రాజంపేట మండలం ఊటుకూరు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతి చెందాడు.
రాజంపేట రూరల్/పుల్లంపేట: రాజంపేట మండలం ఊటుకూరు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతి చెందాడు. పుల్లంపేట మండలం ఆర్. గొల్లపల్లె గ్రామానికి చెందిన గాడి శివరామిరెడ్డి కుమారుడు గాడి వెంకటరమణారెడ్డి (24)కి రాజంపేట మండలం తమ్మిరెడ్డిపల్లెకు చెందిన లక్ష్మిసౌజన్యతో ఈనెల 12న గురువారం రాజంపేటలోని ఆంజనేయస్వామి ఆలయంలో వివాహం జరిగింది. శనివారం సాయంత్రం కొత్త పెళ్లికూతురికి సారె ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుడు వెంకటరమణారెడ్డి అత్తవారింటి నుంచి రాజంపేటకు వెళ్లి అతని సోదరుడు గాడి మణితో కలిసి ఎపీ04ఎవై3229 నెంబరు గల పల్స్‌ర్ వాహనంపై వధువు ఇంటికి వస్తున్నారు.
ఇదే సమయంలో కోడూరు వైపు వెళ్తున్న ఎపీ 04 వై 2129 అనే నెంబరు గల లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న వెంకటరమణారెడ్డి అక్కడికక్కడికే మృతి చెందగా, వెనుక ఉన్న మణికి తలకు గాయమైంది. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న వధువు లక్ష్మీసౌజన్య కుటుంబీకులు, అలాగే మృతుడి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని విలపించారు. త న భర్త ఇక లేడని.. రాడని తెలుసుకున్న ఆ నవ వధువు కుప్పకూలిపోయింది.
వైఎస్సార్‌సీపీ నేత పోలా పరామర్శ
నవవరుడు వెంకటరమణారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే విషయం తెలుసుకున్న పట్టణ వైఎస్సార్‌సీపీ కన్వీనర్ , మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి ఆసుపత్రికి చేరుకుని మృతుని సంబంధీకులను ఓదార్చారు. ఈయనతోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు రాఘవరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నరసింహా రెడ్డి, గోవిందుబాలకృష్ణ పాల్గొన్నారు.