హోదా పెరిగింది.. రాత మారనుంది

First grade municipality status - Sakshi

కావలి: గత పదిహేనేళ్లుగా కావలిని ఊరిస్తున్న ఫస్ట్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ హోదా అంశం సోమవారం మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆర్‌.కరికాల్‌ జీఓ నంబర్‌ 383ను జారీచేయడం ద్వారా కొలిక్కి వచ్చింది. 2002 నుంచి సెంకడ్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా ఉన్న కావలికి ఫస్ట్‌ గ్రేడ్‌ హోదా కల్పించాలని మున్సిపల్‌ అధికారులు అనేకసార్లు ప్రతిపాదనలు పంపారు. అయితే ఎప్పటికప్పుడు నిబంధనలు మారిపోవడంతో ఇది సాధ్యమవలేదు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ హోదా పెంపు అత్యవసరం కావడంతో విధిలేని పరిస్థితుల్లో ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమృత్‌ పథకం కింద నిధులు కేటాయించడానికి కనీసం మొదటి శ్రేణి మున్సిపాలిటీ స్థాయి నుంచి ఆపై స్థాయి కార్పొరేషన్లు అయ్యి ఉండాలని నిబంధనలు పెట్టింది. దీంతో కావలిని ఈ పథకంలో చేర్చడానికి అర్హత లేకుండా పోయింది. అయినప్పటికీ ఫస్ట్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా హోదా పెంచే ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వానికి నచ్చ చెప్పి కావలిని అమృత్‌లో చేర్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుని కావలిని ఫస్ట్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా మార్చుతూ ఆదేశాలు జారీచేసింది. 

1967లో థర్డ్‌ గ్రేడ్‌గా 
కావలి పట్టణం 1967 ఏప్రిల్‌ 1న థర్డ్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా అవతరించింది. అంతకుముందు 20 వేల జనాభా 10 వార్డులతో గ్రామ పంచాయతీగా ఉండేది. చివరి సర్పంచ్‌గా బుర్లా రాఘవరెడ్డి వ్యవహరించారు. మున్సిపాలిటీ అయ్యాక 1968లో 14 వార్డులుగా ఏర్పడి తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తొలి చైర్మెన్‌గా తోట రామమూర్తి ఎన్నికయ్యారు. అనంతరం చక్కా సత్యనారాయణ గుప్తా, ఏకుల వరప్రసాద్, మలెల్ల ఉదయభాస్కర్‌ చైర్మెన్‌లుగా వ్యవహరించారు. అనంతరం 1987లో 50 వేల జనాభాతో సెకెండ్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా మారింది. అప్పుడు 28 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో నీలయ్యగారి ప్రభాకర్‌నాయుడు చైర్మెన్‌ అయ్యారు. తర్వాత చలంచర్ల దేవసేన, గ్రంథి యానాదిశెట్టి ఆ పీఠాన్ని అధిరోహించారు. 2010లో 37 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో నగళ్ల శ్రీనివాస కిరణ్‌ చైర్మెన్‌ అయ్యారు. 2015లో 40 వార్డులు అయ్యాయి.

రూ.కోట్లకు చేరిన ఆదాయం 
గ్రామ పంచాయతీగా ఉన్నప్పడు కావలి వార్షిక ఆదాయం రూ.20 లక్షలు మాత్రమే. మూడవ శ్రేణి మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత వార్షిక ఆదాయం రూ.50 లక్షలకు, రెండవ శ్రేణి మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత రూ.7.86 కోట్లుకు చేరింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణంలో 97,053 మంది నివసిస్తున్నారు. కాగా పట్టణ ప్రజలకు మున్సిపాలిటీ ద్వారా అందించే సేవలు, అభివృద్ధి పనులు పెరగాలంటే స్థానికంగా సమకూరే నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే నిధులతో పాటు హడ్కో లాంటి ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణాలు కూడా అవసరమకుతాయి. ఆర్థికంగా మున్సిపాలిటీకి ఉన్న జవసత్వాలను ప్రామాణికంగా తీసుకుని, పట్టణంలో నివసిస్తున్న జనాభాను కొలమానికంగా అందించాల్సి సేవలు, వాటిని మెరుగుపరచాల్సింన అంశాలపై ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు ఆసక్తి చూపుతాయి. అలాగే ప్రభుత్వాలు నిధుల కేటాయింపు, వివిధ ప«థకాలను అమలు పరిచే విషయంలో గ్రేడ్‌–1 మున్సిపాలిటీలకు ప్రాధాన్యం ఇస్తాయి. అనధికారికంగా సుమారు 2 లక్షల జనాభా ఉన్న కావలి ప్రజలకు మరిన్ని సౌకర్యాలు మున్సిపాలిటీ ద్వారా అందించడానికి గ్రేడ్‌–1 హోదా దోహదపడుతుంది.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top