మలేషియా పేరుతో మోసం | Malaysia is the name of the Cheat | Sakshi
Sakshi News home page

మలేషియా పేరుతో మోసం

Nov 23 2014 2:41 AM | Updated on Sep 2 2017 4:56 PM

మలేషియాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఓ ఏజెంట్ పలువురి వద్ద రూ. లక్షలు వసూలు చేసి చివరకు వారికి అక్కడ నరకం చూపించారు.

రాయచోటి: మలేషియాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఓ ఏజెంట్ పలువురి వద్ద రూ. లక్షలు   వసూలు చేసి చివరకు వారికి అక్కడ నరకం చూపించారు. టూర్ వీసాతో మలేషియాకు పంపడంతో అనేక ఇబ్బందులు పడి స్వదేశానికి చేరుకున్నారు. బాధితుల కథనం మేరకు ... రాయచోటికి చెందిన మహ్మద్ రఫీ అనే ఏజెంట్ మలేషియాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ  పలువురికి ఆశ కల్పించాడు.

రాయచోటి ప్రాంతంలో తీవ్ర కరువు పరిస్ధితులు నెలకొనడంతో ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలను పోషించుకోలేని  పరిస్థితులు నెలకొన్నాయి. మలేషియాలోని  చక్కెర ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని నెలకు  రూ. 40వేల వరకూ జీతం లభిస్తుందని మహ్మద్ఫ్రీ మాయమాటలు చెప్పాడు.

అందుకు రూ. 90వేల వరకూ ఖర్చు అవుతుందని తెలపడంతో ఆరుమంది అప్పులు చేసి ఏజెంట్ చేతిలో పెట్టారు.  టూర్ వీసా తీసి వారిని  మలేషియాకు పంపారు.  ఎయిర్‌పోర్టులోనే చెన్నారెడ్డి అనే వ్యక్తి పాస్‌పోర్టును పరిశీలించి    టూర్‌వీసా అని తేలడంతో  అప్పటికప్పుడే  వెనక్కి పంపివేశారు.  మిగిలిన ఐదుగురు మాత్రం ఎలాగోలా  ఎయిర్‌పోర్టు నుంచి బయటపడ్డారు.  

 ఓ మహిళ ఎయిర్‌పోర్టు వద్దకు వచ్చి వీరిని తీసుకెళ్లి  తమిళులకు అప్పగించారు. బాలకృష్ణా, రెడ్డెప్ప, జనార్దన్‌రెడ్డి అనే వారిని చక్కెర  ఫ్యాక్టరీలో చేర్పించారు. 8 గంటలు మాత్రమే పని  ఉంటుందని  ఏజెంట్ చెప్పగా అక్కడ మాత్రం 12గంటలు పని చేయించుకోవడంతో మరుసటి రోజే బాలకృష్ణా స్వదేశానికి తిరిగి వచ్చాడు. తల్లి ఆనారోగ్యంతో  ఆసుపత్రిలో ఉందంటూ  సర్దిచెప్పుకుని రాగలిగాడు.  

రామరాజు,నారాయణరెడ్డిలకు మొక్కజొన్నల ఫ్యాక్టరీలో  పని కల్పించారు. అక్కడ వారికి పని చాలా భారంగామారింది.  వారిని హింసించి పనులు చేయించుకునేవారు.  టూర్‌వీసాపై వెళ్లిన వీరు అక్కడి పోలీసుల తనిఖీలలో దొరికితే కఠిన చర్యలు, భారీగా జరిమానాలు విధించే అవకాశం ఉంది.  వర్క్‌పర్మిట్ ఉన్నవారే అక్కడ ఉద్యోగాల్లో పని చేసే అవకాశం ఉంటుంది. వీరిని టూర్‌వీసాపై పంపి అక్రమంగా పనుల్లో చేర్పించడంతో ఎప్పుడు పోలీసుల నుంచి ముప్పు ఉంటుందోనని నిత్యం భయపడుతూ పనులు చేసేవారు. తిరిగి తమ దేశానికి వెళతామో లేదోననే ఆందోళన వారిలో నెలకొంది.

 ఈ పరిస్థితుల్లో ఇక్కడి ఏజెంట్ వద్దకు వారి కుటుంబ సభ్యులు వెళ్లి  తమ వారిని ఎలాగైనా  రప్పించాలని ప్రాధేయపడినా  పట్టించుకోలేదు. సుమారు వారం రోజుల  పాటు వారిని  చుట్టూ తిప్పుకుని చివరకు విమాన ప్రయాణానికి అవకాశం కల్పించడంతో స్వదేశానికి చేరుకోగలిగారు.  కాగా ఎన్‌పీ కుంటకు చెందిన  గిరిజన మహిళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మలేషియాకు పంపినట్లు సమాచారం. అయితే అక్కడ ఆమెను వ్యభిచార నిర్వాహకులకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement