భక్తుల లడ్డూలు..గోవిందా

Irregularities in tirupati laddu distribution - Sakshi

కౌంటర్ల వద్ద భక్తులకు బురిడీ

కాంట్రాక్టు సిబ్బందిపై ఆరోపణలు

దళారులతో చేతులు కలిపి

అక్రమ విక్రయాలు

స్పందించని నిఘా విభాగాలు

శ్రీవారి లడ్డూ ప్రసాద వితరణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. టోకెన్లకు సరిపడా లడ్డూలు ఇవ్వకుండా కౌంటర్‌ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దొడ్డిదారిన సొమ్ము చేసుకుంటున్నారు. ప్రీతిపాత్రమైన లడ్డూ అందక బాధిత భక్తులు అసంతృప్తికి లోనవుతున్నారు. నిఘా సిబ్బంది చోద్యం చూస్తున్నారు.

సాక్షి, తిరుమల: తిరుమల ఆలయం పక్కన లడ్డూ వితరణ కౌంటర్లు 61 ఉన్నాయి. వీటిలో శ్రీవారి సేవకులు 20 నిర్వహిస్తున్నారు.  బ్యాంకుల నేతృత్వంలో ఉండే మిగిలిన కౌంటర్లలో కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక్కడ కౌంటర్‌ సిబ్బంది చేతివాటం రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో లడ్డూ కౌంటర్లను శ్రీవారి సేవకులకు అప్పగించాలని నిర్ణయించారు. తొలుత 20 కౌంటర్లు అప్పగించారు. ఈ కౌంటర్ల నిర్వహణలో ఆరోపణలు లేవు. మిగిలి కౌంటర్ల విషయంలో ఆరోపణలు తారాస్థాయిలో ఉన్నాయి.  దోచుకోవడానికి సిబ్బంది వెనుకాడడం లేదు.  ఎవరి పద్ధతుల్లో వారు వారు లడ్డూలను కాజేస్తున్నారు. ఇందులో కొందరు లడ్డూలను చిలక్కొట్టుడు చేస్తుంటే, మరికొందరు భక్తుల టోకెన్లకు సరిపడా ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఏకంగా టోకెన్లు స్కానింగ్‌ కావడం లేదనే నెపంతో కోత వి«ధిస్తూ దోచుకుంటున్నారు.

లడ్డూ కౌంటర్‌లో పెరిగిన వాటాల దందా
కౌంటర్‌ సిబ్బంది భక్తుల నుంచి రోజువారీ దోచుకున్న లడ్డూలను, టోకెన్లను మధ్యవర్తులకు అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.. లడ్డూ కౌంటర్‌లో పనిచేసే కాంట్రాక్టు సి బ్బంది ఆయా బ్యాంకుల్లోని కొందరు  సిబ్బందికి కూడా వాటాలు ఇస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. అందువల్లే ఆరోపణలు ఉన్న సిబ్బందినే ఆయా బ్యాంకులు తమ కౌంటర్లలో వి«ధులు కేటాయిసున్నట్లు సమాచారం.నిజాయితీగా పనిచేసే బ్యాంకు  సిబ్బందిని సహచర సిబ్బంది బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది.

పెరుగుతున్న బాధిత భక్తులు
శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లే భక్తుల్లో ఒకరికి నాలుగు, నడచివచ్చేవారికి ఐదు, రూ.300 టికెట్లపై నాలుగు, ఆర్జిత సేవా టికెట్లపై కేటాయింపు సంఖ్యను బట్టి లడ్డూలు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు భిన్నంగా టోకెన్లకు సరిపడా లడ్డూలు ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. భక్తుల అవసరం,  తిరుగు ప్రయాణ హడావిడి, తెలియనితనాన్ని అనుకూలంగా మార్చుకుంటూ కౌంటర్‌ సిబ్బంది లడ్డూలు ఇస్తుంటారు. నాలుగురోజుల ముందు కర్ణాటకకు చెందిన భక్తుడికి ఇలాగే జరిగింది. ప్రశ్నిస్తే  కౌంటర్‌ సిబ్బంది బెదిరించారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో కౌంటర్‌ వదిలి పారిపోయాడు. రోజూ 3 లక్షల లడ్డూలు వితరణ చేసే కౌంటర్లలో ఇలాంటి చేతి వాటం చర్యలు జరుగుతున్నాయి.

విజిలెన్స్‌ నిఘా, చర్యలు అంతంతమాత్రమే
రోజూ ఫిర్యాదులు అందుతున్నా  విజిలెన్స్‌ అధికారులు  పట్టించుకోవడం లేదు. భక్తులు కోరినన్ని లడ్డూలు ఇవ్వడంలో టీటీడీ ఏమాత్రం చొరవ చూపడం లేదు. భక్తుడు నగదు చెల్లించిన టోకెన్లకు కూడా లడ్డూలు అందజేయడంలో టీటీడీ యంత్రాంగం విఫలమవుతోంది. లడ్డూ కౌంటర్లపై ఫిర్యాదులు వెల్లువలాఉన్నా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top