
బాబు సభలో పురుగులమందు తాగిన రైతు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బహిరంగ సభలో మాట్లాడుతుండగానే ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బహిరంగ సభలో మాట్లాడుతుండగానే ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సీపురం గ్రామంలో జరిగింది. వివరాలు.. సీఎం చంద్రబాబు జిల్లాలోని నర్సీపురం గ్రామంలో 'నీరు-చెట్టు' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు.
అదే సమయంలో పురుగుల మందుతో అక్కడకి వచ్చిన సీతాఫల్ మండలంలోని చిన్నభోగిలి గ్రామానికి చెందిన రాము అనే రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ మండలంలోని వీఆర్వో వేధింపులే కారణాలని తెలిశాయి. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న బహిరంగ సభలో సమయానికి 108 కూడా అందుబాటులో లేకపోవడంతో రామును ఆటోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(పార్వతీపురం)