పొలాలకు చేరని ఆధునిక వ్యవసాయ యంత్రాలు | formers not reaching government funds in villagers | Sakshi
Sakshi News home page

పొలాలకు చేరని ఆధునిక వ్యవసాయ యంత్రాలు

Nov 29 2013 3:48 AM | Updated on Sep 2 2017 1:04 AM

పథకాలు, లక్ష్యాలు ఎంత గొప్పవైనా క్షేత్రస్థాయికి చేరితేనే ప్రయోజనం. లేదంటే ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోతాయి. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఈ కోవలోకే వస్తున్నాయి.

సాక్షి, కర్నూలు: పథకాలు, లక్ష్యాలు ఎంత గొప్పవైనా క్షేత్రస్థాయికి చేరితేనే ప్రయోజనం. లేదంటే ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోతాయి. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఈ కోవలోకే వస్తున్నాయి. అనేక ఆధునిక పరికరాలను రాయితీపై అందిస్తున్నామని చెబుతున్నా.. అవి జిల్లా రైతులకు చేరడం లేదు. దీనికోసం ఏటా కోట్లాది రూపాయలు రాయితీగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటున్నా.. వాటిని సకాలంలో అందించడంపై శ్రద్ధచూపడం లేదు. దీంతో  రాయితీలు కాగితాలకే  పరిమితమవుతున్నాయి. మరోవైపు కొన్ని పరికరాల ధరలు ఇంకా ఖరారు కాకపోవడం పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. వ్యవసాయంలో సాగు ఖర్చును, రైతుల శ్రమను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆధునిక యంత్రాల సాగును ప్రోత్సహిస్తోంది. ఇందు కోసం జిల్లాకు ఈ ఏడాది 1,860 పరికరాలను రైతులకు అందించేందుకు వీలుగా రూ. 2.61 కోట్ల రాయితీని మంజూరు చేసింది. అలాగే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్‌కేవీవై) పథకం కింద 1,341 పరికరాలను అందించేందుకు రూ. 3 కోట్లు కేటాయించింది.  
 
 ఈ మేరకు ఎస్సీ, ఎస్టీలకు రూ. 1.6 కోట్లుతో పాటు ఇతరులకు వేర్వేరుగా వ్యవసాయ డివిజన్ల వారీగా నిధులు కేటాయించారు. అయితే ఈ సబ్సిడీ గత ఏడాదితో పోల్చితే చాలా తక్కువ కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకు కొన్ని పరికరాలకు ధరలు నిర్ణయించలేదు. అలాగే నిధుల విడుదలకు సంబంధించిన ఎలాంటి ఉత్తర్వులు విడుదల చేయలేదు. దీంతో రైతులు సబ్సిడీ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
 జిల్లాలో సాగు విస్తీర్ణం సుమారు 10 లక్షల హెక్టార్లు. ప్రస్తుత నిబంధనల మేరకు రైతులు ముందుగా దరఖాస్తు చేసకుంటే వ్యవసాయాధికారులు రాయితీ ఉత్తర్వులు ఇస్తారు. తరువాత రైతులు తమకు నచ్చిన కంపెనీ పరికరాన్ని ఎంచుకునే వీలు కల్పించారు. జూన్ నుంచి సెప్టెంబరు వరకు కరువు పరిస్థితులు, ఆ తర్వాత సమైక్యాంధ్ర సమ్మె, ఇటీవల భారీ వర్షాలు, ప్రస్తుతం పెట్టుబడుల సమయం.. ఇవన్నీ లక్ష్యాలపై ప్రభావం చూపాయి.
 
 ఖరారు కాని ధరలు..
 రైతులు ఎక్కువ మంది తీసుకునే థైవాన్ పిచికారీ యంత్రాలు, తుంపర్ల(స్పింక్లర్లు) పరికరాల రాయితీ, అసలు ధర ఇంకా ఖరారు కాకపోవడంతో దరఖాస్తు చేసుకున్న వేలాది మంది రైతులు వాటి కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఖరీఫ్ సీజన్ దాటి రబీ పూర్తయ్యే పరిస్థితి వచ్చిన ఇంకా రైతులకు పరికరాలు అందలేదు. ఈ ఏడాది పరికరం వారీగా నిధులు కేటాయించారు. ధరలు ఖరారైన వాటిని రైతులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే దరఖాస్తు మంజూరు తదితర ప్రక్రియకు నాలుగైదు నెలలు పడుతోంది. దీంతోపాటు అవగాహన లేకపోవడం, విస్తృత ప్రచారం లేకపోవడంతో తెలిసిన కొద్ది మంది రైతులు మాత్రమే వీటిని సద్వినియోగం చేసకుంటున్నారు.
 
  వ్యవసాయ యంత్రాలను తీసుకునే రైతులు సంబంధిత డీలరు వద్ద బేరమాడితే వాటి ధర మరింత తగ్గించుకునే అవకాశం ఉంది. కొత్త నిబంధనల ప్రకారం రైతులు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, వీఆర్‌ఓ ధ్రువీకరించిన పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్, రెండు ఫొటోలను దరఖాస్తుకు జత చేసి మండల వ్యవసాయాధికారికి ఇవ్వాలి. ఆయన వాటిని పరిశీలించి జేడీఏ ద్వారా రాయితీని పొందుపర్చి ఉత్తర్వులు ఇస్తారు. తరువాత రైతు తీసుకునే పరికరం ధర బేరమాడి తగ్గించుకొని రాయితీ పోగా మిగిలిన డబ్బు డీడీ రూపేణా తిరిగి వ్యవసాయాధికారికి ఇస్తే ఆయన దాన్ని డీలర్‌కు పంపిస్తారు. అది రాగానే పరికరాన్ని పొందొచ్చు.
 
 అద్దెకు యంత్రాలు..
 కూలీల కొరత, అధిక ఖర్చులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం భారీ ఖర్చుతో కూడిన యంత్రపరికరాలు రైతులకు అందుబాటులో ఉంచేందుకు వీలుగా కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేంద్రాల నుంచి పరికరాలను రైతులు అద్దెకు పొందే అవకాశం ఉంది. ఎస్‌సీపీ పథకం కింద జిల్లాలో నాలుగు కేంద్రాల ఏర్పాటుకు నిధులు కేటాయించారు. ఆర్‌కేవీవై కింద మరో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. గత ఏడాది వీటి నిధులు వెకక్కు మళ్లాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎవరు దరఖాస్తు చేసుకోలేదు.
 
 కేంద్ర పథకాలదీ అదే తీరు..
 వ్యవసాయ పరికరాలకు వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద గత ఏడాది 7 కోట్లు కేటాయిస్తే రూ. 4.32 కోట్లు మాత్రమే ఖర్చయింది. ఇక ఈ ఏడాది రూ. 3 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో రైతుల కోసం ఎంతమేర ఖర్చుపెడతారో చూడాలి. కృషి వికాస్ యోజన కింద వరికోత, వరి నూర్పిడి, శ్రీపద్ధతిలో నాట్లేసే యంత్రాలు, వేరుశెనగ, మొక్కజొన్న వలిచే యంత్రాలు పొందవచ్చు. ఆధునిక వ్యవసాయ పరికరాల పథకంలో 30 నుంచి 50 శాతం వరకు సబ్సిడీ ఉంది. రోటావేటర్లు, కలుపుతీసే పరికరాలు, మినీ ట్రాక్టర్లు, పవర్‌టిల్లర్లు, పెద్ద ట్రాక్టర్లు వంటివి పొందవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement