కొజ్జేపల్లి పేరు మార్చుకోవచ్చు

Kojjepalli Name Change Orders Given By Revenue Officer Ananthapur - Sakshi

డీఆర్‌ఓ రఘునాథ్‌

గుత్తి రూరల్‌ పరిధిలోని కొజ్జేపల్లి గ్రామం పేరు మార్చుకునేందుకు వీలు ఉందని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌. రఘునాథ్‌ చెప్పారు. ఊరిపేరుతో కొజ్జేపల్లి వాసులు ఇబ్బంది పడుతున్న  వైనాన్ని ‘సాక్షి’ మంగళవారం ‘గ్రామం తలెత్తుకొని..పేరు దాచుకొని’ శీర్షికతో కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన డీఆర్‌ఓ ఆ గ్రామం పేరును అధికారికంగా మార్చుకునే వీలుందని స్పష్టం చేశారు.  

అనంతపురం అర్బన్‌: గుత్తి రూరల్‌ పరిధిలోని కొజ్జేపల్లి గ్రామం పేరు మార్చుకునేందుకు వీలు ఉందని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌. రఘునాథ్‌ చెప్పారు. ఊరిపేరు ఇబ్బందిగా మారడంతో కొజ్జేపల్లి దీనావస్థను ‘సాక్షి’ మంగళవారం ‘గ్రామం తలెత్తుకొని..పేరు దాచుకొని’’ శీర్షికతో కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన డీఆర్‌ఓ ఆ గ్రామ పేరును అధికారికంగా మార్చుకునే వీలుందన్నారు. తమ గ్రామ పేరును ఫలానా పేరుగా మార్చాలని పంచాయతీ తీర్మానం చేయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత గెజిట్‌ కోసం జిల్లా కలెక్టర్‌కు అర్జీ పెట్టుకుంటే.. దీనిపై విచారణ చేయాలని అర్జీని ఆర్డీఓకు పంపుతారని తెలిపారు. అనంతరం ఆ అర్జీ ఆర్డీఓ నుంచి తహసీల్దార్‌కి వెళ్తుందనీ, తహసీల్దారు గ్రామానికి వెళ్లి ప్రజాభిప్రాయం సేకరిస్తారన్నారు.

గ్రామస్తులు సూచించిన పేరు జిల్లాలో ఏ గ్రామానికి లేకపోతే వారు కోరుకున్న పేరును సిఫార్సు చేస్తారన్నారు. సదరు పేరు ఇప్పటికే మరో గ్రామానికి ఉంటే గ్రామస్తులు కోరిన పేరుకు నంబరింగ్‌ ఇస్తారని డీఆర్‌ఓ తెలిపారు. ఈ పూర్తి నివేదికను ఆర్డీఓ ద్వారా కలెక్టర్‌కు పంపుతారనీ, దాన్ని కలెక్టర్‌ ప్రభుత్వానికి  పంపిస్తారన్నారు. ప్రభుత్వం నివేదికను పరిశీలించి గెజిట్‌ జారీ చేస్తుందని.. అప్పుడు ఆ గ్రామం పేరు అధికారికంగా రికార్డులో మార్పు జరుగుతుందని వెల్లడించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top