గిట్టుబాటు ధర కల్పించాలి | groundnuts farmers demand for support price | Sakshi
Sakshi News home page

గిట్టుబాటు ధర కల్పించాలి

Jan 26 2014 12:19 AM | Updated on Mar 28 2018 10:59 AM

వేరుశనగ దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం ధారూరులో రైతులు రాస్తారోకో నిర్వహించారు.

ధారూరు, న్యూస్‌లైన్: వేరుశనగ దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం ధారూరులో రైతులు రాస్తారోకో నిర్వహించారు. వికారాబాద్- తాండూరు ప్రధాన రహదారిపై దాదాపు 2 గంటల పాటు బైఠాయించడంతో రెండు వైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. ధారూరు మార్కెట్ యార్డులో వేరుశనగ పంటకు వ్యాపారులు ధర తగ్గించి బీట్లను కొనసాగించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో ఖరీదుదారులు వేరుశనగలు క్వింటాలుకు నాణ్యతను బట్టి రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు.

 తమకు ఈ ధర గిట్టుబాటు కాదని..  రూ. 5 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ మాటను బేఖాతరు చేస్తూ.. బీట్లు కొనసాగిస్తున్న వ్యాపారుల తీరును నిరసిస్తూ.. రైతులు బీట్లను నిలిపివేయించి రాస్తారోకోకు దిగారు. ధారూరులో వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, మద్దతు ధర కల్పించాలలి వారు డిమాండ్ చేశారు. దీంతో వ్యాపారులు  వేరుశనగతో పాటు అన్ని రకాల ఉత్పత్తుల బీట్లను నిలిపివేశారు.

 రైతులతో మార్కెట్ కమిటీ చైర్మన్, తహసీల్దార్ చర్చలు
 రైతులు రాస్తారోకో చే స్తున్న సమాచారం తెలుసుకున్న ధారూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. సంగమేశ్వర్‌రావు, తహసీల్దార్ ఆర్. జనార్దన్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతులతో వారు చర్చలు జరిపారు. వేరుశనగలకు గిట్టుబాటు ధర కల్పిచేందుకు జిల్లా మార్కెటింగ్ అసిస్టెంట్ డెరైక్టర్‌తో వారు ఫోన్‌లో మాట్లాడారు. ఈ నెల 29లోగా ధారూరులో వేరుశనగల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

 ఈ విషయాన్ని రైతులకు చైర్మన్, తహసీల్దార్‌లు వివరించడంతో వారంతా శాంతించారు. రాస్తారోకో కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ శుభప్రద్ పటేల్, జిల్లా ఉపాధ్యక్షుడు బాల్‌రాజ్‌నాయక్, మండల కన్వీనర్ నాగే శ్‌లు, సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు ఆర్. మహిపాల్, రైతు నాయకులు శంకర్, కిషోర్, శ్రీకాంత్, చత్రనాయక్, బాబురావు, మోహన్‌నాయక్ పాల్గొన్నారు.

 29న ధారూరులో బీట్లు
 శనివారం నిలిచిపోయిన బీట్లను తిరిగి ఈ నెల 29న (బుధవారం) ఉదయం 10 గంటలకు నిర్వహించాలని మార్కెట్ కమిటీ పాలకవర్గం నిర్ణయించింది. రైతులు ఈ విషయాన్ని గమనించి బుధవారం ఉదయాన్నే తమ దిగుబడులను తీసుకురావాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement