‌  చేసినట్లు ఎస్పీ ఫక్కీరప్ప ఒక ప్రకటనలో తెలిపారు.  పోలీసు శాఖలో విధుల పట్ల అలసత్వం వహించి..క్రమశిక్షణ ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.   

దుష్ప్రచారం సరికాదు 
వైఎస్సార్‌సీపీ నాయకులు కాల్పులు జరపడంతోనే తిక్కారెడ్డి గాయపడినట్లు దుష్ప్రచారం చేయడం సరికాదని వై.బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. వేటకొడవళ్లు, గన్‌లతో దాడి చేశారని తిక్కారెడ్డి టీవీల్లో చెప్పడం హాస్యాస్పదమన్నారు. నిజాలు తెలుసుకోకుండా మంత్రి లోకేష్‌ సైతం ట్విట్టర్‌లో పేర్కొనడం విడ్డూరకరమన్నారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటే తాము అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు. జనాలకు ఇష్టం లేకున్నా.. కోడ్‌ను కాదని ఇలాంటి ప్రచారాలకు యత్నించడం బాధాకరమన్నారు.  జనాలను రెచ్చగొట్టడంతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించాలన్న ఉద్దేశంతోనే గ్రామాల్లోకి వచ్చి హల్‌చల్‌ చేస్తున్నారని పేర్కొన్నారు.  వైఎస్సార్‌సీపీ నేతలెవ్వరూ అధైర్య పడవద్దన్నారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టే ధోరణులకు దూరంగా ఉండి ప్రశాంతతకు సహకరించాలని కోరారు.                                      
– వై.బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top