కుంభకోణాల ఊబిలో ఎస్కేయూ | Eskeyu ridden scams | Sakshi
Sakshi News home page

కుంభకోణాల ఊబిలో ఎస్కేయూ

Nov 17 2014 3:18 AM | Updated on Aug 17 2018 12:56 PM

కుంభకోణాల ఊబిలో ఎస్కేయూ - Sakshi

కుంభకోణాల ఊబిలో ఎస్కేయూ

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిధులను స్వాహా కుంభకోణంలో కళ్లు బైర్లు కమ్మేలా విషయాలు వెల్లడవుతున్నాయి.

యూనివర్సిటీ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిధులను స్వాహా కుంభకోణంలో కళ్లు బైర్లు కమ్మేలా విషయాలు వెల్లడవుతున్నాయి.  అవినీతి సొమ్ము  రూ.5.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. సీనియర్ ప్రొఫెసర్ల  విచారణ కమిటీ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక దర్యాప్తు ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందనే విషయాన్ని ఎస్కేయూ రిజిస్ట్రార్ ఆచార్య కే.దశరథరామయ్య అధికారికంగా వెల్లడించలేదు.  ఆర్థిక నేరం తీవ్రతనుబట్టి  కేసును సీబీసీఐడీకి అప్పగిస్తారా, లేదా ఏసీబీకి అప్పగిస్తారా అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  

 ఆ ఇద్దరిపై క్రిమినల్ కేసులు: ఎస్కేయూలోని ఫైనాన్స్ విభాగంలో విధులు నిర్వహించి ఆర్థిక నేరాలకు పాల్పడిన ఉదయభాస్కర్‌రెడ్డి, శేషయ్యల మీద కేసులు నమోదు చేశారు. 406,409,468,471,477,420 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసులు పెట్టారు.వీరిని అరెస్ట్ చేయాలని అందులో పేర్కొన్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు ఇటుకలపల్లి ఎస్సై శివగంగాధర్ రెడ్డి తెలిపారు.

కాగా గత ఏడాది నుంచి ఈ ఏడాది నవంబర్ 11 వరకు జరిపిన  విచారణలో శేషయ్య రూ.70 లక్షలు, ఉదయభాస్కర్ రెడ్డి తన ఖాతాలో రూ. 25 లక్షలు, తన భార్య ఖాతాలో రూ. 25 లక్షలు, కుటుంబ సభ్యులఖాతాలో రూ.20, రూ.33 లక్షల చొప్పున జమా చేసినట్లు సమాచారం, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో రూ.1.5 కోట్లు ఉన్నట్లు తెలిసింది.

 ఆన్‌లైన్ విధానం అమలులోనే ఒంటెత్తు పోకడలు: నేరుగా జీతాలు చెల్లింపు విధానం నుంచి ఆన్‌లైన్‌లో జీతాల జమ చేసిన విధానంలోనే అప్పటి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్ ఒంటెత్తు పోకడలను అవలంబించారు. 2011 అక్టోబర్ నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేశారు. వర్సిటీలో నూతన విధానాన్ని అమలు చేసేటపుడు ఓ కమిటీని ఏర్పాటు చేసి వాటిలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు.

అనంతరం సూచించిన సిపార్సుల ఆధారంగానే అమలు చేయాలి.   హార్డ్‌కాపీలో వివరాలను నమోదు చేయకుండా కేవలం పెన్‌డ్రైవ్ ద్వారా మాత్రమే బ్యాంకు వారికి వివరాలు అందించడంతో అవినీతికి ఆస్కారం ఏర్పడినట్లు తెలుస్తోంది.   ఆర్థిక కార్యకలాపాలకు బాధ్యత వహించాల్సింది రిజిస్ట్రార్‌లు, ఫైనాన్స్ ఆపీసర్లే. ప్రతి బిల్లు పైన జూనియర్ అసిస్టెంట్ ,సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లు   సంతకాలు చేస్తారు.  అయితే ఇద్దరు అధికారులు మాత్రమే అవినీతికి పాల్పడినట్లు  కేసులు నమోదు చేశారు.

 బాధ్యతారాహిత్యం : 2011 నవంబర్ 11 న ఎస్కేయూ వీసీగా రామకృష్ణా రెడ్డి భాద్యతలు స్వీకరించారు. అప్పటినుంచి ఈ అవినీతి తంతు పురివిప్పింది.

  ఉద్యోగులు లంచం తీసుకుంటూ దొరికినప్పటికీ ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కోట్లాది రూపాయలు   వర్సిటీ జనరల్ ఖాతా నుంచి మళ్లిం చారంటే ఆయన హయాంలో అవినీతి ఎంత జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

 బోధన, బోధనేతర ఉద్యోగుల్లో ఆందోళన : ఎస్కేయూ బోధన, బోధనేతర ఉద్యోగులు వారి ఆర్థిక సామర్థ్యం మేర జనరల్ ప్రావిడెండ్ ఫండ్‌లో జమ చేస్తారు. అయితే ఈ ప్రావిడెండ్ ఫండ్ నిధులను మళ్లించి స్వాహా చేశారనే ఆందోళనలు ఉద్యోగుల్లో మొదలయ్యాయి. రిటైర్డ్ బెనిఫిట్స్ కింద రూ.5 కోట్లన జమ చేశారు.  వీటి నుంచి ఎంత మళ్లించారనే అనుమానాలు మొదలయ్యాయి.

 దూరవిద్య ఆదాయం కూడా కలిసొచ్చింది : ఎస్కేయూకు బోధన,బోధనేతర ఉద్యోగులకు జీతాల చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్‌గ్రాంట్స్ సాధారణ బడ్జెట్ నుంచి విడుదల చేస్తుంది. కేటాయించిన బ్లాక్‌గ్రాంట్స్ నిధులు చాలకపోతే అంతర్గత వనరుల నుంచి జీతాలను చెల్లిస్తారు. దూర విద్య ఆదాయం గత ఏడాది రూ.18 కోట్లు, ఈ సంవత్సరం రూ.22 కోట్లు వచ్చింది.వీటిని నేరుగా వర్సిటీ ఖాతాలో జమ చేశారు. జీతాల చెల్లింపుకు బ్లాక్‌గ్రాంట్స్ కొరత రావడంతో దూరవిద్య ఆదాయం ద్వారా జీతాలను చెల్లించారు. దీంతో అందినకాడికి నిధులను దారి మళ్లించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement