బక్కచిక్కిన బాల్యం

Malnutrition Problems in Girl Childs - Sakshi

పిల్లల్లో పోషకాహార లోపం

బాలికల్లోనే అధికం

తీవ్రంగా రక్తహీనత

రాష్ట్రంలో జిల్లా నాల్గో స్థానం

కర్నూలు(హాస్పిటల్‌): పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఆయా కేంద్రాలకు వచ్చే పిల్లల్లో ఇప్పటికీ 30 నుంచి 40 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని అంచనా. ప్రధానంగా బాలికల్లో పోషకాహార లోపం అధికంగా ఉందని, ఈ కారణంగా వారిలో రక్తహీనత ఉన్న వారి సంఖ్య 40 శాతానికి పైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.  

జిల్లాలో 16 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల కింద 3,549 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందులో కర్నూలు డివిజన్‌లో 1,261, నంద్యాల డివిజన్‌లో 1,031, ఆదోని డివిజన్‌లో 1,251 కేంద్రాలు ఉన్నాయి. ఇందులో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం, పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పడం చేస్తున్నారు. పిల్లలకు, బాలింతలు, గర్భిణులకు అమృతహస్తం, బాల సంజీవని, బాలామృతం, మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో ఆరేళ్లలోపు పిల్లలు 3,40,245 మంది, ఐదేళ్లలోపు పిల్లలు 3,29,057 మంది నమోదయ్యారు. పిల్లల్లో రక్తహీనత, ఎదుగుదల లేకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, తరచూ అనారోగ్యానికి గురికావడం, పలు రకాల అనారోగ్య సమస్యలు ఉండటం కనిపిస్తోంది.

వీరిలో కాస్త బరువు తక్కువగా ఉన్న వారు 12,605 మంది, మధ్యస్తంగా బరువు తక్కువగా ఉన్న వారు 3,507 మంది, పూర్తిగా బరువు తక్కువగా ఉన్న వారు 6,905 మంది ఉన్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా జిల్లాలోని 3,29,057 మంది పిల్లల్లో 23,017 మంది బాలలు బరువు తక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా కర్నూలు, నంద్యాల డివిజన్‌ కంటే ఆదోని డివిజన్‌లోని కేంద్రాల్లోనే పిల్లలు అధికంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. కర్నూలు, నంద్యాల డివిజన్‌లో 8 శాతం పిల్లలు పోషకాహారలోపంతో బాధపడుతుండగా, ఆదోని డివిజన్‌లో 12 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ఈ కారణంగా వీరు తరచూ పలు రకాల అనారోగ్యానికి గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 

మూడు నెలలుగా అందని గుడ్లు
ఎదిగే పిల్లలకు సమతుల ఆహారం లేకపోతే వారికి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఈ మేరకు కేంద్రాలకు వచ్చే పిల్లలకు కేంద్రం వారంలో ఐదు రోజులు గుడ్లు ఇవ్వాలని సూచించింది. అయితే జిల్లాలో మూడు నెలల నుంచి పిల్లలకు కోడిగుడ్లను సరఫరా చేయడం లేదు. టెండర్‌దారుడు కోడ్‌ చేసిన ధరకు, మార్కెట్‌లో కోడిగుడ్ల ధరకు భారీగా వ్యత్యాసం ఉండటంతో కాంట్రాక్టర్‌ గుడ్ల సరఫరా నిలిపివేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించకుండా పిల్లలకు కడుపు కొడుతోంది.

పక్కదారి పడుతున్న పౌష్టికాహారం
అంగన్‌వాడీ కేంద్రాల్లో వారంలో ఐదు రోజులు కోడిగుడ్లు, ఉదయం పాలు, రక్తహీనత ఉంటే సాయంత్రం శనగలను పిల్లలకు ఇస్తారు. దీంతో పాటు మధ్యాహ్నం వేళ వారికి ఆహారాన్ని వండి అక్కడే తినిపిస్తారు. ఈ మేరకు బియ్యం, కందిబేడలు, ఇతర నిత్యావసర సరుకులను, పాలు, కోడిగుడ్లను కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేయాలి. అయితే చాలా కేంద్రాల్లో రిజిస్టర్‌లో నమోదైన పిల్లల సంఖ్యకు, హాజరైన వారి సంఖ్యకు పొంతన ఉండటం లేదు. ఎవరైనా అధికారులు తనిఖీకి వెళితే పలురకాల కారణాలు చెప్పి పిల్లలు గైర్హాజరైనట్లు అంగన్‌వాడీ ఆయాలు, టీచర్లు చెబుతున్నారు. అయితే ప్రతిరోజూ 90 శాతం దాకా పిల్లలు ఆహారాన్ని తీసుకుంటున్నట్లు నమోదు చేస్తున్నారు. జిల్లా మొత్తంగా కేంద్రాల్లో నమోదైన పిల్లల్లో 50 శాతానికి మించి ఆహారాన్ని తీసుకోవడం లేదన్నది బహిరంగరహస్యం. కానీ 90 శాతం పిల్లలు తింటున్నారని లెక్కలు రాస్తున్నారు. 40 శాతం ఆహారాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయం సీడీపీఓలకు తెలిసినా మామూళ్లు తీసుకుని ఊరుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top