పరకాల, రామోజీలకు లీగల్ నోటీసులు


తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరించారని ఎమ్మెల్యే చెవిరెడ్డి మండిపాటుతిరుపతి: తన పరువుకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, తన వివరణ తీసుకోకుండానే దురుద్దేశంతో ఆ ఆరోపణలను ప్రచురించిన ‘ఈనాడు’ సంస్థల అధిపతి రామోజీరావుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మంగళవారం లీగల్ నోటీసులు పంపారు. నోటీసు అందిన 15 రోజుల్లోపు నష్టపరి హారంగా రూ. 20 లక్షలు చెల్లించాలని  పేర్కొన్నారు.  ‘చెవిరెడ్డి తండ్రి సుబ్రమణ్యంరెడ్డికి పింఛను వస్తుందని, ఆ పింఛను ఎవరు తీసుకుంటున్నారో చెప్పాలని, చెవిరెడ్డి తండ్రికి పింఛను ఇవ్వాలా, దీనిపై జగన్‌మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి’ అని పత్రికా సమావేశంలో పరకాల ప్రభాకర్ ఇటీవల సవాల్  విసిరారు. దీనిని ‘ఈనాడు’ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది.కనీసం తాను వివరణ ఇచ్చినా ఈనాడు పత్రిక పట్టించుకోలేదని, దురుద్దేశ పూర్వకంగానే తన పరువుకు భంగం కలిగించేలా పరకాల, ఈనాడు యాజమాన్యం ప్రవర్తించినట్టు చెవిరెడ్డి నోటీసులో పేర్కొన్నారు. కాగా, తనతండ్రి  దరఖాస్తు చేయకున్నా అర్హుల జాబితాలోకి ఆయన పేరు ఎలా వచ్చిందో చెప్పాలంటూ అధికారులను చెవిరెడ్డి రాతపూర్వకంగా కోరారు. ‘‘అధికారుల పొరపాటు వల్లే పింఛను జాబి తాలోకి మీ తండ్రి పేరు చేరింది. అందులో మీ ప్రమేయం లేదు. ఏ రోజూ పింఛను డబ్బు తీసుకోలేదు’’ అని అధికారులు రాత పూర్వకంగా ఎమ్మెల్యే చెవిరెడ్డికి సమాధానం ఇచ్చారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top