డెంకాడ మండలం అయినాడ సమీపంలో దొంగనోట్లు చెలామణి చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ కార్తికేయ తెలిపారు.
దొంగనోట్ల చెలామణి కేసులో ఆరుగురి అరెస్ట్
Sep 14 2013 5:26 AM | Updated on Aug 21 2018 5:44 PM
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : డెంకాడ మండలం అయినాడ సమీపంలో దొంగనోట్లు చెలామణి చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ కార్తికేయ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. గురువారం రాత్రి దొంగనోట్లు చెలామణి చేస్తున్న వారిని ఓ పాన్‌షాపు యజమాని గుర్తించి డెంకాడ పోలీసులకు సమాచారమివ్వడం, పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులోనికి తీసుకోవడ ం విదితమేనన్నారు. ఈ మేరకు వారి వద్ద నుంచి రూ.13 వేలు విలువ గల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నకిలీ కరెన్సీతోపాటు రూ.11,500 అసలు నగదును, ఒక ఆటోను, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
నిందితులు విశాఖపట్నంలోని పోతిన మల్లయ్యపాలేనికి చెందిన దొడ్డిరాజు, కాండ్రాగుల ఉషారాణి, భీమునిపట్నానికి చెందిన తాలాడ నవీన్‌కుమార్, విశాఖకు చెందిన గండిబోయిన ఈశ్వరరావు, నల్లి శ్రీనివాసరావు, విజయనగరం పూల్‌బాగ్‌కు చెందిన కుంటుమహంతి పద్మావతిగా గుర్తించామన్నారు. దొంగనోట్ల ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను, సిబ్బందిని అభినందించారు. త్వరలో వారికి రివార్డులు అందజేస్తామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ టి.మోహనరావు, డీఎస్పీ కె.కృష్ణప్రసన్న, భోగాపురం సీఐ ప్రవీణ్ కుమార్, డెంకాడ ఎస్సై శ్రీధర్, సీసీఎస్ సీఐలు ఎ.వి.రమణ, కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement