గోల్డెన్‌ డే | Sakshi
Sakshi News home page

గోల్డెన్‌ డే

Published Wed, Apr 18 2018 9:10 AM

golden day - Sakshi

తణుకు: నీ ఇల్లు బంగారం గానూ.. అని ఎవరైనా అంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ దీవెన నిజమవుతుందన్న నమ్మకమే అక్షయ తృతీయ. పసిడి పండుగగా పేరొందిన ఈ రోజున మహిళలంతా తమ శక్తి కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.

ఆనవాయితీగా వస్తున్న బంగారం కొనుగోళ్లు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుండటంతో పాటు పుత్తడి అమ్మకాలు ఊపందుకునేలా చేస్తున్నాయి. అయితే ఈ సారి పెళ్లిళ్ల ముహూర్తాలు కూడా కలిసి రావడంతో కొనుగోలు దారుల్ని ఆకర్షించేందుకు జిల్లాలోని అన్ని దుకాణాలు ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి.

 అక్షయం అంటే...అక్షయ తృతీయ రోజున పిసరంత బంగారమైనా కొంటే... లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుందని చాలా మంది విశ్వసిస్తారు. అక్షయం అంటే ఎప్పుడు తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే తరిగిపోని సంపదగా ఉంటుందని నమ్మకం.

ఈ పండుగ ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పాల సముద్రం నుంచి మహాలక్ష్మి ఉద్భవించిన సువర్ణమైన రోజని కొందరు చెబుతారు. అందువల్లనే కొంతైనా బంగారాన్ని కొనుగోలు చేయడం సెంటిమెంట్‌గా వచ్చిందని అంటారు.

పాండవులు అక్షయపాత్ర పొందిన శుభదినంగా మరి కొందరు అభివర్ణిస్తారు. పరశురాముడు పుట్టిన రోజని, సూర్యచంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా ఉండే రోజని ఇంకొందరు చెబుతుంటారు. త్రేతాయుగం అక్షయ తృతీయ రోజే మొదలైందని పెద్దలు చెబుతారు.

ఈ రోజు ఏ పనైనా ముహూర్తం చూడకుండానే ప్రారంభించుకోవచ్చని చెబుతుంటారు. 

ఆఫర్ల జోరు.. 

బంగారం కొనుగోలు చేసేవారికి కొండెక్కిన ధర భారంగా మారింది. 10 గ్రాముల 24 కా>్యరెట్లు బంగారం రూ.32,400 పలుకుతుండగా 22 క్యారెట్లు బంగారం రూ.29,800 పలుకుతోంది.

మహిళలు సెంటిమెంటుగా ఎంతోకొంత బంగారాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యంతో కనీసం రెండు, మూడు గ్రాములైనా కొనుగోలు చేయడానికి మహిళలు ఉత్సుకత చూపిస్తున్నారు. జిల్లాలోని ప్రధానంగా నరసాపురం, భీమవరం, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో అన్ని పసిడి దుకాణాల్లో ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి.

పెళ్లిళ్ల సీజన్‌ ఒకవైపు.. అక్షయ తృతీయ మరోవైపు.. రెండింటినీ ముడి పెడుతూ దుకాణాలు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కొన్ని ప్రముఖ దుకాణాల్లో మేకింగ్‌ చార్జీల్లో తగ్గింపు, బంగారం కొంటే వెండి ఉచితం, పలు బ్యాంకు క్రెడిట్, డెబిట్‌ కార్డులు వినియోగిస్తే.. క్యాష్‌ బ్యాక్‌ వంటి ఆఫర్లు ప్రకటించారు.

సాధారణంగా రోజువారీ అమ్మకాలతో పోల్చి చూస్తే.. అక్షయ తృతీయ రోజున ప్రతి దుకాణంలో 100 నుంచి 150 శాతం అదనపు అమ్మకాలు జరుగుతాయి.

Advertisement
Advertisement