పచ్చనేత – మట్టిమేత

Endless looting in neeru chettu program - Sakshi

నీరు – చెట్టులో అంతులేని దోపిడీ

రూ. వేల కోట్ల ప్రజా ధనం స్వాహా

ఇష్టానుసారంగా పనులు చేపట్టిన నాయకులు

కొన్నిచోట్ల అవసరం లేకున్నా పనులు

మరికొన్ని చోట్ల చేసినా నాసిరకమే

75 శాతం నిధులు స్వాహా

ఆ పథకం..  అధికార పార్టీ కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు కల్పతరువు.
ఆ పథకం.. ఒక పిల్ల కాలువలో కూడా ఎన్ని రకాలుగా దోచుకోవచ్చో తెలిపింది.
ఆ పథకం.. పనులేవీ చేయకుండానే ప్రజాధనాన్ని ఎలా పంచుకుతినొచ్చో చూపింది.

భూగర్భ జలాల పరిరక్షణ కోసమమంటూ సీఎం చంద్రబాబు ప్రారంభించిన ‘నీరు–చెట్టు’ పథకమది. ఈ పథకం మాటున మరో ‘పథకం’ ఉందని తొలి ఏడాదిలోనే తెలిసిపోయింది. నాలుగేళ్లలో రూ. 34,399 కోట్లు పచ్చచొక్కాల జేబుల్లోకి వెళ్లిపోయాయి. ఈ పథకం కింద చేసిన పనులే మళ్లీ మళ్లీ చేసినట్లు బిల్లులు చేసుకుంటున్నారు.. పైపైన పనులు చేసి పూర్తి బిల్లులు కొట్టేస్తున్నారు.. అవసరం లేని చోట కూడా అరకొరగా పనులు చేసి డబ్బు నొక్కేస్తున్నారు. చెరువుల పూడికతీసి ఇసుక, మట్టి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.. 25 శాతం పనులు చేసి 75 శాతం నిధులను స్వాహా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో.. అన్ని నియోజకవర్గాల్లో.. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ అక్రమాలన్నీ బ యటపడ్డాయి. చంద్రబాబు నాలుగేళ్లపాలన ఏ తీరున సాగిందో తెలుసుకునేందుకు నీరు – చెట్టులో సాగిన దోపిడీయే ఒక నిదర్శనం.

నాలుగేళ్లలో కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లులు - రూ.12,866 కోట్లు
పనులు జరిగిన విలువ - రూ.3,216.5 కోట్లు (25 శాతం)
కాంట్రాక్టర్లు దోచుకున్న మొత్తం - రూ.9,649.5 కోట్లు (75 శాతం)
చేసిన పనుల్లో కాంట్రాక్టర్లు అమ్ముకున్న మట్టి, ఇసుక విలువ - రూ.24,750 కోట్లు
రాష్ట్ర ఖజానాకు జరిగిన మొత్తం నష్టం - రూ.34,399 కోట్లు
ప్రస్తుతం జరుగుతున్న పనుల విలువ - రూ.1,500 కోట్లు

చినబాబు ఇలాకాలో తమ్ముళ్ల ధమాకా
కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలోని నిమ్మకూరు గ్రామంలోని చెరువు ఇది. ఇది ఎన్టీఆర్‌ స్వగ్రామం. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్‌ దత్తత తీసుకున్నారు కూడా. అభివృద్ధి పేరుతో ఇక్కడి చెరువుని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు అడ్డగోలుగా తవ్వేసి సొమ్ము చేసుకున్నాడు.

పూడిక తీయడానికి ప్రభుత్వం రూ.8.5లక్షలు మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం చెరువులో 3–4 మీటర్ల వరకు మాత్రమే పనులు చేపట్టాల్సి ఉండగా 10–15 మీటర్ల లోతు వరకు తవ్వేసుకొని మట్టిని విచ్చలవిడిగా అమ్మేసుకున్నాడు. ఇలా సదరు నాయకుడు దాదాపు రూ.70 లక్షలకు పైగా వెనకేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఇటీవలి ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.

నీరు చెట్టు పథకం కింద నాలుగేళ్లలో రూ.12,866 కోట్లు ఖర్చుచేశారు. కాంట్రాక్టర్లకు అందించిన ఈ నిధుల్లో 75శాతం మేర మింగేస్తున్నారని, 25శాతం మేర మాత్రమే పనులు చేస్తున్నారని ఈ శాఖకు సంబంధించిన అధికారులే వ్యాఖ్యానిసున్నారు. అంటే.. రూ.9,649 వేల కోట్లకు పైగా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లిపోయాయన్న మాట. ఇక మట్టిని, ఇసుకను అమ్ముకుని రూ. 24,750 కోట్లను పచ్చనేతలు, కాంట్రాక్టర్లు కైంకర్యం చేశారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని ఓ వైపు ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికీ మరోవైపు నీరు–చెట్టు పనులకు సంబంధించిన బిల్లులు ఎక్కడా పెండింగ్‌లో ఉండడంలేదు. ఈ పథకం కింద పనులకు టెండర్లు పిలవకుండానే నామినేషన్‌ పద్ధతిపై పనులు కేటాయిస్తున్నారు. ఈ విధానాన్ని గతంలో హైకోర్టు తప్పబట్టినప్పటికీ చంద్రబాబు సర్కార్‌ పట్టించుకోలేదు సరికదా.. నిబంధనలు మార్చి కొనసాగిస్తోంది.

తూతూమంత్రంగా పనులు..
ఈ పథకం కింద పనులు దక్కించుకున్న నేతలు, కాంట్రాక్టర్లు పనులు మొక్కుబడి చేశారనే విమర్శలు కోకొల్లలు. రైతులకు ఉపయోగపడే పనులు పైపైనే కానిచ్చేసి మమ అనిపించారు. కొన్నిచోట్ల నాయకుల కోసం పనులు చేసిన ఉదంతాలూ ఉన్నాయి. ఉదాహరణకు..  
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని వాడపాలెంలో కొందరు రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు. ఇక్కడ అవసరం లేకపోయినా స్థానిక టీడీపీ నేత రూ.10లక్షలు మంజూరు చేయించుకుని పైపైన అడుగు లోతులో డ్రెయిన్‌ను తవ్వారు.
 అనంతపురం జిల్లా కణేకల్లు మండలం యర్రగుంట గ్రామంలో పర్క్యులేషన్‌ ట్యాంకులో మూడు విడతలుగా పూడికతీత పనులు చేపట్టారు. ఇందుకు రూ.80లక్షలు మంజూరు చేశారు. రాయదుర్గం మార్కెట్‌యార్డు వైఎస్‌ చైర్మన్‌ వన్నారెడ్డి స్వయంగా ఈ పనులు చేశారు. నామమాత్రంగా పనులు చేశారనే ఆరోపణలు స్థానికంగా గుప్పుమన్నాయి.
    విజయనగరం జిల్లా తెర్లాం మండలంలో ఈ పథకం కింద చేసిన పనులు రైతులకు నష్టం చేకూర్చినట్లు ఆరోపణలున్నాయి. చెరువు గట్లు ఇంతకు ముందే బాగుండేవని.. పనుల తర్వాత పాడయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పనులను రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి బంధువులకు అప్పగించినట్లు రైతులు చెబుతున్నారు.
   అలాగే, చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గొల్లపల్లి వద్ద ముష్టిమాకుల చెరువు పనులను అధికార పార్టీ నేత చేపట్టారు. నాసిరకం పనుల వల్ల గత ఏడాది అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు చెరువు కట్ట నుంచి నీళ్లు లీకయ్యాయి. ఫలితంగా చెరువులోని నీరు వృధాగా పోయింది. చివరికి చెరువు కట్ట అధ్వానంగా మారింది. ఇలా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.

పనులు చేయకుండానే..
చేపట్టిన పనులు మొక్కుబడిగా చేసి బిల్లులు పొందిన తెలుగుదేశం నేతలు కొందరైతే అసలు పనులు చేయకుండానే పనులు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెలుస్తున్న ఘనాపాటీలు మరికొందరు.
 శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలం దేవరవలస పంచాయతీలో 2017లో నాలుగు చెరువులకు రూ.40లక్షలు మంజూరు చేశారు. కానీ, పనులు మాత్రం కాలేదు. ఇవి జరిగినట్లు రికార్డు చేయాలని స్థానిక టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు భోగట్టా.
   కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలోని కాల్వ పూడుకుపోయిందని నీరు–చెట్లు కింద రూ.8.5లక్షలతో పనులు చేపట్టారు. అయితే ఒక్కసారి కూడా వర్షం రాకుండానే మళ్లీ యథాస్థితిలోనే కనిపిస్తోంది.
♦  తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని గోర్స, కొత్తపల్లి, నాగులాపల్లి, రమణక్కపేట, కొమరగిరి తదితర 15 గ్రామాల్లో పనులు చేసినట్లు చూపించి రూ.కోట్లు కొల్లగొట్టేశారు.
 నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని తలమంచిలో కాలువ పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారు. దీనిపై స్థానిక నాయకుడు పిట్టి సూర్యనారాయణ కలెక్టర్, లోకాయుక్త, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్‌ అధికారులు పనులను పరిశీలించినా చర్యలు లేవు. కలెక్టర్‌ మాత్రం ఇరిగేషన్‌ ఏఈ రవికుమార్‌ను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు.
   వైఎస్సార్‌ జిల్లా పులివెందుల మండలం తొండూరులో అధికార పార్టీ నాయకులు వాగులు, వంకలు, చెరువులు లేకపోయినా పొక్లెయిన్ల సహాయంతో అక్కడ సృష్టించారు. ఇలా రూ.కోట్లలో పనులు చేసినట్లు చెబుతున్నారు.
   వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండల పరిధి గూడెం చెరువు గ్రామంలోని గూడాదేవి చెరువులో గత ఏడాది టీడీపీ నాయకులు నీరు–చెట్టు పనుల్లో భాగంగా పూడికతీత చేపట్టారు. అయితే ఇరిగేషన్‌ శాఖాధికారుల అనుమతి లేకుండా పొక్లెయిన్లతో మట్టిని తరలించారు. గతంలో కూడా ఇక్కడ పూడికతీత పనులు చేపట్టి డబ్బులు దండుకున్నారు. దీనివల్ల రూ.5లక్షలు దుర్వినియోగమయ్యాయి.
   కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో హెబ్బటం, వందవాగిలి, చిన్నహ్యాట, పెద్దహ్యాట, ఎల్లార్తి, గజ్జెహళ్లి, లింగంపల్లి, సులువాయి, విరుపాపురం గ్రామాల పరిధిలో నీరు–చెట్టు కింద మొత్తం 65పనులను గుర్తించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.6కోట్లు కేటాయించింది. శేషగిరి, బసప్ప, ఈరన్న, వెంకటేశ్వర్లు, రామిరెడ్డి, ఈశ్వర్‌గౌడ్‌ పేర్లతో పనులు పూర్తయ్యాయి. కొందరు అధికారులతో కలిసి టీడీపీ నేతలు లెక్కల్లో పనులు పూర్తిచేసినట్లు చూపించి నాణ్యతకు తిలోదకాలిచ్చారు. 65పనుల్లో 45కూడా పూర్తికాకుండానే రూ.5కోట్లు లాగేశారు.  
    కృష్ణాజిల్లా తిరువూరు మండలంలో మైనర్‌ ఇరిగేషన్‌ పరిధిలో 53 పనులు మంజూరు కాగా, రూ.4.58కోట్లు కేటాయించారు. వీటిలో 30 పనులు మాత్రమే పూర్తయినా అన్నింటికీ బిల్లులు మాత్రం సిద్ధం చేసేశారు.
 తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి జంబూపట్నం బలరామయ్య చెరువు సప్లయ్‌ చానెల్‌ అభివృద్ధికి రూ.9లక్షలతో ప్రతిపాదించారు. రెండున్నర కిలోమీటర్ల కాలువలో తూతూమంత్రంగా పనులు చేసి మట్టిని అమ్ముకున్నారు. చేసిన పనుల కంటే పొందిన బిల్లులు ఎక్కువగా ఉన్నాయన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఏడాది  తిరక్కుండానే ఈ చానెల్‌ పూడికలతో నిండిపోయింది.
   విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలోని చోడపల్లి చెరువుకు సంబంధించి 2016–17లో రూ.22లక్షల మేర పనులు చేశారు. సగం మట్టిని గట్టు చోడమాంబిక ఆలయ స్థలం కప్పుదలకు కేటాయించారు. మిగిలిన మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అనుచరుడు వేగి మహేష్‌ ఈ పనులు చేపట్టారు. ఈ చెరువు కింద ఎలాంటి ఆయకట్టు లేదు. కేవలం మట్టి తవ్వకాలకే పూడిక తీత అన్నట్లుగా పనులు సాగాయి. మట్టి అమ్మకాల ద్వారా రూ.30లక్షల మేర సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది.
    విజయనగరం పెద చెరువు పనులన్నీ ఎమ్మెల్యే మీసాల గీత అక్క పెనుమజ్జి విజయలక్ష్మికే అప్పగించేశారు. టెండర్‌ లేకుండా ఎమ్మెల్యే సిఫారసుతో పనులు దక్కించుకున్నారు. 2016–17లో నీరు–చెట్లు పనులకు రూ.1.6కోట్లు మంజూరయ్యాయి. 16 పనులను ఎమ్మెల్యే సోదరే చేపట్టారు. ఇక్కడి పనుల్లో అరకోటికి పైగా దుర్వినియోగం అయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
 చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలం కరసనపల్లి పంచాయతీలోని హనుమాన్‌ చెరువు మరమ్మతులకు 2015–16లో నీరు–చెట్టు కింద రూ.9లక్షలతో పనులు చేశారు. కాంక్రీట్‌ పనులు చేపట్టకుండా కట్టపై మట్టి పనులు చేసి వదిలేశారు. దీంతో కట్ట అంచులు కోతకు గురయ్యాయి. ఈ పనులను జన్మభూమి కమిటీ పేరుతో పెద్ద పంజాణి మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీరాములు చేపట్టారు.

అధికార పార్టీ నేతల మధ్య కలహాలు..
నీరు చెట్టు పథకం అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు సృష్టిస్తోంది. మట్టి తవ్వకాల్లో అభిప్రాయభేదాలు తలెత్తుతున్నాయి. చివరికి బదిలీలు, విధుల నుంచి తొలగించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉదా.. గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచర్లపాలెంలోని 5 ఎకరాల ఊర చెరువులో గతేడాది మట్టి తవ్వారు.

5,600 ట్రక్కుల మట్టిని తవ్వి ట్రక్కు రూ.600 చొప్పున విక్రయించారు. అధికార పార్టీకే చెందిన సర్పంచ్‌ కఠెవరపు నిర్మలాకుమారి ప్రమేయం లేకుండా ఎంపీటీసీ కొత్త లక్ష్మీతులసి భర్తకు రూ.35 లక్షల ఆదాయం సమకూరింది. రూ.6 లక్షలతో చెరువు చుట్టూ కంచె వేయించారు. దీనిపై సర్పంచ్‌ వర్గం ఆగ్రహం చెందింది. పంచాయతీ కార్యదర్శిని బదిలీ చేయించి.. ఫీల్డు అసిస్టెంటును విధుల నుంచి తొలగించారు.

రియల్‌ ఎస్టేట్‌కు సంతర్పణ
విశాఖ జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురంలో 600ఎకరాల విస్తీర్ణం కలిగిన  ఈ సాగునీటి చెరువులో రూ.40 లక్షలు నీరు–చెట్టు నిధులు, రూ.10లక్షలు పాల సంఘాల నిధులు, రూ.15లక్షలు విశాఖ డెయిరీ నిధుల సహకారంతో పూడికలు తీశారు. టీడీపీకి చెందిన మండల వైస్‌ ఎంపీపీ భూతనాధుని నానికుమార్‌ పర్యవేక్షణలో జరిగిన ఈ పనిలో భారీ అవినీతి చోటుచేసుకుందని పెద్దఎత్తున ఆరోపణలు ఉన్నాయి.

ఈ మట్టిని రియల్‌ ఎస్టేట్‌ భూముల ఎత్తు పెంచేందుకు అమ్మేశారు. అలాగే, పీఎస్‌పేట రోడ్డులో మరో టీడీపీ నాయకుడు సుమారు 6 ఎకరాల పంట భూమిలో ప్లాట్లు వేశాడు. ఈ భూమిని ఎత్తు చేసేందుకు లక్ష్మీపురం చెరువు, చోడవరం పాత చెరువు మట్టిని యథేచ్ఛగా తరలించారు. ఎమ్మెల్యే అనుచరుడుగా ఉన్న పంచాయతీరాజ్‌ కాంట్రాక్టర్‌కే చోడవరం పాత చెరువు నీరు–చెట్టు పనులు అప్పగించడంతో తవ్విన మట్టిని నేరుగా రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లకు అమ్మేశాడు.

రూ.3కోట్ల మట్టి మింగేశారు
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ఎఫ్‌కే పాలెంలోని పాపిడిదొడ్డి చెరువు 70ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సుమారు 1,500 ఎకరాల ఆయకట్టు ఉంది. గత మూడేళ్లుగా నీరు–చెట్టు పథకంలో సుమారు రూ.3కోట్లు ఖర్చుచేసి ఈ చెరువును నియోజకవర్గ ప్రజాప్రతినిధి సోదరుని ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినట్లు చెబుతున్నారు. అయితే, ఇందులో మట్టిని పొక్లెయిన్లతో తవ్వి భారీ లారీలతో ఇటుక బట్టీలకు సుమారు రూ.3కోట్ల విలువైన మట్టిని అమ్ముకున్నారు.

దీంతో చెరువు గోతులమయంగా మారి సాగునీటి కాలువల్లోకి ప్రవహించడంలేదని రైతులు వాపోతున్నారు. ఇదే చెరువులో ఉపాధి హామీ పథకం కింద కూడా ఏటా రూ.15లక్షలతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు, వందల మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నట్లు లెక్కలు చూపిస్తూ రెండు విధాలా లాభం పొందుతున్నారు. లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వుతూ వేలల్లో మాత్రమే తవ్వుతున్నట్లు సర్కార్‌కు చూపుతూ ఖజానాకు భారీ నష్టం చేకూరుస్తున్నారు. అలాగే, ఎక్కడా రైతులకు ఒక్క ట్రాక్టర్‌ మట్టి కూడా ఇవ్వలేదు. చెరువు గట్లు పటిష్టం చేసిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు.

ఎక్కడి జమ్ము అక్కడే..
నెల్లూరు జిల్లాకు చెందిన ఈ చిత్రంలో కనిపిస్తున్న మలిదేవి డ్రెయిన్‌ కనిగిరి రిజర్వాయర్‌ నుంచి నెల్లూరు జిల్లా కొడవలూరు మీదుగా విడవలూరు మండలం వరకూ వెళ్తోంది. డ్రెయిన్‌లోని గుర్రపుడెక్క, జమ్మును తొలగించేందుకు నీరు–చెట్టు పథకం కింద 2015లో రూ.50లక్షలను కేటాయించారు. ఈ పనులను కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనుచరుడు చెముకుల చైతన్యకు కేటాయించారు. వర్షాకాలం ముందు చేయాల్సిన పనులను జోరుగా వర్షాలు కురిసే సమయంలో ప్రారంభించారు. నామమాత్రంగా పనులు చేసి నిధులను కైంకర్యం చేశారు. ఫలితంగా గుర్రపుడెక్క, జమ్ము అలాగే ఉన్నాయి.

కంపచెట్ల మాటున కొల్లగొట్టారు
ఫొటోలో కనిపిస్తున్నది అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మల్కాపురం గ్రామ చెరువు. నీరు–చెట్టు కింద ఈ చెరువులో కంపచెట్లు తొలగించినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు మాయచేశారు. కంప చెట్లు తొలగించకుండానే నిధులు పిండేశారు. పనులు చేసినట్లు చూపి ఏకంగా రూ.6.41లక్షలు బిల్లులు చేసుకున్నారు. కంపచెట్లు మాత్రం చెరువు నిండా అలానే ఉన్నాయి.

ఏఈ.. పనులు ఏవీ?
ఇక్కడ కనిపిస్తున్నది కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం పాంపల్లి నుంచి ఇంజేడు వరకు వర్షపు నీరు పోయే కుందనవాగు. ఇప్పటివరకు ఇది ఎప్పుడూ ఉప్పొంగలేదు. ఈ వాగును అభివృద్ధి చేసేందుకు మంత్రి అండదండలతో శివరామిరెడ్డి అనే ఏఈ కాంట్రాక్టు పొందారు.

ఈయన విధులకు హాజరు కాకుండా దీర్ఘకాలిక సెలవులో కొనసాగుతూ కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. కుందనవాగు అభివృద్ధి పేరుతో రూ.40లక్షలు ఖర్చు చేసినట్లు చూపారు. కానీ, పనులు ఎక్కడ చేశారో తెలీడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.. కేవలం టీడీపీ నాయకులకు నిధులు మళ్లించేందుకే ఇక్కడ పనులు చేశారనే
అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

బిట్టు బిట్టుగా దోపిడీ
ఫొటోలో కనిపిస్తున్న నిర్మాణం వైఎస్సార్‌ జిల్లా వల్లూరు మండలం పైడికాలువ, పెద్దపుత్త గ్రామాల మధ్యనున్న వంకపై పైడికాలువ పంచాయతీ పరిధిలోని జంగంపల్లె వద్ద నీరు–చెట్టు కింద నిర్మించిన మోడల్‌ చెక్‌ డ్యామ్‌ ఇది. మట్టి పనులను రెండుగా, కాంక్రీట్‌ నిర్మాణాన్ని మరో పనిగా విభజించారు.

ఒక్కో పనికి రూ.10లక్షల చొప్పున రూ.30లక్షలు కేటాయించారు. స్థానిక ఎంపీటీసీ తనయుడు, గ్రామానికి చెందిన టీడీపీ నేత వాసు పర్యవేక్షణలో నిర్మాణాలు చేపట్టారు. మట్టి కట్టలను నాసిరకంగా నిర్మించారు. అనంతరం కురిసిన వర్షాలకు ఓ వైపున మట్టి కట్ట కొట్టుకుపోయింది. దీంతో చుక్క నీరు కూడా నిలవచేసుకునే అవకాశం లేకుండాపోయింది.

ఇక్కడ ఏటా ఇదే తంతు !
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వీఎన్‌ పురం సమీపంలో కల్వర్టు వద్దనున్న ఈ బలిజవాని గెడ్డలో రూ.9లక్షలతో నీరు–చెట్టు పనులు చేపట్టారు. యంత్రాలతో గెడ్డను చదును చేశారు కానీ పూడికతీత తీయలేదు. గెడ్డ గర్భంలో గడ్డిని తొలగించకుండా తూతూమంత్రంగా పనులు చేపట్టి నిధులు వెనకేసుకున్నారు.

దీంతో ఖరీఫ్‌లో శివారు భూములకు సాగునీరు ప్రశ్నార్ధకంగా మారింది. బలద పద్మనాభ సాగరంలో పూడికలు తొలగించేందుకు నీరు–చెట్టు పథకం కింద 2017–18లో రూ.54లక్షలు కేటాయించారు. చెరువు గర్భం నుంచి మట్టిని తొలగించి తరలించాలి. కానీ, మట్టిని గట్టుపైనే వేస్తున్నారు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి మళ్లీ చెరువులోకే చేరుతోంది. ఏటా ఇలా చేస్తూనే టీడీపీ తమ్ముళ్లు లక్షలాది ప్రజాధనం స్వాహా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

కూలీలు చేసిన పని చూపి లక్షలు నొక్కేశారు
ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని వీరేపల్లి చెరువులో 2015–16 ఆర్థిక సంవత్సరంలో మట్టి తవ్వకం పనులు చేపట్టారు. నీరు–చెట్టు పథకం కింద రూ.4.50లక్షలు ఖర్చు చేశారు. అయితే, అప్పటికే ఈ చెరువులో ఉపాధి హామీ కూలీలు మట్టి తవ్వేశారు. కూలీలు తవ్విన కుంటల చుట్టూ జేసీబీతో గాడి తవ్వి నీరు–చెట్టు కింద పనులు చేసినట్లు చూపించారు. దీనికి అధికారులు సహకారం అందించి గ్రామ టీడీపీ నాయకుడు నరేష్‌కు రూ.4.50లక్షల లబ్ది చేకూరేలా చేశారు.

మట్టి అమ్ముకోవడమే అభివృద్ధా!?
గుంటూరు జిల్లా యడ్లపాడు గ్రామ పరిధిలోని సీతమ్మ చెరువులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందిన వారు వివిధ రకాల పంటలను సాగుచేసుకుంటున్నారు. 2015–16లో నీరు–చెట్టు పథకం పేరుతో ఈ భూము ల్లో తవ్వకాలు చేపట్టారు. పేదలను తరిమేశారు. అరెకరం పొలం ఉన్న వారు కూడా భూములు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇదేనా అభివృద్ధి అంటే..!? – సయ్యద్‌ సుభాని, యడ్లపాడు, గుంటూరు జిల్లా చిలకలూరిపేట

అడ్డగోలుగా దోచుకుంటున్నారు
నీరు–చెట్టు పనుల్లో అడ్డగోలుగా మట్టి అమ్ముకుంటున్నారు. ఇటుక బట్టీలకు, లేఅవుట్లకు వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని అమ్ముకున్నారు. పనులపై కనీస పర్యవేక్షణ లేదు. ఇష్టారాజ్యంగా పనులు చేసి బిల్లులు స్వాహా చేస్తున్నారు. గతంలో పనులు చేసిన చెరువుల్లోనే మళ్లీ పనులు ప్రతిపాదించి బిల్లులు పొందుతున్నారు. – కూనిరెడ్డి వెంకట్రావు, పోతనాపల్లి, శృంగవరపుకోట మండలం, విజయనగరం జిల్లా  

గ్రామస్తుల అవసరాలు తీర్చకుండా అమ్మేసుకున్నారు
నీరు–చెట్టు పథకంలో భాగంగా గ్రామస్తుల అవసరాల మేరకు మట్టిని సరఫరా చేయాల్సి ఉంది. కానీ, ఇక్కడి టీడీపీ నాయకులు చెరువుల మట్టిని తెగనమ్ముకున్నారు. ఆయకట్టు రైతులకు గంపెడు మట్టిని కూడా ఇవ్వకుండా మొత్తం బయటకు తరలిస్తున్నారు. ప్రశ్నిస్తున్నానని పనుల ప్రారంభానికి కూడా నన్ను పిలవడంలేదు. – సాగిరాజు ఉదయకుమారి, సర్పంచ్, చెందుర్తి, గొల్లప్రోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా

పచ్చ చొక్కాలకు దోచి పెట్టేందుకే...
అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌ పిటికాయగుళ్ల వాగు లో డీసిల్టింగ్‌ పనులు చేశారు. నీరు–చెట్టు కింద లక్షలు ఖర్చుపెట్టినట్లు వాగుకు ఇరువైపులా గట్ల వెంబడి యంత్రా లతో తూతూమంత్రంగా పనులు చేశారు. నీరు నిల్వ ఉండే గుంతలను కూడా చదును చేయడంతో కనీసం పశువులు నీరు తాగేందుకు చుక్క నీరు ఉండని పరిస్థితి ఏర్పడింది. వాగులో చేసిన పనులు ఏమాత్రం ఉపయోగకరంగా లేవు. – మల్లెల శేఖర్‌రెడ్డి, పిటికాయగుళ్ల, గిద్దలూరు, ప్రకాశం జిల్లా

వారి జేబులు నింపడానికే..
నీరు–చెట్టు పనులు పూర్తిగా అవినీతిమయమయ్యాయి. అధికారులు పట్టించుకోవడంలేదు. టీడీపీ నేతలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మంజూరైన నిధులతో మొక్కుబడిగా పనులు చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారు. దీనిపై విచారణ చేపట్టాలి.     – చెన్నకేశవులు, సీపీఐ నేత,
పలమనేరు, చిత్తూరు జిల్లా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top