కౌలు రైతుకు మొండిచేయి | Lease farmer | Sakshi
Sakshi News home page

కౌలు రైతుకు మొండిచేయి

Feb 15 2015 2:42 AM | Updated on Sep 2 2017 9:19 PM

కౌలు రైతులకు ప్రభుత్వాలు రేపిన ఆశలు ఓటికుండలయ్యాయి. రుణ అర్హత కార్డుల పేరుతో చేసిన హడావిడి కార్డులకే పరిమితమైంది.

కౌలు రైతులకు ప్రభుత్వాలు రేపిన ఆశలు ఓటికుండలయ్యాయి. రుణ అర్హత కార్డుల పేరుతో చేసిన హడావిడి కార్డులకే పరిమితమైంది. 2014-15 ఏడాదికి గాను జిల్లాలో 5698 మంది కౌలు రైతులను రుణం పొందేందుకు అర్హులుగా ప్రకటించారు. మిగతా రైతులతో సమానంగా వీరికీ రుణాలిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, బ్యాంకర్లు చివరకు మొండిచేయి చూపారు. అర్హులైన వారిలో ఇప్పటి వరకు 11 మందికే రుణం దక్కింది. రబీ సీజను కూడా ముగుస్తున్న నేపధ్యంలో మిగిలిన వారిలో ఎంతమందికి రుణాలు దక్కుతాయనేది అనుమానమే.
 
 కడప అగ్రికల్చర్ : రుణ అర్హత కార్డుల వల్ల కౌలు రైతులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసినా వాస్తవంగా ఎందుకు పనికిరావని తేలిపోయింది. 2014-15 సంవత్సరానికి కార్డులు జారీ చేసేందుకు మే నెలలో రెవిన్యూ గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని 945 రెవిన్యూ గ్రామాలలో సభలు నిర్వహించి 6300 దరఖాస్తులు స్వీకరించారు. అందులో 602 మందిని అనర్హులుగా తేల్చారు. మిగిలిన 5698 మందికి రుణాలు అందిస్తామని చెప్పారు, ఖరీఫ్ సీజన్ పోయింది, రబీ సీజన్ కూడా పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు కేవలం 11 మంది రైతులకు రూ.1.65 లక్షల రుణం మాత్రమే అందించారు. ఇలా ఉంది మన ప్రభుత్వ వ్యవసాయ రుణాల పంపిణీ తీరు అని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. 2011-12లో ప్రభుత్వం తొలిసారిగా కౌలురైతులను ఆదుకునేందుకు కౌలు రుణ అర్హత చట్టాన్ని తీసుకువచ్చి, కార్డుల జారీ ప్రక్రియను చేపట్టింది. ఇవి ఏడాది పాటు చెల్లుబాటు అయ్యేటట్లు చర్యలు తీసుకున్నారు. ఈ కార్డుల ద్వారా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, ఇన్‌పుట్ సబ్సిడీ పొందవచ్చు. ప్రధానంగా బ్యాంకుల నుంచి  పంట రుణాలు పొందే వీలుంటుందని స్పష్టం చేశారు. అయితే ఈ కార్డులను బ్యాంకర్లు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. 2012-13లో జిల్లాలో 2088 మంది అర్హత సాధించారు.
 
 వీరిలో 1205 మందికి రూ.1.65 కోట్ల రుణం ఇచ్చారు. అటు తరువాత 2013-14లో 9905 మందికి కార్డులు ఇవ్వగా అతి కష్టమీద 1410 మందికి * 2.04 కోట్లు మాత్రమే రుణం అందిచారు. అయితే సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందనేలేదు. ఇన్‌పుట్ సబ్సిడీ సంగతి సరేసరి. యజమానులే సంబంధిత భూములపై అన్ని ప్రయోజనాలు పొందారు. ఇక మీకొచ్చేది ఏమి లేదంటూ బ్యాంకర్లు, అధికారులు తేల్చిచెప్పారు. చివరికి ఈ కార్డుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కౌలు రైతులు గ్రహించారు.
 
 ముగుస్తున్న సీజన్... అందరికీ రుణాలు అనుమానమే..
 ఈ ఆర్థిక సంవత్సరం చివరి కొద్ది రోజుల్లో ఇంకెంతమంది కౌలు రైతులకు రుణాలు అందుతాయన్నది ప్రశ్నార్థకమే. కౌలు రైతులు రుణ అర్హత కార్డులను నమ్ముకుని పంటల సాగు కోసం ప్రయివేటుగా అప్పులు తెచ్చుకున్నారు. రుణాలపై ప్రభుత్వం ఎటూ తేల్చి చెప్పకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. అందునా ఈ నెలాఖరు వరకే పంట రుణాలు ఇచ్చేదని, అటు తరువాత రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ స్థితిలో రుణ అర్హత కార్డులు పొంది కూడా ప్రయోజనం లేకుండా పోయిందని కౌలు రైతులు మధన పడుతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement