
‘పోలవరం’పై ఆర్డినెన్సును అంగీకరించొద్దు: కేసీఆర్
పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడానికి ఉద్దేశించిన ఆర్డినెన్సు ప్రతిపాదనకు అంగీకరించొద్దని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు.
రాష్ట్రపతికి కేసీఆర్ లేఖ.. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేతలతో చర్చ
సాక్షి, హైదరాబాద్: పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడానికి ఉద్దేశించిన ఆర్డినెన్సు ప్రతిపాదనకు అంగీకరించొద్దని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక లేఖ రాశారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 24 గంటలైనా పూర్తికాకముందే తెలంగాణకు అన్యాయం చేసే ఆర్డినెన్సును తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. పోలవరం ముంపు సాకుతో భద్రాచలం డివిజన్‌లోని 7 మండలాలను సీమాం ధ్రలో కలపడానికి ఈ ఆర్డినెన్సును తేవాలనుకుంటున్నట్టు తెలిపారు. దీని వెనుక గిరిజన, ఆదివాసీలను ముంపునకు గురిచేయాలని, తెలంగాణకు కరెంటులో వాటాను తగ్గించాలనే కుట్ర ఉందని ఆరోపించారు.
ఎన్నికలున్న నేతలు కనిపించొద్దు: కేసీఆర్
ఇలావుండగా మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల టీఆర్‌ఎస్ నేతలెవరూ హైదరాబాద్‌లో కనిపించొద్దని కేసీఆర్ ఆదేశించారు. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నేతలతో మంగళవారం ఆయన సమావేశం అయ్యారు. ఆదిలాబాద్‌కు చెందిన నేతలు జోగు రామన్న, జి.నగేశ్, భూమారెడ్డి తదితరులు కూడా కేసీఆర్‌ను కలిశారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కేసీఆర్‌ను కలసి తన చిన్నకుమారుని వివాహానికి ఆహ్వానించారు. పార్టీ నేతలతో భేటీ సందర్భంగా మున్సిపల్, సాధారణ ఎన్నికలకు ఏర్పాట్లపై కేసీఆర్ చర్చించారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేతలకు ఫోన్లు చేసి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఎన్నికలయ్యేదాకా హైదరాబాద్‌లో కనిపించొద్దని ఆదేశించారు. ఇలావుండగా గద్వాల వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి కృష్ణమోహన్‌రెడ్డి, గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్, నేతలు చంద్రశేఖర్‌రెడ్డి, తిరుమలరెడ్డి తదితరులు కేసీఆర్‌ను కలసినట్టుగా టీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. వీరు తమ పార్టీలకు రాజీనామా చేసి త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరతారని ఆ పార్టీ వర్గాలు తెలిపారుు.