మాటవినలేదని కుటుంబం వెలివేత | Family Has Been Deported In Prakasam District Due To Land Problems | Sakshi
Sakshi News home page

మాటవినలేదని కుటుంబం వెలివేత

Apr 18 2020 10:23 AM | Updated on Apr 18 2020 10:34 AM

Family Has Been Deported In Prakasam District Due To Land Problems - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కొత్తపట్నం: ఇంటి స్థల వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఓ కుటుంబాన్ని ఊరంతా వెలేసింది. బాధితుడు తన ఆవేదనను సోషల్‌ మీడియా ద్వారా తెలియజేయడంతో పోలీసులు 26 మందిని బైండోవర్‌ చేశారు. కొత్తపట్నం మండలం కే పల్లెపాలేనికి చెందిన ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య ఇళ్ల స్థలమై వివాదం చోటుచేసుకుంది. బాధితులు సమస్యను గ్రామ కాపులు, పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఇది రెవెన్యూ సమస్యని, తమకు సంబంధం లేదని వారు తేల్చిచెప్పారు. ఈ వివాదం చోటుచేసుకున్న సుమారు 15 రోజుల తర్వాత ఇంటి స్థల వివాదంలోని ఒకరైన వలేటి మనోజ్‌ విజయ్‌ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బంగారమ్మ దగ్గర మూడేళ్ల కిందట రూ.లక్ష వడ్డీకి తీసుకున్నాడు. నోటు గడువు ముగియడంతో ఆమె అసలు, వడ్డీ ఇవ్వాలని మనోజ్‌ విజయ్‌ను అడగడంతో కరోనా వైరస్‌ ప్రభావంతో తన దగ్గర లేవని చెప్పాడు.

దీంతో బంగారమ్మ తనకు న్యాయం చేయాలంటూ గ్రామ పెద్దలు, కాపుల దృష్టికి సమస్యను తీసుకెళ్లింది. కాపులు మనోజ్‌ విజయ్‌ను పంచాయతీకి రావాలని పిలిచారు. దీంతో ‘నా ఇంటి స్థలం సమస్యను కాపులు, గ్రామ పెద్దలు పరిష్కరించనప్పుడు వడ్డీ డబ్బుల సమస్య ఏవిధంగా పరిష్కరిస్తారు.. నేను రాను’ అని మనోజ్‌ చెప్పాడు. కాపుల మాట వినలేదు కనుక ఈ గ్రామంలో అతనితో ఎవ్వరూ మాట్లాడొద్దని, షాపుల్లో సరుకులు కూడా ఇవ్వొద్దని ఆ కుటుంబాన్ని వెలేశారు. అప్పటి నుంచి గ్రామంలో ఎవ్వరూ మాట్లాడటం లేదని, షాపుల దగ్గరకు వెళ్తే సరుకులు ఇవ్వడం లేదంటూ తన దయనీయ స్థితిని బాధితుడు ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు.

వీడియోలను చూసిన తహసీల్దార్‌ ఉయ్యాల పుల్లారావు, రెండో పట్టణ సీఐ రాజేష్‌, ఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు గురువారం గ్రామస్తులను పిలిపించి వెలివేయడం సామాజిక నేరమని, అందరూ ఐక్యంగా ఉండాలంటూ అవగాహన కల్పించారు. అయినా తీరు మారకపోవడంతో శుక్రవారం ఇరువర్గాలను రెండో పట్టణ సీఐ సమక్షంలో విచారించి వారికి చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సారి వెలివేయడం లాంటివి చేస్తే క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరిస్తూ 26 మంది గ్రామ పెద్దలు, కాపులను బైండోవర్‌ చేశారు. అలాగే బంగారమ్మకు ఇవ్వాల్సిన రూ. లక్షకు వడ్డీ కలిపి ఇవ్వాలని మనోజ్‌ విజయ్‌కు సూచించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement