బడుగుల ద్రోహి చంద్రబాబు: వి.ఈశ్వరయ్య

Eswariah fires on Chandrababu - Sakshi

తిరుపతి అర్బన్‌: సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ద్రోహిగా మారారని హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఈశ్వరయ్య ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని విమర్శించారు. చంద్రబాబు పాలన పట్ల రాష్ట్ర ప్రజల్లో 65 శాతం మంది వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. బాబు పాలనలో నీతి, నిజాయతీ, పవిత్రత, పారదర్శకత లేకుండా పోయాయని అన్నారు.

ఆదివారం చిత్తూరు జిల్లా తిరుపతిలో జనచైతన్య వేదిక, ఫౌండేషన్‌ ఫర్‌ సోషల్‌ అవేర్‌నెస్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ‘అభివృద్ధి వికేంద్రీకరణ–రాజకీయాల్లో సామాజిక న్యాయం’ అనే అంశంపై చర్చావేదిక నిర్వహించారు. మాజీ స్పీకర్‌ డాక్టర్‌ అగరాల ఈశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్‌ ఈశ్వరయ్య, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఐవైఆర్‌ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. జస్టిస్‌ ఈశ్వరయ్య మాట్లాడుతూ... 2011 లెక్కల ప్రకారం కులాల వారీగా జనాభా వివరాలను ప్రకటించాలని కోరారు. సుప్రీంకోర్టు జడ్జి చేతుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలుబొమ్మగా మారారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసేలా పాలకులు వ్యవహరిస్తే సామాన్యులకు న్యాయం జరగదన్నారు.

అవినీతిని ప్రజలు ప్రశ్నించాలి 
1953 పాలనా విధానాల ప్రకారం రాయలసీమలో హైకోర్టు గానీ, రాజధాని గానీ ఏర్పాటు చేయాల్సి ఉండగా, అధికార పార్టీ నేతలు స్వలాభం కోసం అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేస్తున్నారని జస్టిస్‌ ఈశ్వరయ్య మండిపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేవారిని అభివృద్ధి నిరోధకులుగా ముద్రవేసి చంద్రబాబు ఏకపక్ష పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే సాగునీటి ప్రాజెక్ట్‌లు 90 శాతం పూర్తయ్యాయని, ఆ తరువాత 9 ఏళ్లకాలంలో 5 శాతం కూడా అభివృద్ధి జరగలేదని వ్యాఖ్యానించారు.

అంతకుముందు జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి, ఐవైఆర్‌ కృష్ణారావులు మాట్లాడుతూ... రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీ పరిశీలన చేసి ఇచ్చిన నివేదికలో ప్రతి అక్షరమూ సత్యమేనన్నారు. అన్ని కులాలకు రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. న్యాయ వ్యవస్థలోనూ పెత్తందారీ విధానాలు ఆందోళనకరమని చెప్పారు. వైఎస్సార్‌ చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించి, సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తే ఆయనకు మంచి పేరొస్తుందనే ఉద్దేశంతోనే ఆయా పథకాలను తొమ్మిదేళ్లుగా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top