పెళ్లిళ్లకూ లాక్‌డౌన్‌

Lockdown Marriages in West Godavari - Sakshi

కరోనాతో వాయిదా పడిన వైనం

ఇళ్ల వద్దే తంతు ముగిస్తున్న వారు 10 శాతం

పలు వ్యాపారాలపై కోవిడ్‌ ప్రభావం  

ఈనెల 9 వరకు మూఢం

ద్వారకాతిరుమల: కల్యాణం.. కమనీయం.. జీవితం. పెళ్లంటే నూరేళ్ల పంట.. ఆ నూరేళ్ల వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని వేలాది జంటలు ముచ్చటపడ్డాయి.. నింగి.. నేలా ఒక్కటయ్యేలా వివాహాలు జరుపుకోవాలని తహతహలాడాయి. ఇంతలో కరోనా మహ మ్మారి వారి ఆనందంపై నీళ్లు చిమ్మింది. లాక్‌డౌన్‌ కారణంగా జిల్లాలో దాదాపు 90 శాతం పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. దీంతో వైశాఖ మాసం ప్రారంభమైన ఏప్రిల్‌ 24 నుంచి మే 22 వరకు, జ్యేష్ఠమాసం ప్రారంభమైన మే 23 నుంచి ఇప్పటి వరకు పురోహితుల వేద మంత్రోచ్ఛ రణలు, డోలు, సన్నాయి వాయి ద్యాలు వినబడలేదు. ఆర్కెస్ట్రాలు, మైక్‌సెట్లు, డిజే సౌండ్లు మూగబోయాయి. కల్యాణ మండపాలు నిర్మానుష్యంగా మారాయి. వందలాది వివాహాలకు వేదిక కావాల్సిన ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం వెల వెలబోయింది. వివాహాలతో ముడిపడి ఉన్న వేలాది మంది వ్యాపారులు, కుల వృత్తిదారులు జీవనోపాధిని కోల్పోయారు. 

వెయ్యికి పైగా క్షేత్రంలోనే..
జిల్లావ్యాప్తంగా ఏటా వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో దాదాపు 2,250 వరకు వివాహాలు జరిగేవి. ఇందులో వెయ్యికి పైగా పెళ్లిళ్లు ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలోనే జరుగుతాయి. అయితే కోవిడ్‌–19 నివారణా చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఏడాది క్షేత్రంలో ఒక్క వివాహం కూడా జరగలేదు. బలమైన ముహూర్తం, సెంటిమెంట్‌ ఉన్న వారు మాత్రం అనుకున్న సమయానికి ఇళ్ల వద్దే తంతు జరిపించారు. అనంతరం క్షేత్రానికి వచ్చి ఆలయం బయట నుంచే స్వామివారికి దండం పెట్టుకుని వెళ్లిపోయారు. ఇలా ఈ ఏడాది జిల్లాలో ఎక్కడా వివాహ సందడి కానరాలేదు. పలువురు గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలను సైతం వాయిదా వేసుకున్నారు. ఇదిలా ఉండగా మే 30 నుంచి మూఢం మొదలైంది. 

ఉపాధిపై కరోనా కాటు
వివాహాలు, ఇతర శుభకార్యాలతో ముడిపడి ఉన్న అనేక రంగాల వారిపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫంక్షన్‌ హాల్స్, సన్నాయి మేళాలు, డిజైన్లు, బ్యాండ్, వంటలు వండేవారు, క్యాటరింగ్, ఈవెంట్‌ మేనేజర్లు, మేకప్, పెళ్లి దుస్తులు కుట్టేవారు, పురోహితులు, వీడియో, ఫొటోగ్రాఫర్లు, బంగారం, దుస్తులు, పూలు, కూరగాయల రైతులు, చికెన్, మటన్‌ వ్యాపారులు, ట్రావెల్స్, టెంట్‌ హౌస్‌ వ్యాపారం చేసే వారు ఇలా చాలా మంది ఉపాధిపై కరోనా కోలుకోలేని దెబ్బకొట్టింది. వెయ్యి మందికి పైగా జనం పట్టే ఫంక్షన్‌ హాల్సు యజమానులు, ఈ రెండు నెలల సీజన్‌లో ఒక్కొక్కరు సుమారు రూ.25 లక్షల ఆదాయాన్ని కోల్పోయారు. వివాహాది శుభకార్యాల నిమిత్తం శ్రీవారి దేవస్థానంలో కల్యాణ మండపాలు, గదులు ముందుగా బుక్‌ చేసుకున్న వారికి ఆలయ అధికారులు తిరిగి రూ.18 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్‌ తొలగించిన తరువాత వేరే తేదీలో శుభకార్యం జరుపుకునేందుకు ఇష్టపడితే రుసుం వెనక్కి చెల్లించమని అధికారులు తెలిపారు.

ముహూర్తాలు ఇలా..  
మే 30 నుంచి జూన్‌ 9 వరకు మూఢం కారణంగా శుభకార్యాలు జరగవు.
జూన్‌ 10, 11 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి.  
ఆషాఢం కారణంగా జూన్‌ 22 నుంచి జూలై 20 వరకు శుభకార్యాలు జరగవు.  
జూలై 23, 24, 25, ఆగస్టు 2, 7, 14 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.   
ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు భాద్రపదం, శూన్యమాసం కారణంగా శుభకార్యాలు జరగవు.   
సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 10 వరకు ఆశ్వయుజ మాసంలో గట్టి ముహూర్తాలు లేవు.
అక్టోబర్‌ 21, 28, 29, 30, నవంబర్‌ 6, 11 నుంచి డిసెంబర్‌ 6 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి.  

కుటుంబ పోషణ భారమైంది
చినవెంకన్న క్షేత్రంలో ఏటా వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో అధికంగా వివాహాలు జరిగేవి. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఏడాది ఒక్క పెళ్లి కూడా జరగలేదు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. వివాహాది శుభకార్యాలపై ఆధారపడిన వ్యాపారులందరి పరిస్థితి ఇలానే ఉంది. కరోనా ప్రతిఒక్కరిని కోలుకోలేని దెబ్బకొట్టింది. –గోవిందవఝుల వెంకటరమణమూర్తిశర్మ,పురోహితులు, ద్వారకాతిరుమల 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top