పట్టు తప్పుతున్న ప్లానింగ్‌

Loosing Grip In Vizag Muncipal Corporation - Sakshi

సాక్షి, విశాఖపట్నం : మహా విశాఖ నగరంలో టౌన్‌ ప్లానింగ్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందా? ఉన్న అధికారాలన్నీ టీడీపీ ఎమ్మెల్యేల గుప్పిట్లో బందీ అయ్యాయా? అంటే అవుననే స్పష్టమవుతోంది. ఎమ్మెల్యేలు చెప్పినట్లు వినకపోతే ఉద్యోగానికి భద్రత ఉండదనే భయంతో ఐదేళ్ల పాటు వారు చెప్పినట్లే వినాల్సిన పరిస్థితి. గత కమిషనర్‌ సైతం ఈ విభాగంపై సరైన దృష్టి సారించలేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. స్వచ్ఛభారత్, పారిశుద్ధ్యం, నీటి సరఫరా తదితర ప్రాథమిక అవసరాలపైనే దృష్టి సారించారు తప్ప టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఏం జరుగుతుందనే విషయాలను పట్టించుకోలేదనీ అంటున్నారు. ఆఖరి కొద్ది నెలల్లో పట్టణ ప్రణాళిక విభాగం గురించి ఆలోచించినా.. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. సరైన మోనటరింగ్‌ వ్యవస్థ లేకపోవడం, ఎమ్మెల్యేల పెత్తనంతో టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది వారు చెప్పిందే చేస్తూ జోన్లను ప్రత్యేక వ్యవస్థలుగా మలచుకున్నారు.

వేధిస్తున్న సిబ్బంది కొరత
గతంలో ప్రతి జోన్‌కు ఇద్దరు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు చైన్‌మెన్‌ ఉండేవారు. ఎక్కడైనా అక్రమ నిర్మాణం కానీ, ఆక్రమణలు కానీ కనిపిస్తే ప్రధాన కార్యాలయానికి నేరుగా సమాచారం అందించేవారు. కానీ ఇప్పుడు టౌన్‌ ప్లానింగ్‌ విభాగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రతి జోనల్‌ కార్యాలయంలో ఏసీపీ, టీపీఎస్, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పైనే టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఆధారపడి పనిచేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక జీవీఎంసీ విషయానికొస్తే.. ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

ఒక్క బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా లేరాయె..
విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఉన్న సమయంలో 110 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో నలుగురు సూపర్‌వైజర్లు, ముగ్గురు ఏసీపీలు, ముగ్గురు టీపీవోలు, ఒక సిటీ ప్లానర్‌ ఉండేవారు. 2006లో 600 చ.కి.మీ.కి పైగా విస్తీర్ణం పెరిగిన జీవీఎంసీలో 25 మంది సూపర్‌ వైజర్లు, 11 మంది టీపీవోలు, 11మంది ఏసీపీలు, నలుగురు డీసీపీలు, ఇద్దరు సిటీ ప్లానర్లు, ఒక చీఫ్‌ సిటీ ప్లానర్‌ ఉండాలి. కానీ ఒకే ఒక్క సిటీ ప్లానర్, ఒక డీసీపీ, 8 మంది ఏసీపీలు, 11 మంది టీపీవోలు, 15 మంది సూపర్‌వైజర్లు మాత్రమే ఉన్నారు. వీరికి తోడుగా 30 మంది అప్రెంటిస్‌ను గత ప్రభుత్వం నియమించింది. కానీ, వీరిని సాంకేతిక సలహాలకు మాత్రమే తప్ప క్షేత్రస్థాయి పరిశీలనలకు వినియోగించకూడదు.

జీవీఎంసీ విస్తీర్ణం ప్రకారం 50 మంది సూపర్‌వైజర్లు ఉండాలి, కానీ నగరంలో ఒక్క బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా లేకపోవడం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అద్దం పడుతోంది. దీనివల్ల క్షేత్ర స్థాయి పరిశీలనలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విభాగాన్ని గాడిలో పెట్టాలంటే కొత్త కమిషనర్‌ సృజన కఠిన చర్యలు అవలంబించాల్సిందే. సిబ్బంది భర్తీకి చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తే తప్ప అనధికారిక కట్టడాలకు చెక్‌ పెట్టలేరు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top