అనుమానం పెనుభూతమై..
భార్యను అనుమానించి భర్త ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.
తెనాలి రూరల్: భార్యను అనుమానించి భర్త ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. గాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తెనాలి పట్టణం నందులపేటలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. నందులపేటకు చెందిన మానేపల్లి వెంకటబ్రహ్మం బంగారు ఆభరణాల తయారీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. మండలంలోని తేలప్రోలుకు చెందిన షేక్ రిజ్వానా పట్టణ మెయిన్‌రోడ్డులో టైలరింగ్ పని చేస్తుండేది.
2007లో వీరిరువురికి పరిచయం అయి ప్రేమకు దారి తీయగా 2008 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె రిహానా ఉంది. కొద్ది కాలంగా వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. గంటల కొద్దీ రిజ్వానా ఫోన్‌లో సంభాషిస్తుండడంతో, భార్య ఇంకొకరితో అక్రమసంబంధం నెరపుతోందన్న అనుమానం వెంకటబ్రహ్మంలో రేకెత్తింది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
నాలుగు నెలల క్రితం ఇంట్లోని మాత్రలు మింగి రిజ్వానా ఆత్మహత్యాయత్నం చేయడంతో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సచేయించారు. ఈసందర్భంగా పోలీసులు భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. కాగా, శుక్రవారం భార్యభర్త గొడవపడినట్టు తెలుస్తోంది. ఇద్దరిపై మరుగుతున్న నూనె పడి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వెంకటబ్రహ్మంతో పని చేసే మిత్రుడి భార్య రహిమూన్‌పాషా రిజ్వానాకు ఇంటిపనిలో సహాయం చేసేందుకు శనివారం ఉదయం వీరింటికి వచ్చింది. ఇద్దరూ కూరగాయలు తరుగుతుండగా, వెంకటబ్రహ్మం భార్యను నిర్మాణంలో ఉన్న మేడపై అంతస్తుకు తీసుకువెళ్లాడు.
ముందుగానే అక్కడకు తెచ్చిపెట్టుకున్న యాసిడ్‌ను ఆమెపై పోశాడు. తీవ్ర గాయలపాలైన బాధితురాలు కేకలు వేసుకుంటూ కిందకు వచ్చింది.స్నేహితురాలు, స్థానికులు ఆమెను తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని టూటౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. కల్యాణ్‌రాజు, ఎస్‌ఐ క్రాంతికిరణ్ పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బాధితురాలని మెరుగైన చికిత్స కోసం గుంటూరు సమగ్ర వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫోన్ సంభాషణలను పోలీసులకు వినిపించిన భర్త?
వెంకటబ్రహ్మంను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతుండడంతోనే ఆమెపై యాసిడ్ దాడి చేసినట్టు నిందితుడు వారికి చెప్పినట్టు సమాచారం. రిజ్వానా తన బంధువు అయిన(వరుసకు అల్లుడు అయ్యే) వ్యక్తితో తరచూ ఫోన్‌లో గంటలకొద్దీ సంభాషిస్తోందని, తొలుత అనుమానించినా, కొద్ది రోజులకు రుజువవ్వడంతో ఆమెపై యాసిడ్ దాడి చేసినట్టు వివరించాడని సమాచారం. అంతే కాక, రిజ్వానా, ఆమె బంధువుకు సంబంధించిన ఫోన్ సంభాషణలను పోలీసులకు వినిపించినట్టు తెలిసింది.