రూ.కోటి విలువైన స్థలం.. ధారాదత్తం!

Government Land Hand Over To TDP Leaders In Srikakulam - Sakshi

నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో కోటి రూపాయల విలువైన గ్రామకంఠం స్థలం పరాధీనమైపోయింది! ఇదేమిటని ప్రశ్నిస్తే... ఇది మంత్రిగారి ఆదేశమని, ఏమీ మాట్లాడటానికి లేదని అధికార యంత్రాంగమే చేతులెత్తేస్తోంది! మరి ఈ స్థలంతో లబ్ధి పొందుతున్నది ఏ నిరుపేదలో కాదు... టీడీపీ కార్యకర్తలు! ఇంకా చెప్పాలంటే మంత్రి ప్రధాన అనుచరులు! ప్రజల ఆస్తిని కాపాడాల్సిన స్థానిక ఎమ్మెల్యే కూడా తన వంతుగా పచ్చజెండా ఊపేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపి ప్రజల ఆస్తిని కాపాడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థానిక నాయకులు ఫిర్యాదు చేసినా అధికార యంత్రాంగంలో చలనం లేకపోవడంపైనా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం : నరసన్నపేటలో పాత జాతీయ రహదారికి ఆనుకొని ఐవోసీఎల్‌ (దుంపల కామయ్య) పెట్రోల్‌ బంకు ఎదురుగా గొట్టిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 211లో నాలుగు సెంట్లు స్థలం ఉంది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం దీని ధర కోటి రూపాయల పైమాటే! ఈ స్థలాన్ని గ్రామ పంచాయతీ 1980 సంవత్సరంలో రెవెన్యూ శాఖకు 99 ఏళ్ల లీజుకు ఇచ్చింది. అప్పట్లో స్థానికంగా పనిచేసే కరణాల సౌకర్యం కోసం ఆ స్థలంలో కమ్యూనిటీ భవనం నిర్మించాలనేది ఉద్దేశం. భవన నిర్మాణం కోసం పునాదులు కూడా వేశారు. కానీ ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడం, కరణాలు మునసబుల వ్యవస్థను రద్దు చేస్తూ నాటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు నిర్ణయం తీసుకోవడంతో ఆ నిర్మాణం కాస్త ఆగిపోయింది. అప్పటి నుంచి ఆ స్థలం ఖాళీగానే ఉంది. 

టీడీపీ నేతల మంత్రాంగం 
స్థానిక టీడీపీ నాయకుడు భీమారావు సహా ఐదుగురు కార్యకర్తలకు ఆ స్థలం కేటాయించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో కేటాయింపునకు అధికారులకు కూడా పచ్చజెండా ఊపేశారు. అలాగే నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కూడా వారంతా టీడీపీ వారే కావడంతో తన అంగీకారం చెప్పేశారు. భీమారావుకు స్థలం పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని, మిగిలిన నలుగురికి ఎన్‌టీఆర్‌ హౌసిం గ్‌ స్కీమ్‌ కింద ఇళ్లు మంజూరు చేయించేందుకు వీలుగా స్థలం ఇవ్వండని ఆదేశాలు కూడా ఇచ్చారని తెలిసింది. మొత్తంమీద కోటి రూపాయల విలువైన స్థలం ప్రైవేట్‌ వ్యక్తులకు పరాధీనం వెనుక టీడీపీ నాయకులే చక్రం తిప్పడం చర్చనీయాంశమైంది. 

అంతా నిబంధనల ఉల్లంఘనే...వాస్తవానికి గ్రామకంఠం స్థలాన్ని రెవెన్యూ శాఖ కు లీజుకు మాత్రమే ఇచ్చారు. దాన్ని పరాధీనం చేయడానికి నిబంధనల ప్రకారం వీలుకాదు. కానీ రెవెన్యూ అధికారులు లోపాయికారీగా అంగీ కరించడంతో టీడీపీ కార్యకర్తలు తొలుత బడ్డీలు పెట్టారు. ఇప్పుడు వాటిని తీసేసి ఆ స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం స్తంభాలతో పునాదులు నిర్మించారు. కానీ అధికారికంగా ఎలాంటి అనుమతులు లేకున్నా ఈ నిర్మాణాలు చేయడం తగదని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని అధికార పార్టీ కార్యకర్తలకు ఎలా ధారాదత్తం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. 

వైఎస్సార్‌ సీపీ నాయకుల ఫిర్యాదు 
టీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా కట్టబెట్టడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నరసన్నపేట పంచాయతీ ఉపసర్పంచ్‌ పి.కృష్ణప్రసాద్‌ సహా తొమ్మిది మంది వార్డు సభ్యులు జిల్లా కలెక్టరు, నరసన్నపేట తహసిల్దారుకు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదుపై అధికారుల నుంచి స్పందన కనిపించట్లేదని కృష్ణప్రసాద్‌ చెప్పారు. ఈ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని, ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని డిమాండు చేశారు. 

ఎప్పటి నుంచో బడ్డీలు ఉన్నాయి... 
గడిచిన పదేళ్లుగా ఈ స్థలంలో కొందరు బడ్డీలు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. వారితో పాటే నాకు కూడా స్థలం ఇచ్చారు. అంతేతప్ప ప్రత్యేకంగా నాకేమీ ఇవ్వలేదు.   
 – భీమారావు, టీడీపీ కార్యకర్త 

ఇంటికోసం దరఖాస్తులు మాకు రాలేదు... 
వివాదాస్పద స్థలంలో ఉన్న ఐదుగురు వ్యక్తుల నుంచి ఎన్‌టీఆర్‌  హౌసింగ్‌ స్కీమ్‌ కింద ఇంటి నిర్మాణం కోసం మాకు ఇప్పటివరకూ ఎలాంటి దరఖాస్తులు రాలేదు. ఇళ్లకు మంజూరుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా వారి పేరున మేము పంపలేదు. తహసిల్దారు మంజూరు చేసిన పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే ఇల్లు మంజూరు చేస్తాం. నిర్మాణాలకు అనుమతి ఇస్తాం.
– ఎం.మురళీమోహన్, ఏఈ, గృహనిర్మాణ శాఖ

అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి 
బంకు ఎదురుగా ప్రభుత్వ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ వ్యక్తులు భవన నిర్మాణం చేస్తుండటంపై తహసిల్దారుకు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. ప్రస్తుతానికి పనులు నిలిపేశారు. కానీ ఆ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకోవడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. 
– ఎస్‌.కృష్ణబాబు, వార్డు సభ్యుడు, నరసన్నపేట

పరిశీలించి చర్యలు తీసుకుంటాం  
పెట్రోల్‌ బంకుకు ఎదురుగానున్న స్థలంలో నిర్మాణాలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయి. నరసన్నపేట వార్డు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఈ స్థలంలో ప్రస్తుతం నిర్మాణ పనులు చేయవద్దని ఆదేశించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
– సురేష్‌కుమార్, ఇన్‌చార్జి తహసీల్దారు, నరసన్నపేట 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top