పంట పచ్చన.. కాయ పలుచన! | Sakshi
Sakshi News home page

పంట పచ్చన.. కాయ పలుచన!

Published Mon, Aug 31 2015 3:47 AM

పంట పచ్చన.. కాయ పలుచన!

కరువు ప్రభావం
జూన్‌లో విత్తిన వేరుశనగకు ఎకరాకు దిగుబడి వచ్చేది 2 బస్తాలే
జూలై పంటకు వర్షాలు కురిస్తేనే   ప్రయోజనం  

 
జిల్లాలోని పడమటి మండలాల రైతులు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పంట పచ్చగా కనిపిస్తున్నా అందులో కాయల్లేవు.ఇలాంటి పచ్చ కరువును ఎప్పుడూ చూడలేదనిరైతులు వాపోతున్నారు. పంటలపై పెట్టిన పెట్టుబడి కొద్దిగానైనా చేతికందే పరిస్థితులు కనిపించడం లేదు. వ్యవసాయాధికారులూ ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.రైతులు ఎకరాకు రూ.10 వేలకుపైగా పెట్టుబడిని నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి వర్షాభావమే కారణమని స్పష్టమవుతోంది.
 
బి.కొత్తకోట : ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలోని పడమటి ప్రాంతాల రైతులు వేరుశనగ సాగుమీదే ఆధారపడ్డారు. మే చివర్లో కురిసిన వర్షానికి పంట సాగుచేసుకోవచ్చని ఆనందపడ్డారు. ఈ నేపథ్యంలోనే జూన్‌లో వేరుశనగ పంటను  విత్తారు. జిల్లా వ్యాప్తంగా 2,07,502 హెక్టార్ల సాధారణ సాగులో వేరుశనగ పంట 1,36,375 హెక్టార్లలో సాగు చేయాలి. కానీ 1,07,528 హెక్టార్లలో పంటను సాగుచేశారు. ఇందులో అధిక విస్తీర్ణం పడమటి మండలాలదే. జూన్‌లో తొలివిడత, జూలైలో రెండో విడత కలుపుకొని మూడు విడతల్లో పంటను సాగుచేశారు. ఇందులో జూన్‌లో విత్తిన పంటకు వర్షాభావం వెంటాడింది. నెల రోజులకుపైగా చినుకు రాలలేదు. జూలైలో పంట దిగుబడికి ప్రధానమైన పూతదశ వచ్చింది. ఈ సమయంలో వర్షం అవసరం. అయితే వర్షం కురవకపోవడంతో పూత దెబ్బతింది. ఊడలు పట్టలేదు. పంట దిగుబడి నాశనమైంది. ఈ పంటకు ఆగస్టులో కురిసిన వర్షమే దిక్కయింది. ఈ వర్షం పంటకు ప్రయోజనం చేకూర్చలేకపోయింది. ప్రస్తుతం పదిరోజుల్లో ఒకటికి నాలుగుసార్లు వర్షం కురిసింది.

దీనికి పంట పచ్చదనంతో కళకళలాడుతోంది. చూసేవారికి ఈ సారి దిగుబడులు భారీగా వస్తాయని అంచనాలు వేస్తారు. అయితే మొక్కకు ఒక్కటంటే ఒక్క కాయా కనిపించని దుస్థితి. ఎకరాకు కనీసం 7 బస్తాలు, అధికమంటే 12 బస్తాల దిగుబడి దక్కాలి. ఇప్పుడున్న జూన్ నెలలో వేసిన పంట దిగుబడి 2 బస్తాలే. లేదంటే మూడు బస్తాలకు ఎటువంటి పరిస్థితుల్లోనూ పెరిగే వీలులేదని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
 
 
 

Advertisement
Advertisement