యూనిట్ల లెక్క తప్పింది

EBC quota will be implemented from next year in Medical Colleges - Sakshi

పీజీ వైద్యసీట్లను కాపాడుకునేందుకు సర్కారు తప్పుడు లెక్కలు 

ఈబీసీ కోటా సీట్లకు మొదలైన అడ్డంకులు 

అదనంగా పెరగాల్సిన సీట్లపై తీవ్ర ప్రభావం 

మెడికల్‌ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి ఈబీసీ కోటా అమలు 

కేంద్ర ప్రభుత్వం అదేశం 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ) మెడికల్‌ సీట్లు కాపాడుకునేందుకు ఇచ్చిన తప్పుడు లెక్కలు ఇప్పుడు కొంప ముంచుతున్నాయి. యూనిట్లు తక్కువగా ఉన్నప్పటికీ గతంలో ఎక్కువ ఉన్నట్లు చూపించి సీట్లను కాపాడుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ (ఎకనామికల్లీ వీకర్స్‌ సెక్షన్‌) కింద 10 శాతం కోటా కల్పించాలని నిర్ణయించింది. దీనికోసం పీజీ వైద్యసీట్లను అదనంగా 10 శాతం పెంచుతామని ప్రకటించింది. కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న పీజీ వైద్యసీట్లు, యూనిట్లు, అధ్యాపకులు, బెడ్‌లు ఇలా అన్ని వివరాలను తక్షణమే పంపించాలని ఆదేశించింది. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 10 శాతం ఈబీసీ కోటా అమలు చేయాలని, ఇందుకోసం ప్రస్తుతం ఉన్న సీట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 10 శాతం సీట్లు పెంచాలన్నది కేంద్రం ఆలోచన. కేంద్ర నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఉన్న సీట్లలో స్పెషాలిటీల వారీగా అదనంగా 3 సీట్లు వస్తాయి. ప్రతి స్పెషాలిటీలో ప్రతి కళాశాలలో సీట్లు పెరుగుతాయి. ఈ ఆలోచన బాగానే ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చిక్కుల్లో పడింది. ఒక పీజీ వైద్య సీటుపెరగాలంటే ఫ్యాకల్టీ నుంచి యూనిట్ల వరకూ లెక్కలుండాలి. ఇదివరకే రాష్ట్రంలో తక్కువ యూనిట్లున్నా ఎక్కువగా ఉన్నట్లు చూపించి పీజీ వైద్య సీట్లను నిలుపుకుంది. 
కొన్ని కాలేజీల్లో యూనిట్ల లెక్కలు  

ప్రభుత్వం నిధులిచ్చేనా? 
రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో 820 పీజీ సీట్లు అందుబాటులో ఉండగా, ఈబీసీ కోటా కింద 10 శాతం అదనంగా.. అంటే 82 పీజీ వైద్యసీట్లు పెరిగే అవకాశం ఉంది. కానీ, ఈ 82 సీట్లకు సంబంధించిన వసతులు కల్పించే అవకాశం ఉందా అనేదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే మౌలిక వసతులు, వైద్య పరికరాలకు అవసరమైన నిధులే ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈబీసీ కోటా సీట్లకు కావాల్సిన వసతులు ఏ మేరకు కల్పిస్తారోనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

యూనిట్లు ఎక్కడి నుంచి తేవాలి? 
వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్యసీట్లలో ఈబీసీ కోటా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ కోటా కోసం పెరగాల్సిన సీట్లు పెరిగే అవకాశం లేకపోవడంతో కష్టాలు తప్పవంటున్నారు. 10 శాతం అదనపు సీట్లకు యూనిట్లు ఎక్కడి నుంచి తేవాలి? యూనిట్లు కావాలంటే అదనపు సిబ్బంది కావాలి, నర్సులు పెరగాలి, పడకలు పెరగాలి, ఇవన్నీ చెయ్యాలంటే నిధులు కావాలి, ఏం చేద్దాం అంటూ వైద్య విద్యా శాఖ అధికారులు తల పట్టుకుంటున్నారు. ఉన్న సీట్లనే కాపాడుకోవడానికి లేని యూనిట్లను చూపిస్తున్నాం, మళ్లీ కొత్త సీట్లు కావాలంటే ఉన్నవి కూడా పోయే ప్రమాదం ఉంటుందేమో అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top