ఎత్తిపోతలు మొదలైనా చేరని పుష్కర జలాలు | Lakes And Reservoirs Dried In East Godavari District | Sakshi
Sakshi News home page

ఎత్తిపోతలు మొదలైనా చేరని పుష్కర జలాలు

Jul 17 2019 11:14 AM | Updated on Jul 17 2019 11:14 AM

Lakes And Reservoirs Dried In East Godavari District - Sakshi

తుని మండలం గవరపేట వద్ద సాగునీటి జాడలేని పుష్కర కాలువ

సాక్షి, తుని(తూర్పు గోదావరి): ఖరీఫ్‌లో సకాలంలో వరినాట్లు వేద్దామని భావించిన రైతులకు నిరాశే మిగులుతోంది. ఈ నెల మొదట వారంలో వేసిస నారుమళ్లు సాగునీటి ఎద్దడితో ఎండిపోతున్నాయి. ఇప్పటికే చెరువులు, రిజర్వాయర్లలో చుక్కనీరులేక వెలవెలబోతున్నాయి. ఈ నెల పదో తేదీన పురుషోత్తంపట్నం వద్ద పుష్కర ఎత్తిపోతలు పథకాన్ని ప్రారంభించినా మెట్టప్రాంతానికి గోదావరి జిలాలు చేరనేలేదు. వరుణుడు కరుణిస్తేనే ఖరీఫ్‌ నాట్లు సాధ్యమవుతాయని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వివిధ దేవాలయాల్లో వేదపండితులు, అర్చకులు వర్షాలు కురవాలంటూ వరుణ జపాలు, విరాటపర్వం పారాయణాలు చేస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తేనే ఈ సంవత్సరం ఖరీఫ్‌ గట్టెక్కుతుందని రైతులు అంటున్నారు.

నియోజకవర్గంలో 29 వేల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉంది. ఇందుకు పంపా, తాండవ రిజర్వాయర్లతో పాటు పుష్కర ఎత్తిపోతలు, పిఠాపురం బ్రాంచి కెనాల్, చెరువులు, విద్యుత్‌ బోరుబావులతో పాటు వర్షాధారం సాగునీరు అందాల్సి ఉంది. ఏటా మెట్ట ప్రాంతంలో రైతులు జూన్‌లో తొలకరి వర్షాలకు నారుమళ్లు, జూలైలో వర్షాలకు వరినాట్లు వేస్తున్నారు. అందుకు భిన్నంగా ఈ సంవత్సరం వర్షాలు పూర్తి స్థాయిలో కువలేదు. అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు ఆరుతడి పంటలతో పాటు రైతులు వరినార్లు వేశారు. 

డెడ్‌ స్టోరేజీల్లో రిజర్వాయర్లు 
నియోజకవర్గంలో తొండంగి మండలానికి పంపా రిజర్వాయర్, కోటనందూరు మండలానికి తాండవ రిజర్వాయర్‌లు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. తుని మండలంలో కొంత భాగానికి  పుష్కర జలాలు, మరికొంత భాగానికి తాండవ జలాలు, మిగిలిన భూములను చెరువులు, విద్యుత్‌ బోర్ల ఆధారంగా సాగుచేస్తున్నారు. తొండంగి మండలంలో 13500 ఎకరాలకు సాగునీరు అందించే పంపా రిజర్వాయర్‌ నుంచి విడుదల చేసేందుకు చుక్కనీరు అందుబాటులో లేదు. 105 అడుగుల నీటి నిల్వ సామార్థ్యం గల రిజర్వాయర్‌లో నీటి నిల్వలు అడుగంటాయి. భారీ వర్షాలు, పుష్కర జలాలు చేరితేనే పంపాకు జల కళ వస్తుంది. అప్పుడు ఆయకట్టుకు సాగునీరు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కోటనందూరు మండలంలో తొమ్మిది వేల ఎకరాలకు తాండవ రిజర్వాయర్‌ నుంచి సాగునీరు చేరాల్సి ఉంది. 380 అడుగుల నీటి నిల్వ సామార్థ్యం గల రిజర్వాయర్‌లో 345 అడుగుల నీరు ఉంది. డెడ్‌ స్టోరేజీ 340 కంటే ఐదు అడుగులు నీరుంది. దిగువకు విడుదల చేసేందుకు అవసరమైన నీటి నిల్వలు లేవు. వర్షాధారంగానే తాండవ జలాశయంలోకి నీటి నిల్వలు  చేరాల్సి ఉంది.

భారీ వర్షాలు కురిస్తేనే తాండవకు జల కళ వస్తుంది. ఆ నీటినే దిగువకు విడుదల చేయాల్సి ఉంది. తుని మండలంలో సాగునీటి పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. పుష్కర కాలువ ద్వారా 6500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నా గత ఐదేళ్లలో రెండు వేల ఎకరాలకే నీరు ఇస్తున్నారు. తాండవ నుంచి డి.పోలవరం చెరువుకు నీరు చేరడం ద్వారా ఆయకట్టుకు నీరు అందుతుంది. ఇప్పుడా పరిస్థితులు సన్నగిల్లాయి. తాండవలో చుక్కనీరు లేకపోవడం, వర్షాలు కురవకపోవడంతో సాగునీటి జాడ కనిపించడంలేదు. మండలంలో 77 చెరువులు ఉన్నా 70 చెరువులు ఎండిపోయాయి. ఎటుచూసినా నీటి అవసరాలు తీరే మార్గం కనిపించడంలేదని రైతులు వాపోతున్నారు. అన్నిటికి ఒక్కటే పరిష్కారంగా భారీ వర్షాలు కురవాలని రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. 

వరుణుడు కరుణిస్తేనే..
సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉన్నా వరుణుడు కరుణిస్తేనే ఖరీఫ్‌ సాగు చేయగలం. పుష్కర ఎత్తిపోతల నుంచి నీరు విడుదలైనా పూర్తి స్థాయిలో పంట పొలాలకు చేరదు. వర్షాలు కురిస్తే కొంత మేరకు రైతులందరికీ సాగునీరు లభిస్తుంది. భారీ వర్షాలు కురిస్తేనే పుష్కర, తాండవ, పంపా రిజర్వాయర్లకు జలకళ వస్తుంది. 
– పి.మాణిక్యాలరావు, రైతు, టి.తిమ్మాపురం
వారంలో పుష్కర జలాలు 
ఈ నెల పదో తేదీన పుష్కర ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల్లో 50 కిలో మీటర్ల వరకూ కాలువకు నీరు వచ్చింది. వారం రోజుల్లో తుని మండలానికి పుష్కర జలాలు చేరుతాయి.  పంపా రిజర్వాయర్‌కు నీరు మళ్లించి తొండంగి, తుని మండలాలకు సాగునీరు అందిస్తాం.                           
– డి.సూర్యనారాయణ, పుష్కర ఏఈ. తుని

1
1/1

పోలవరంలో నీటి ఎద్దడితో ఎండుతున్న వరి నారుమడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement