విద్యార్థుల సమైక్య స్ఫూర్తికి తలొగ్గిన సర్కారు | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సమైక్య స్ఫూర్తికి తలొగ్గిన సర్కారు

Published Mon, Feb 20 2017 2:10 AM

విద్యార్థుల సమైక్య స్ఫూర్తికి తలొగ్గిన సర్కారు - Sakshi

యువభేరి సదస్సులో ప్రసంగించిన విద్యార్థిపై తొలుత వేధింపులు.. టీసీ ఇస్తామని బెదిరింపు
నిరసనగా రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి విద్యార్థుల హెచ్చరిక.. వైఎస్సార్‌సీపీ మద్దతు
దిగి వచ్చిన ప్రభుత్వం.. కళాశాలకు రావాలని విద్యార్థికి యాజమాన్యం పిలుపు


సాక్షి, అమరావతి బ్యూరో : రాష్త్రానికి ప్రత్యేక హోదా కోరుతూ యువభేరి సదస్సులో పాల్గొన్న విద్యార్థిని ఇంటికి పంపేయాలన్న సర్కారు కుతంత్రాన్ని విద్యార్థి లోకం అడ్డుకుంది. ప్రత్యేక హోదా కోసం నినదించిన విద్యార్థులకు అండగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించింది. వారికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలిచింది. విద్యార్థుల సమైక్య స్ఫూర్తికి సర్కారు దిగొచ్చింది. సదస్సులో పాల్గొన్న విద్యార్థికి టీసీ ఇచ్చి పంపేయాలన్న ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుంది. మొన్న విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో యువభేరి సదస్సుల్లో పాల్గొన్న విద్యార్థులను సస్పెండ్‌ చేయాలని చూసిన సర్కారు.., విద్యార్థులు కన్నెర్ర చేయడంతో వెనక్కి తగ్గింది.

తాజాగా ఈ నెల 16వ తేదీన గుంటూరులో జరిగిన యువభేరి సదస్సుకు కూడా విద్యార్థులు హాజరవకుండా ఇదే విధమైన ప్రయత్నాలు చేసింది.  నల్లపాడులో జరిగిన ఈ సదస్సుకు వచ్చినవారిలో చిలకలూరిపేటలోని మోడ్రన్‌ కళాశాల విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్న తాటిపర్తి సాయి కృష్ణారెడ్డి నేరుగా  జగన్‌తో మాట్లాడారు. ప్రత్యేక హోదా గురించి తాము ఆందోళన చేస్తుంటే పీడీ యాక్టు కింద కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు చెప్పారు. తమ ఊరికే చెందిన ప్రత్తిపాటి పుల్లారావు అరాచకాలను జగన్‌ దృష్టికి తెచ్చారు. దీంతో ప్రభుత్వం సాయి కృష్ణారెడ్డిపై వేధింపులకు దిగింది. అతనికి టీసీ ఇచ్చి పంపేయాలని యాజమాన్యంపై ఉన్నత స్థాయిలో ఒత్తిడి వచ్చింది. దీంతో కళాశాల యాజమాన్యం సాయిరెడ్డిని పిలిచి బెదిరించింది.

వద్దని చెప్పినా సదస్సుకు ఎందుకు వెళ్లావని కళాశాల డైరెక్టర్‌ మహేష్‌ ప్రశ్నించారు. టీసీ ఇచ్చి పంపుతామని హెచ్చరించారు.ఈ విషయం సోషల్‌ మీడియాలో బాగా ప్రచారం అయింది.తోటి విద్యార్థులు ఆందోళనకు సిద్ధమయ్యారు. సాయి కృష్ణారెడ్డి కూడా విద్యార్థి సంఘాలతో కలసి న్యాయపోరాటానికి సిద్ధమయ్యాడు. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. సాయి కృష్ణారెడ్డికి కళాశాల డైరెక్టర్‌ మహేష్‌ ఫోన్‌ చేసి, టీసీ ఇచ్చే ఉద్దేశం తమకు లేదని, కళాశాలకు రావాలని కోరారు.

Advertisement
 
Advertisement