ఐఐటీ.. ఆమడంత దూరం | Sakshi
Sakshi News home page

ఐఐటీ.. ఆమడంత దూరం

Published Thu, Oct 10 2013 1:23 AM

ఐఐటీ.. ఆమడంత దూరం

గ్రామీణ విద్యార్థులకు అందని ద్రాక్షలా ఐఐటీలు
 వాటిలో నగర విద్యార్థులదే పైచేయి.. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే అత్యధికం
అర్హుల్లో అత్యధికులు మనవారే.. రెండోస్థానం రాజస్థాన్‌దే
అమ్మాయిలూ తక్కువే..  జాయింట్ అడ్మిషన్ బోర్డు నివేదిక వెల్లడి

 
 సాక్షి, హైదరాబాద్: ఐఐటీ ప్రవేశ పరీక్షకు హాజరైనవారు, అర్హత సాధించిన వారిలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉండగా.. నగరాలు, పట్టణాల విద్యార్థులదే పైచేయిగా నిలిచింది. అలాగే మన రాష్ట్రం.. హాజరైనవారిలో, అర్హత సాధించినవారిలో అగ్రస్థానంలో నిలిచింది. 2013-14 ఐఐటీ అడ్మిషన్ల అనంతరం జాయింట్ అడ్మిషన్ బోర్డు విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఈ ఏడాది అనుసరించిన నూతన విధానాన్ని విశ్లేషిస్తూ పలు గణాంకాలతో ఈ నివేదిక విడుదలైంది.
 
 ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్ధేశించిన జేఈఈ-మెయిన్స్ ఉత్తీర్ణుల్లో 1,50,000 మంది విద్యార్థులను మాత్రమే ఈ ఏడాది జేఈఈ-అడ్వాన్స్‌డ్(ఐఐటీ ప్రవేశ పరీక్ష)కు అనుమతించారు. ఇందులో కూడా 50.5 శాతం(75,750) మందిని కామన్ మెరిట్ లిస్ట్ నుంచి, 27 శాతం(40,500) మందిని ఓబీసీ మెరిట్ లిస్ట్ నుంచి, 15 శాతం(22,500) మందిని ఎస్సీ మెరిట్ లిస్ట్ నుంచి, 7.5 శాతం(11,250) మందిని ఎస్టీ మెరిట్ లిస్ట్ నుంచి ప్రతిభాక్రమంలో ఎంపిక చేశారు. అయితే వీరిలో 1,26,749 మంది అభ్యర్థులు మాత్రమే జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 21,110 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 215 కోర్సుల్లో 9,867 ఐఐటీ సీట్లు అందుబాటులో ఉండగా.. 14,336 మందిని తొలి విడత కౌన్సెలింగ్‌కు పిలిచారు.
 
 మన రాష్ట్రం నుంచే ఎక్కువ మంది
 బోర్డుల పరంగా చూస్తే 2013 ఐఐటీ ప్రవేశ పరీక్షకు అర్హత సాధించిన వారిలో సీబీఎస్‌ఈ బోర్డు విద్యార్థులు అత్యధికంగా 58,587 మంది ఉన్నారు. అయితే వీరంతా విభిన్న రాష్ట్రాలకు చెందిన వారు. రాష్ట్రాల వారీగా చూస్తే మన రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు పరిధిలో ఇంటర్మీడియెట్ చదివిన 17,360 మంది విద్యార్థులు ఐఐటీ ప్రవేశపరీక్షకు అర్హత సాధించారు. కామన్ మెరిట్ లిస్ట్‌లో నిలిచారు. వీరిలో 3,538 మంది పరీక్ష పాసయ్యారు. అటు సీబీఎస్‌ఈ, ఇటు ఇంటర్ బోర్డు నుంచి మొత్తంగా 3,698(17.75 శాతం) మంది పాసయ్యారు. ఆ తరువాతి స్థానంలో రాజస్థాన్ నుంచి 15,759 మంది హాజరైనప్పటికీ.. అర్హులైన వారిలో వీరి శాతం 17.43గా నిలిచింది. ఉత్తరప్రదేశ్ నుంచి 16,557 మంది పరీక్షకు హాజరైనప్పటికీ.. 2,520 (12.10 శాతం) మంది మాత్రమే అర్హత సాధించడంతో మూడో స్థానంలో నిలిచింది.
 
 గ్రామీణ విద్యార్థులు చాలా స్వల్పం..
 ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులై, ఐఐటీ ప్రవేశ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు 1,26,749 మంది ఉండగా వీరిలో గ్రామీణ విద్యార్థులు కేవలం 16,144(12.74 శాతం) మంది మాత్రమే ఉన్నారు. ఇక వీరిలో ఈ పరీక్ష ఉత్తీర్ణులైంది కేవలం 1,700 మంది. ఐఐటీ ప్రవేశ పరీక్షలో మొత్తం అర్హులు 20,834 మంది ఉండగా.. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు వీరిలో 8.16 శాతమే కావడం గమనార్హం. నగరాల నుంచి హాజరైన వారు 64.78 శాతం ఉండగా.. అర్హత సాధించిన వారిలో 75.85 శాతంగా ఉన్నారు. పట్టణాల నుంచి హాజరైన వారు 22.48 శాతంగా ఉండగా.. అర్హత సాధించిన వారిలో వారు 15.99 శాతంగా ఉన్నారు.
 
 ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలదే పైచేయి..
 ఈ ఏడాది ఐఐటీ ప్రవేశ పరీక్షకు హాజరైన వారిలోనూ, అర్హత సాధించిన వారిలోనూ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలది పైచేయిగా నిలిచింది. ఈ కేటగిరీలో 36,387 మంది ప్రవేశ పరీక్షకు హాజరవగా.. 6,215 అర్హత సాధించారు. ఆ తరువాత అత్యధిక సం ఖ్యలో పరీక్షకు హాజరైనవారిలో వ్యాపారుల పిల్లలు ఉన్నారు. ఇక తండ్రి నిరక్షరాస్యుడైనా ఐఐటీ ప్రవేశ పరీక్షకు అర్హత సాధించి పరీక్షరాసిన విద్యార్థులు 6,693 మంది ఉండగా.. వీరి లో 540 మంది పాసవడం విశేషం. తల్లిదండ్రులు ఆదాయాన్ని బట్టి చూస్తే ఎక్కువ ఆదాయం ఉన్నవారి పిల్లలే.. అర్హత సాధించిన వారిలో ఎక్కువ శాతం ఉన్నారు. అంటే వీరంతా మెరుగైన శిక్షణ పొందినట్టు అంచనావేయవచ్చు.
 
 ఐఐటీ ప్రవేశ పరీక్షల కోచింగ్ వ్యయం భరించగలిగిన వారే ఎక్కువ శాతం అర్హత సాధించినట్టు అర్థం చేసుకోవచ్చు. అన్ని పోటీ పరీక్షల్లో అమ్మాయిలు పైచేయి సాధిస్తున్నప్పటికీ ఈ పరీక్షలో అబ్బాయిలదే పైచేయిగా నిలుస్తోంది. మొత్తంగా 20,834 మంది ఐఐటీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించగా.. వీరిలో అబ్బాయిలు 18,468 మంది ఉండగా.. అమ్మాయిలు కేవలం 2,366 మంది మాత్రమే ఉన్నారు. మన రాష్ట్రం మద్రాస్, ఖరగ్‌పూర్ జోన్(పాక్షికంగా) పరిధిలో ఉంది. మద్రాస్ జోన్ పరిధిలో అబ్బాయిలు 3,603 మంది అర్హత సాధించగా..అమ్మాయిలు 624 మంది  మాత్రమే అర్హత సాధించారు. ఖరగ్‌పూర్ జోన్‌పరిధిలో 2,131 మంది పరీక్ష రాయగా.. 236 మంది మాత్రమే అమ్మాయిలు అర్హత సాధించారు.

Advertisement
Advertisement