విసిగి.. వేసారి !

Krishnaveni Want To Survey Her Land From 2007 In Guntur - Sakshi

 2007 నుంచి సర్వే చేయాలని విన్నపం

వివాదాస్పద భూమి అంటూ అధికారుల దాటవేత

తీవ్ర ఆవేదనలో బాధిత మహిళ

తెనాలి: తన 25 సెంట్ల భూమి సర్వేకు 2007 నుంచి రెవెన్యూ అధికారులు కాళ్లరిగేలా తిప్పుతున్నారని కృష్ణవేణి అనే మహిళ  స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన ‘మీకోసం’లో తన గోడును మరోసారి ఆర్డీవోకు విన్నవించుకుందామని ఆమె గుంటూరు నుంచి వచ్చారు. తీరా ఆర్డీవో జి.నరసింహులు బదిలీపై వెళ్లారని తెలిసి నిరాశకు లోనయ్యారు. తహసీల్దారు, ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ ఏళ్లుగా తిరగడమే తనకు సరిపోతోందనీ, సర్వేలకని, పట్టాదారు పుస్తకాలకని, కిందిస్థాయి ఉద్యోగులకని, ఖర్చులకనీ ఇప్పటికే లక్ష రూపాయలకు పైగా ఖర్చయ్యాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... తెనాలి రూరల్‌ మండలం గుడివాడలో సర్వేనంబరు 148సి–5బిలో 25 సెంట్ల మాగాణి భూమి కృష్ణవేణి తండ్రి కంచర్ల నాగేశ్వరరావు పేరిట ఉంది. 2007 నుంచి సర్వే చేయించాలని కోరుతూ వచ్చారు. సాధ్యపడలేదు. ఆయన మరణించాక  వీలునామా ప్రకారం తన పేరును అడంగల్‌లో చేర్చి, పట్టాదారు పుస్తకం ఇప్పించాలని దరఖాస్తు చేశారు. ఎలాంటి స్పందన లేకపోవటంతో జిల్లా కలెక్టరును కలిశారు. జిల్లా సర్వే, లాండ్‌ రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి.కెజియాకుమారి కూడా ఆర్డీవోకు రిఫర్‌ చేశారు. ఈ క్రమంలోనే కృష్ణవేణి 2015లో 20 సెంట్ల భూమిని వేరొకరికి విక్రయించారు. అడంగల్‌లో నమోదు కానందున అగ్రిమెంటు ప్రకారం వారు రూ.25 వేల అడ్వాన్సు మినహా డబ్బు మొత్తాన్ని చెల్లించలేదు.

ఇదిలా ఉంటే, వీలునామాను పరిగణనలోకి తీసుకోవాల్సిన మండల తహసీల్దారు ఆ భూమి వివాదంలో ఉందనీ, కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలంటూ ఇటీవల నివేదించారని కృష్ణవేణి చెప్పారు. ప్రస్తుతం ఆ భూమి ఇతరుల స్వాధీనంలో ఉందనీ, 1987లోనే వారి పెద్దలకు కృష్ణవేణి తండ్రి నాగేశ్వరరావు విక్రయ అగ్రిమెంటు రాశారనీ, మళ్లీ ఇప్పుడు వారి వారసుడితోనే కృష్ణవేణి విక్రయ అగ్రిమెంటు చేసుకున్నారని తహసీల్దారు ఆ నివేదికలో పేర్కొన్నారు. అడ్వాన్సు రూ.25 వేలు మినహా మిగిలిన రూ.4.75 లక్షలు చెల్లించనందున వివాదం నెలకొందని, కోర్టులో పరిష్కరించుకోవాలని హితవు చెప్పారు. 1987లో విక్రయ ఒప్పందం ఉంటే ఎందుకు రిజిస్టరు చేసుకోలేదు? అలాంటి ఒప్పందం ఉంటే వారి వారసులే ఈ భూమిని తన దగ్గర ఎందుకు కొంటారు? అడంగల్‌లో నమోదు కానపుడు పూర్తి డబ్బులు ఎందుకు చెల్లిస్తారు? అసలు వీలునామా ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇవన్నీ ఎందుకు? అనే కృష్ణవేణి ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పటం లేదు. గుడివాడ గ్రామ అధికార పార్టీ నేత జోక్యంతో మండల తహసీల్దారు ఈవిధంగా చేశారని కృష్ణవేణి ఆరోపించారు. విసిగివేసారి తక్కువ ధరకు భూమిని అమ్మేసుకొనేలా చేయాలనే కుట్ర జరుగుతోందన్న సందేహాన్ని ఆమె వ్యక్తం చేశారు.

‘మీకోసం’లో మూడు అర్జీలు...
‘మీకోసం’లో అర్జీలను ఆర్డీవో కార్యాలయ ఏవో ఎ.చెంచులక్ష్మి స్వీకరించారు. రూరల్‌ మండలం బుర్రిపాలెంలో తన 18 సెంట్ల స్థలంలో రోడ్డు నిమిత్తం వదిలిన 3 సెంట్ల స్థలం ఆక్రమణకు గురైందనీ, విచారించి న్యాయం చేయాలని శాఖమూరి సామ్రాజ్యం అర్జీనిచ్చారు. అమృతలూరు మండలం మూల్పూరులో తన పొరుగు రైతు పసుపులేటి శ్రీను పంటకాలువ మూసేసి, తన పొలానికి నీళ్లు రాకుండా చేస్తున్నారని భవనాసి ఆశీర్వాదం అర్జీలో ఆరోపిస్తూ, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణ బాలాజీరావుపేటలో ప్రభుత్వ ఖాళీస్థలంలో రేకుల షెడ్డు వేసుకుని గత 30 ఏళ్లుగా జీవిస్తున్న తనకు పట్టాను ఇప్పించాలని కోరుతూ పాలపర్తి మహాలక్ష్మి అనే మహిళ అర్జీనిచ్చారు. విద్యుత్‌ సమస్యలపై రూరల్‌ మండలం చావావారిపాలెం నివాసి భవతుల రవి, అమృతలూరు మండలం యడవూరు గ్రామస్తులు ఇచ్చిన అర్జీలను ‘మీకోసం’లో ఉన్న విద్యుత్‌ డీఈఈకి చర్యల నిమిత్తం ఇచ్చారు. వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top