పేలనున్న ‘ఫైర్’ బాంబ్ | Sakshi
Sakshi News home page

పేలనున్న ‘ఫైర్’ బాంబ్

Published Mon, Dec 16 2013 12:43 AM

If every business firm have NOC , to cancel those firm licence

పిఠాపురం, న్యూస్‌లైన్ :  అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ పేరుతో జిల్లా వ్యాపారులపై రూ.25 కోట్ల భారం పడనుంది. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతీ వ్యాపార సంస్థ ముందుజాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని అగ్నిమాపక శాఖాధికారులు హెచ్చరించడం మినహా ఇప్పటివరకు పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. అయితే ఇప్పటి నుంచి ప్రతీ వ్యాపార సంస్థకు ఫైర్ ఎన్‌ఓసీ తప్పక ఉండాలని, లేకపోతే ఆయా సంస్థల లెసైన్స్ రద్దు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. తద్వారా ఆదాయాన్ని పొందేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.

ఈ మేరకు రాష్ట్ర అగ్నిమాపక శాఖ డెరైక్టర్ జనరల్ ఎస్‌వీ రమణమూర్తి ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీస్ యాక్ట్-1999 ప్రకారం ఓ సర్క్యులర్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియలో అగ్నిమాపక సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ప్రతీ గ్రామంలోను కిళ్లీ షాపుల నుంచి బడా వ్యాపార సంస్థల వరకు అన్నింటి వివరాలు సేకరిస్తున్నారు. ఆయా వ్యాపార సంస్థల వాడుక స్థలం, వ్యాపార తీరు, వినియోగించే వస్తువులు తదితర వివరాల ఆధారంగా ఒక్కో వ్యాపార సంస్థకు రూ.500, రూ.1000, రూ.1500, రూ.2000, రూ.2500 నుంచి రూ.5 వేల వరకు చెల్లించి ఎన్‌ఓసీ పొందాల్సి ఉంటుంది. చిన్న కిళ్లీబడ్డీల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు 613 రకాల వ్యాపారాలు ఈ ఎన్‌ఓసీ పరిధిలోకి రానున్నాయి.
 వ్యాపార సంస్థల వివరాల సేకరణ
 జిల్లాలోని అన్ని వ్యాపార సంస్థల వివరాలు సేకరిస్తున్న ఫైర్ సిబ్బంది ఆ నివేదికను ప్రభుత్వానికి పంపడం పూర్తయ్యాక, దీనిపై చట్టం చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే వ్యాట్ వంటి పన్నులతో సతమతమవుతున్న వ్యాపారులపై ఈ అదనపు భారం తడిసిమోపుడు కానుంది. 15 మీటర్లకు మించి ఉండే అపార్ట్‌మెంట్లు, రెస్టారెంట్లు, స్కూల్స్, ట్రాన్స్‌పోర్టు గొడౌన్లు, ఎగ్జిబిషన్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీలు, వ్యాపార, వ్యాపార రహిత భవనాలకు ఎన్‌ఓసీ పొందాల్సి ఉంటుంది.
 త్వరలో జీఓ
 ఎన్‌ఓసీ లేకుండా వ్యాపారం కొనసాగించకుండా దాడులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ వ్యా పార సంస్థ తప్పనిసరిగా ఎన్‌ఓసీ తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలో వ్యాపార సంస్థల వివరాలు సేకరించడం పూర్తి కావస్తున్న నేపథ్యంలో త్వరలో ప్రభుత్వం జీఓ జారీ చేయనుంది.

Advertisement
Advertisement