నిమ్మాడలో అక్రమాల జాడ | Irregularities in minister Achennayudu constituency | Sakshi
Sakshi News home page

నిమ్మాడలో అక్రమాల జాడ

Jul 29 2018 8:50 AM | Updated on Aug 30 2019 8:37 PM

Irregularities in minister Achennayudu constituency - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కింజరాపు హరిప్రసాద్‌.. సాక్షాత్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి కిం జరాపు అచ్చెన్నాయుడుకు సోదరుడు. మంత్రి ఇలాకా టెక్కలి నియోజకవర్గంలోని కోట బొమ్మాళి మండలంలో అధికార పార్టీ నాయకుడు కూడా. ఇంకా చెప్పాలంటే ఏ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులైనా ఆయనే ఏ1 కాంట్రాక్టర్‌. అంతవరకూ బాగానే ఉంది. కానీ తీసుకున్న పనుల్లోనే నాణ్యత ఉండదనే విమర్శలు బాగా వినిపిస్తూ ఉంటాయి. అంతకుమించి సొంతూరులో అదీ తమ ఇంటిపేరుతో ఉన్న చెరువు పనుల్లోనే అక్రమాలకు చోటివ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎంత అడ్డగోలు వ్యవహారమైనా అధికా రులు ప్రశ్నించలేని పరిస్థితి! పనులు సరిగా చేయకుండానే బిల్లులు క్యాష్‌ చేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 

కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడి నివాసానికి కూతవేటు దూరంలోనే కింజరాపువాని చెరువు ఉంది. ఇదే చెరువులో గత ఏడాది జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద మట్టి పనులు చేశారు. ఇందుకు సుమారు రూ.7 లక్షల మేరకు చెల్లింపులు జరిగాయి. కానీ ఈ సంవత్సరం అదే చెరువులో ‘నీరు–చెట్టు’ పథకం కింద రూ.15 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేసేందుకు సురేష్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ టెండరు దక్కించుకుంది. ఈ సంస్థ యజమాని మంత్రి సోదరుడు హరిప్రసాదే. ఇటీవల చెరువులో కొంతమేర పనులు చేశారు. అదీ తూతూ మంత్రంగానే. ఈలోగా వర్షాలు పడటంతో అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇప్పుడా చెరువును చూస్తే ఎక్కడా పనులు చేసిన ఆనవాళ్లు కూడా కనిపించట్లేదు. చెరువంతా గుర్రపు డెక్క, పిచ్చిమొక్కలు కనిపిస్తున్నాయి. కానీ చెరువులో మట్టిపనులు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసినట్లు తెలిసింది. 

ఐదు లక్షల చెల్లింపులకు సిద్ధం...
కింజరాపువాని చెరువులో నిర్దేశించిన మేరకు అభివృద్ధి పనులు జరగలేదు. ఇది ఏ అధికారి చూసినా అంగీకరించాల్సిందే. కానీ రూ.5 లక్షల మేర బిల్లులు చెల్లింపులకు వీలుగా ఇరిగేషన్‌ శాఖ అధికారులు రికార్డుల్లో నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎలాంటి కొర్రీలు లేకుండా సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా అంతా సవ్యంగా చేసే బాధ్యతను కూడా అధికారులు తీసుకున్నారట. మంత్రి సోదరుడికి ఈ వ్యవహారం పెద్ద కష్టం కానప్పటికీ ‘ఉపాధి’ పనులు చేసిన చెరువులోనే తూతూ మంత్రంగా పనులు చేసి రూ.5 లక్షల ప్రజాధనం పక్కదారి పట్టించడానికి వ్యవహారం జరగడమే విచిత్రం! గత ఏడాది ఉపాధి పనులు జరిగిన చెరువులో మరోసారి రూ.15 లక్షలతో మట్టి పనులను వంశధార అధికారులు ఎలా మంజూరు చేశారనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

అడ్డగోలుగా దోచుకోవడం వారికి అలవాటైంది
ఒక వైపు మంత్రి అచ్చెన్నాయుడు, మరోవైపు ఆయన సోదరుడు హరిప్రసాద్‌లకు ప్రభుత్వ పనుల్లో అధికారులను భయపెట్టి అడ్డగోలుగా దోచుకోవడం అలవాటైపోయింది. సొంత గ్రామంలోని ఆ ఒక్క చెరువులోనే కాదు నియోజకవర్గంలోని పలుచోట్ల హరిప్రసాద్‌కు చెందిన కంపెనీకే పనులు దక్కాయి. తూతూ మంత్రంగా పనులు చేసి బిల్లులు పెట్టుకుంటున్నా అడ్డుకోవడానికి అధికారులకు ధైర్యం లేదు. విజిలెన్స్‌ విభాగం విచారణ జరిపితే అచ్చెన్న సోదరుల అవినీతి వెలుగుచూస్తుందనడంలో సందేహం లేదు. 
– పేరాడ తిలక్, వైఎస్సార్‌సీపీ 
టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement