‘పసుపు–కుంకుమ’ తెచ్చిన తంటా

Dwcra Womens Suffering With Pasupu Kunkuma Cheques - Sakshi

అనంతపురం, ముదిగుబ్బ : ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘పసుపు – కుంకుమ’ పేరుతో ప్రవేశపెట్టిన పథకం అబాసుపాలవుతోంది. గత ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు..నాలుగున్నరేళ్లుగా హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఎన్నికల తాయిళంలో భాగంగా డ్వాక్రా సంఘాలకు ఒక్కొక్క సభ్యురాలికి రూ.10వేలు చొప్పున చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పిన చంద్రబాబు..ఆమొత్తాన్ని మూడు దఫాలుగా ఇచ్చేందుకు పన్నాగం పన్నారు. మొదటి విడతగా రూ.2500 ఫిబ్రవరి నెలలో, మిగతా రెండు నెలలు మార్చి, ఏప్రిల్‌ నెలలో ఎన్నికల సమయానికి ఇచ్చేలా సిద్ధమయ్యారు. కాగా మొదటి విడత చెక్కు మార్చుకునేందుకు మహిళలు నానాతంటాలు పడాల్సి వచ్చింది.  సంఘంలోని సభ్యులందరూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో రెండు, మూడు రోజులుగా ముదిగుబ్బ మండల కేంద్రంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆవరణ అంతా కిక్కిరిస్తోంది. సాయంత్రం వరకు మహిళలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. 

మండలంలో ఉన్న సంఘాలు – సభ్యులు
మండంలో మొత్తం 1,186 గ్రూపులు ఉండగా 12,120 మంది సభ్యులు ఉన్నారు. వీరికి‘పసుపు –కుంకుమ’ పేరిట రూ.12.11 కోట్లు మంజూరైంది. ఈనగదు మండలంలోని ఏడు బ్యాంకుల పరిధిలో సంఘాల సభ్యులకు పంపిణీ చేయాల్సి ఉంది.గొడవలు తెస్తున్న ‘పుసుపు– కుంకుమ’పసుపు–కుంకుమ చెక్కులతో డ్వాక్రా సంఘాల్లోని సభ్యుల మధ్య గొడవలవుతున్నాయి. కొందరు సభ్యులు సంఘాల్లో అధిక వడ్డీ చెల్లించలేక సంఘాల నుంచి తొలగిపోయారు. మరికొందరు  సభ్యుల్లో ఐక్యత లేకపోవడంతో మరో సంఘంలోకి మారిపోయారు. కొందరు ఆన్‌లైన్‌లో పాత గ్రూపులో సభ్యులుగా ఉన్నట్లు నమోదై ఉండడంతో ఆపేరుతోనే చెక్కులు వచ్చాయి. దీంతో పాతవారికి ఇవ్వాలని కొందరు.. కొత్త సభ్యులకే దక్కుతుందని మరికొందరు గ్రామాల్లో గొడవ పడుతున్నారు.

బ్యాంకుల చుట్టూ తిరగలేకపోతున్నాం
పుసుపు– కుంకుమ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు మార్చుకోవడానికి బ్యాంకుల చుట్టూ రోజూ తిరగాల్సి వస్తోంది. పొద్దున వస్తే సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నాం. బ్యాంకులో నగదు లేదని ఒకసారి, పదిమంది  సభ్యులు కలిసి రావాలని మరోసారి తిప్పుకుంటున్నారు.  ఇచ్చే రూ.2500 కోసం అవస్థలు పడాల్సి వస్తోంది.– నారాయణమ్మ, ఈదులపల్లిపెద్దమ్మస్వామి మహిళా సంఘం సభ్యురాలు

పావలా వడ్డీ ఎగ్గొట్టే ప్రయత్నం
మూడేళ్ల పాటు సకాలంలో బ్యాంకుల రుణాలు చెల్లించిన వారికి పావలా వడ్డీ గతంలో వచ్చేది. కానీ టీడీపీ ప్రభుత్వం పావలావడ్డీని ఎగ్గొట్టేందుకే పసుపు–కుంకుమ పేరుతో చెల్లని చెక్కులు పంపిణీ చేస్తోంది. ప్రభుత్వం మహిళలను అష్టకష్టాలు పెడుతోంది.  – పద్మావతి, నాగారెడ్డిపల్లి,గణేష్‌ మహిళా సంఘం సభ్యురాలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top