
‘చంద్ర' గ్రహణం
కడప రూరల్ : జిల్లాలోని నిరుపేదలు కట్టుకున్న ఇంటికి, కట్టుకోబోతున్న వాటికి బిల్లులుమంజూరు కాకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
నిరుపేదలు కష్టపడి నిర్మించుకున్న గృహాలకు, వివిధ నిర్మాణాల దశలో నిలిచిన వాటికి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడంలేదు. ఫలితంగా అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్న వారు, ఎలాగోలా నిర్మించుకుందామనే వారికి బిల్లులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అర్హులైనవేలాది మంది గృహాల మంజూరుకు ఎదురు చూస్తున్నారు. బిల్లుల చెల్లింపునకు, కొత్త గృహాల మంజూరుకు పట్టిన ‘చంద్ర’గ్రహణం ఎప్పుడు వీడుతుందోనని ఎదురు చూస్తున్నారు.
కడప రూరల్ : జిల్లాలోని నిరుపేదలు కట్టుకున్న ఇంటికి, కట్టుకోబోతున్న వాటికి బిల్లులుమంజూరు కాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఫలితంగా వేలాది మంది నిరాశకు లోనవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోకపోతే సొంతింటి కల ‘కల’గానే మిగిలిపోతుందని వాపోతున్నారు.
గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో జిల్లాలో 2011 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు జరిగిన రచ్చబండ ద్వారా గృహాల మంజూరు కోసం జిల్లా గృహ నిర్మాణసంస్థకు 1,43,848 మంది నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 52,862మందిని అర్హులుగా గుర్తించారు. తర్వాత జరిగిన రచ్చబండ-2 ద్వారా 73,599 మంది దరఖాస్తు చేసుకోగా, 34546 మందిని అర్హులుగా గుర్తించారు. మొత్తం 2,17,448 దరఖాస్తులు రాగా, 87,408 మందిని అర్హులుగా గుర్తించారు. అందులో 28,612 గృహాలను మంజూరు చేశారు. ఆ ప్రకారం 17,108 గృహాలు పూర్తి కాగా, 11,424 గృహాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి.
రూ.72.48 కోట్ల మేరకు ఆగిన బిల్లులు
దాదాపు రూ. 72.48 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ సంస్థ ద్వారా బిల్లులను లబ్ధిదారులకు చెల్లించకుండా నిలుపుదల చేసింది. పూర్తయిన17,188 గృహాలలో 3987 మంది లబ్ధిదారులకు తక్షణమే రూ. 21.08 కోట్లను చెల్లించాల్సి ఉంది. అలాగే బిల్లులు మంజూరు కానందున వివిధ దశల్లో నిలిచిపోయిన 11424 గృహాలకు దాదాపు రూ.51.40 కోట్లు అందాల్సి ఉంది.
అడకత్తెరలో 58,796 మంది అర్హులు
కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో వచ్చిన, అధికారులు గుర్తించిన మొత్తం 87,408 మంది అర్హుల జాబితాలో 58,796 మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నాడు కొత్త గృహాలను జీఓ 33, 44, 23 కింద మంజూరు చేసిన తరుణంలో ఎన్నికల కోడ్ వచ్చింది. అనంతరం ప్రభుత్వం మారింది. దీంతో కిరణ్ పాలనలో 58,796 మంది మిగిలారు. అలాగే అసంపూర్తిగా వివిధ నిర్మాణ దశల్లో 11,424 గృహాలు నిలిచిపోయాయి. ఇంటి నిర్మాణాలు పూర్తి చేసిన 3987 మందికి ప్రభుత్వం బిల్లులను మంజూరు చేయలేదు.
మే నెలలో ఆన్‌లైన్ నిలుపుదల
ప్రభుత్వం గడిచిన మే నెల నుంచి ఆన్‌లైన్ పనులను నిలుపుదల చేసింది. ఫలితంగా బిల్లులు నిలిచిపోయాయి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఇంటి నిర్మాణం, లబ్ధిదారుల వివరాలు తెలుసుకోవడం కష్టతరంగా మారింది. ఆన్‌లైన్ (వెబ్‌సైట్) వ్యవస్థ పనిచేస్తేగానీ లబ్ధిదారుల బిల్లులకు మోక్షం లభించదు. ప్రభుత్వం చొరవ చూపి అనుమతిస్తేనే అది సాధ్యపడుతుంది.
ప్రభుత్వానికి పట్టని నిరుపేదల ‘గూడు’ గోడు
గత ప్రభుత్వంలో కొత్త గృహాలకు అర్హులుగా మిగిలిన వారు, పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారు ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పాలకులు ఇంతవరకు ఆ ఊసే ఎత్తకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. ఇంతవరకు కొత్తగా గృహాలను మంజూరు చేయకపోగా, గతంలోని వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి నిరుపేదల గూడు గోడు పట్టడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో..
రచ్చబండకు వచ్చిన మొత్తం
దరఖాస్తులు 2,17,448
అందులో అర్హులు 87,408
మంజూరు అయినవి 28,612
పూర్తయిన గృహాలు 17,188
నిర్మాణ దశల్లో నిలిచినవి 11,424
మొత్తం బిల్లుల చెల్లింపునకు
అవసరం దాదాపుగా రూ.72.48 కోట్లు
అంతుచిక్కని
అర్హుల సంఖ్య 58,796