
ఇదేమి...సేవలో..!
మీ సేవ కేంద్రాలు సర్కారుకు కాసుల వర్షం కురిపిస్తుండగా ప్రభుత్వ సిబ్బందికి దండిగా జేబులు నింపుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో వేగంగా పనులు
మీ సేవ కేంద్రాలు సర్కారుకు కాసుల వర్షం కురిపిస్తుండగా ప్రభుత్వ సిబ్బందికి దండిగా జేబులు నింపుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో వేగంగా పనులు పూర్తి చేయడంతోపాటు అవినీతి నిర్మూలనకు ‘మీసేవ’ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండేళ్లలో దఫ దఫాలుగా దాదాపు 250 సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. మీ సేవల ద్వారా ఆదాయం దండిగా వస్తుండడంతో వచ్చే మార్చి నుంచి మరో 150 సేవలను ‘మీ సేవ’ పరిధిలోకి తీసుకు రావడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే కాసులు ఘనంగా కురిపిస్తున్నా ‘సేవ’లు మాత్రం నాసిరకంగానే ఉన్నాయి. రెవెన్యూతో పాలు పలు శాఖల సేవలు ప్రజలకు అరకొరగానే అందుతున్నాయి. ఇక ప్రభుత్వ సిబ్బంది ‘మామూళ్లు’ వచ్చే ‘సేవ’లపైనే ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ‘మీ సేవ’ కేంద్రాలు రెవెన్యూ శాఖకు సంబంధించిన పనులకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. కుటుంబ సభ్యుని ధ్రువపత్రం, ఎఫ్‌లైన్ పిటీషన్ తదితర పనులకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలకు అక్రమ వసూళ్లు రూ.5వేల నుంచి రూ.50వేలకు పైమాటే. ఈ వ్యవహారమంతా బహిరంగంగా జరుగుతున్నప్పటికీ ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఫిర్యాదు చేస్తే స్పందిస్తామన్న ధోరణితో ఉండడం, విచారణ మొక్కుబడిగా చేస్తుండడంతో పలువురు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తున్నారు.
సేవలు భారం...
విద్యార్థులు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు పొందడానికి రూ.70 ఖర్చవుతోంది. ప్రీ మెట్రిక్ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్ కేవలం రూ.1200. ఈ స్కాలర్‌షిప్ కూడా అందుతుందో లేదో తెలియదు. స్కాలర్‌షిప్ కోసం ముందుగానే రూ.70 ఖర్చుచేయవలసి వస్తోంది. పలు మీసేవ కేం ద్రాల్లో ఈ ధ్రువపత్రాల కోసం రూ.100 వరకు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.110 ఇచ్చే ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసి) ప్రస్తుతం మీసేవలో రూ.225, రూ.525 వరకు చెల్లించవలసి వస్తోంది. ఈసీ ధరలు వినియోగదారులకు భారంగా పరిణమించాయి.
వివరాలు తప్పుల తడకలు...
‘మీసేవ’ కేంద్రాల ప్రారంభంలోనే రెవెన్యూ అడంగల్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అడంగళ్లలో వివరాలు తప్పుల తడకలుగా ఉండడంతో రైతులు వీఆర్‌ఓల ద్వారా అడంగళ్లను పొందుతున్నారు. వాస్తవానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి అడంగళ్ల వివరాలను అప్‌డేట్ చేయవలసి ఉంది. రెండేళ్ల క్రితం వివరాలు ప్రస్తుతం ఉండడంతో పలు బ్యాంకులు ‘మీసేవ’ కేంద్రాల్లో అడంగళ్లను తిరస్కరిస్తున్నాయి. ఎఫ్‌ఎంబిలో వివరాలు భూతద్దంతో వెతికినా కనిపించని పరిస్థితి. ఇక పుట్టిన తేదీ, మరణ ధ్రువపత్రాల జారీలో నెలల తరబడి జాప్యం జరుగుతుండడంతో పలువురు ఉసూరుమంటున్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది.
సాంకేతిక లోపాలు...
మీసేవ కేంద్రాల్లో సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతోపాటు పలు సాంకేతిక లోపాల వల్ల అత్యవసరంగా ధ్రువపత్రాలు పొందడానికి అవకాశం ఉండడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించడానికి రెండు మూడు రోజులపాటు మీ సేవ కేంద్రాలకు వెళ్లవలసి వస్తోంది.
ఇక్కడ ‘సేవ’లతో ఊరట
అరకు రూరల్ : అరకులోయ, యండపల్లి వలస, అనంతగిరి, చిలకలగెడ్డ, డుంబ్రిగుడ, అరకు సంతబయలు, హుకుంపేట, బర్మానగుడ, పెదబయలు, ముంచంగిపుట్టులో ఒక్కో మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా కుల, ఆదాయం, నివాస, జనన, మరణ ధ్రువపత్రాలతోపాటు అడంగల్, 1బీ, రేషన్‌కార్డుల్లో డేటా చేర్పులు, మార్పులు, ఉపకార వేతనాలు, ప్రజావాణి ఫిర్యాదులు, పంటనష్టం దరఖాస్తు, అడంగల్‌లో చేర్పులు, మార్పులు, ఈబీసీ, ఓబీసీ, ఈ-పాస్ పుస్తకాలు, ఫ్యామిలీ మెంబర్(లీగల్‌హెయిర్), భూమి సర్వే చేయించుకునేందుకు ఎఫ్ లైన్ ఫిటీషన్, పట్టాదారు పుస్తకాల్లో మార్పులు, చేర్పులు వంటి మొత్తం 192 సేవలు అందిస్తున్నారు. గతంలో వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం పడిగాపులు కాసి, చెప్పులరిగేలా తిరిగేవారు. ఇపుడు మీసేవ కేంద్రాల ఏర్పాటుతో సులభంగా ధ్రువ పత్రాలు పొందుతున్నామని ప్రజలు చెబుతున్నారు.
సత్వర సేవలకు కృషి
విశాఖ ఏజేన్సీలో మొత్తం 26 మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు సకాలంలో సేవలందిస్తున్నాం. ఇప్పటివరకు మీసేవ కేంద్రాలపై ఎటువంటి ఫిర్యాదులు లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేవలందించేందుకు కృషి చేస్తున్నాం.
-కె. చంద్రశేఖర్‌బాబు, మీ సేవ కేంద్రాల
కో ఆర్డినేటర్, పాడేరు డివిజన్.
ఇక్కడ నిత్యం పడిగాపులే...
అనకాపల్లి న్యూస్‌లైన్ నెట్‌వర్క్ : మీసేవ ద్వారా అందించే సేవలను పెంచడంతో వినియోగదారులు అవస్థలు కూడా అదేస్థాయిలో పెరిగాయి. తహసీల్దార్ కార్యాలయం పక్కన గల మీసేవ కేంద్రాన్ని, అలాగే చోడవరం బస్టాప్ ఎదురుగా గల మీసేవా కేంద్రంపై ‘న్యూస్‌లైన్’ విజిట్ చేసినపుడు పలువురు విద్యార్థులు తమ గోడు వినిపించారు. ‘స్కాలర్‌షిప్ కోసం ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రం కోసం మీసేవలో దరఖాస్తు చేసుకున్నాను... నెలరోజులు పైబడుతున్నా సర్టిఫికేట్ మంజూరు కాలేదు...స్కాలర్‌షిప్ గడువు ముగస్తుం డడంతో తహసీల్దార్, వీఆర్‌ఓల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా పట్టించుకోలేదు...’ అంటూ సూర్య అనే విద్యార్థి వాపోయాడు. ‘మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నా సకాలంలో కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదు.. మరలా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సిఫార్సు చేసుకోవాల్సి వస్తోంది... తహసీల్దార్ కార్యాలయంలో సర్వర్ తరచూ పనిచేయకపోవడం తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం..’ అంటూ డిగ్రీ సెకెండియర్ విద్యార్థి అర్జున్ తెలిపాడు.
అక్కడ ‘సేవ’కు లేదు తీరిక
కశింకోట, న్యూస్‌లైన్ : కశింకోట మండలంలో మూడు మీ-సే వ కేంద్రాలున్నాయి.
కశింకోట, తాళ్లపాలెం, కన్నూరుపాలెంలో ఒక్కొక్కటి వంతున ఇవి ఉన్నాయి.
ప్రభుత్వ పని రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీ-సేవ కేంద్రాలు పని చేయాల్సి ఉంది. మధ్యాహ్నం గంట పాటు భోజన విరామ సమయం ఉంటుంది.
అయితే వీటిని సక్రమంగా వేళకు తెరవకపోవడం, పని వేళల్లో సరిగ్గా తెరిచి ఉండడం లేదని, దీనివల్ల ఇబ్బంది చెందాల్సి వస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కశింకోటలో ఒకే కేంద్రం ఉండడం వల్ల రద్దీ ఏర్పడి ఇబ్బంది పడాల్సి వస్తోందని, ఇంకా అదనపు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందంటున్నారు.
గ్రామీణ ప్రాంతంలో ఉన్న తాళ్లపాలెం, కన్నూరుపాలెం మీ-సేవ కేంద్రాలకు విద్యుత్ సమస్య వల్ల రోజులో ఒక పూట మాత్రమే పని చేస్తున్న పరిస్థితి ఉంది.
ఆయా కేంద్రాలు విద్యుత్ కోత వల్ల రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయడం లేదు. ఇన్వెర్టర్లు ఉన్నా అవి సరిగ్గా పని చేయడం లేదని, దీనివల్ల ధ్రువీకరణ పత్రాల కోసం దూరం నుంచి వ చ్చి ఇబ్బంది పడాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.
తరుచూ హైదరాబాద్‌లోని కేంద్రీయ సర్వర్ సరిగ్గా పని చేయక ప్రజలతో పాటు కేంద్రాల నిర్వహకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వస్తోంది. డిమాండ్‌కు తగ్గట్టు మీ-సేవ కేంద్రాలను అనుసంధానించే ప్రధాన సర్వర్ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉందని నిర్వాహకులు అంటున్నారు.
రద్దీ దృష్ట్యా కశింకోటలో అదనంగా రెండు మీ-సేవ కేంద్రాల ఏర్పాటు కోసం ప్రతిపాదించామని తహ సీల్దార్ కె.రమామణి పేర్కొన్నారు.