అమ్మా.. నాన్న ఎప్పుడొస్తాడు..?

west godavari person missing in Malaysia - Sakshi

మలేషియా వెళ్లిన తండ్రి కోసం బిడ్డల ఎదురుచూపులు 

ఎనిమిది నెలలుగా జాడలేదని కుటుంబసభ్యుల ఆవేదన

పశ్చిమగోదావరి జిల్లా , పోడూరు: ఉపాధి కోసం మలేషియా వెళ్లిన యువకుడు అక్కడ ఏమైందో ఏమో గాని ఎనిమిది నెలలుగా జాడ లేకుండా పోయాడు. అతని వద్ద నుంచి ఫోన్‌ కూడా రాకపోవడంతో ఇంటి వద్ద అతని భార్య, తల్లి తీవ్రంగా తల్లడిల్లి పోతున్నారు. అమ్మా.. నాన్న ఎప్పుడొస్తాడు.. మాకు బొమ్మలు, చాక్లెట్లు, కొత్తబట్టలు తెస్తాడన్నావుగా..మరి నాన్న ఎప్పుడొస్తాడు? అని పిల్లలు అడుగుతున్న ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆ తల్లి దిక్కుతోచని స్థితిలో ఉంది. భర్త లేని స్థితిలో.. ఉన్న ఒక్కగానొక్క కొడుకే కొండంత అండగా ఉన్నాడనుకున్న తరుణంలో దేశంకాని దేశంలో ఉన్న అతని జాడ తెలియక అతని తల్లి మనోవేదనతో కుంగిపోతోంది. బాధితుని కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జిన్నూరు గ్రామం ఊయలస్థంభాల ప్రాంతానికి చెందిన కేతలి దుర్గారావు(30) మూడేళ్ల కిందట ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని మలేషియా దేశానికి వెళ్లాడు.

అతనికి ఆరేళ్ల కిందటే వివాహం అయింది. భార్య పేరు దుర్గ. అయిదేళ్ల కుమార్తె వెంకట తేజ సత్యశ్రీ, నాలుగేళ్ల కుమారుడు షరీఫ్‌ ఉన్నారు. దుర్గారావు తల్లి కమల. తండ్రి సత్యనారాయణ. అతను దాదాపు 20 ఏళ్ల కిందటే చనిపోయాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం కాగా కుమార్తెలకు వివాహాలు జరిగాయి. కుమారుడు దుర్గారావు పెద్దగా చదువు కోలేదు. ఇక్కడ ఉండగా కులవృత్తి చేసుకోవడంతో పాటు కూలీ పనులకు వెళుతుండేవాడు. మూడేళ్ల కిందట అతను ఉపాధి కోసం ఆయిల్‌పామ్‌ తోటల్లో పని చేసేందుకు మలేషియా దేశానికి వెళ్లాడు. రెండేళ్ల పాటు అక్కడ అతనికి సజావుగానే కాలం గడిచింది. తరచూ ఇంటికి ఫోన్‌ చేసి కుటుంబసభ్యులందరితో మాట్లాడేవాడు. అప్పుడప్పుడు జీతం డబ్బులు కూడా ఇంటికి పంపించేవాడు. అయితే ఏమైందో తెలియదుగాని ఎనిమిది నెలలుగా దుర్గారావు నుంచి ఎటువంటి ఫోన్‌ సమాచారం లేదు.

ఆ దేశంలోనే ఉండే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరో వ్యక్తి దుర్గారావు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశాడు. దుర్గారావును పోలీసులు తీసుకెళ్లారని చెప్పినట్లు దుర్గారావు తల్లి కమల, భార్య దుర్గ చెబుతున్నారు. దాదాపు ఎనిమిది నెలలుగా అతని జాడ లేకపోవడంతో కమల, దుర్గ తీవ్రంగా కలత చెందుతున్నారు. పిల్లలు కూడా బెంగపెట్టుకున్నారు. మలేషియాలో దుర్గారావు అదృశ్యమైన విషయంపై అతని భార్య దుర్గ, తల్లి కమల మూడు నెలల కిందట జిల్లా కలెక్టర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదని వాపోతున్నారు. దేశంకాని దేశంలో దుర్గారావు ఎటువంటి ఆపదలో ఉన్నాడోనని అతని భార్య, తల్లి ఆందోళన చెందుతున్నారు. తన భర్త విషయం తెలుసుకునేందుకు తమకు ఏమి చేయాలో కూడా తెలియడం లేదని దుర్గ కన్నీళ్ల పర్యంతమైంది. ఉన్నతాధికారులు స్పందించి తన భర్తను స్వదేశానికి రప్పించే ఏర్పాటు చేయాలని మొరపెట్టుకుంటోంది. దుర్గారావు మలేషియాలో అదృశ్యమైన విషయం తెలిసి గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, కేంద్ర ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల శాఖ స్పందించి దుర్గారావును స్వదేశానికి రప్పించేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top