శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను శ్రావణ మూడవ సోమవారం నాడు వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. కాగా శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన రద్దీ సోమవారం కూడా కొనసాగింది.
శ్రీశైలం : శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను శ్రావణ మూడవ సోమవారం నాడు వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. కాగా శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన రద్దీ సోమవారం కూడా కొనసాగింది. భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని సోమవారం ఆలయ పూజావేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఇందులో భాగంగా సోమవారం వేకువజామున 3.30గంటలకు మంగళవాయిద్యాలు, 4గంటలకు సుప్రభాతం, 5గంటలకు మహా మంగళహారతి, 5.30గంటల నుంచి దర్శనాలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక,మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల నంచి అధికసంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు.
శ్రావణమాసం సందర్భంగా వేకువజామునే పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకున్న భక్తులు నేరుగా క్యూ కాంప్లెక్స్ చేరుకుని ఉచిత, ప్రత్యేక, అతి శీఘ్ర దర్శన క్యూల ద్వారా స్వామివార్లను దర్శించుకున్నారు. భక్తులరద్దీని దృష్టిలో పెట్టుకుని సాధారణ భక్తులు స్వామివార్ల దూర్శదర్శనం ఏర్పాటు చేసి కేవలం అభిషేకాలను నిర్వహించుకునే భక్తులను మాత్రమే గర్భాలయంలోకి అనుమతించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.