అరె.. ఏ మైంది..!

Doctors Negligence On A Vitamin and Immune vaccines - Sakshi

ఇప్పటికీ రాని ఏ విటమిన్‌

నాలుగునెలల నుంచి ఇదే దుస్థితి

అదిగోఇదిగో అంటూ వైద్యాధికారుల కాలయాపన

తణుకు అర్బన్‌: చిన్నారులను కంటి రుగ్మతల నుంచి దూరం చేసే ఔషధం ఏ విటమిన్‌. పదినెలల నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు 9 డోసులుగా దీనిని అందించాలి. అయితే దీని సరఫరాలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. నాలుగునెలల నుంచి ఇదే దుస్థితి నెలకొంది. ఫలితంగా చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  ప్రస్తుతం జిల్లాలోని సర్కారు ఆస్పత్రుల్లో ఏ విటమిన్‌ ద్రవం అందుబాటులో లేదు. దీంతో దానిని పిల్లలకు వేయించేందుకు వెళ్లిన వారిని వైద్యసిబ్బంది తిప్పిపంపిస్తున్నారు. దీంతో ప్రజల వద్దకే వైద్యసేవలు, చిన్నారులకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం ఏ విటమిన్‌ సరఫరాలో నిర్లక్ష్యం వహించడంపై తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  

నవంబర్‌లో వెనక్కి!
ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలతోపాటు అంగన్‌వాడీ సెంటర్లలో చిన్నారులకు  ఏ విటమిన్‌ ద్రవాన్ని అందుబాటులో ఉంచాలి. పిల్లలకు 10వ నెల వయసు నుంచి 5 సంవత్సరాల్లోపు 9 డోసులుగా ఈ ద్రవాన్ని పట్టించాలి.. అయితే జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లో ఎ–విటమిన్‌ ద్రవం నాలుగు నెలలుగా అందుబాటులో లేదు. జిల్లాలో ఏ విటమిన్‌ ద్రవం వంద మిల్లీలీటర్ల బాటిళ్లు నెలకు 120 వరకూ అవసరం ఉంటాయి. గతేడాది నవంబరులో జిల్లాకు ఏ–విటమిన్‌ ద్రవం సరఫరా అయింది. అయితే అది చిక్కగా ఉండడంతోపాటు నాణ్యత లేనిదిగా గుర్తించి తిప్పిపంపినట్టు  వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ ద్రవం రాష్ట్రానికి పూణే నుంచి రావాలని పేర్కొంటున్నారు.  

మొక్కుబడిగా పలకరింపు
చిన్నారుల కంటిచూపునకు ఊతమిచ్చే ఎ–విటమిన్‌ ద్రవం లేకుండా వ్యాధినిరోధక టీకాలు వేయించాలంటూ నిర్వహిస్తున్న  పలకరింపు కార్యక్రమం నవ్వులపాలవుతోంది. జిల్లా వ్యాప్తంగా 4లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలు ఉన్నారు. వీరి ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా పలకరింపు కార్యక్రమం జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్యులు, సిబ్బంది 3,600 బృందా లుగా విడిపోయి ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను పలకరిస్తున్నారు. అయితే  తల్లిదండ్రులు పలకరింపు కార్యక్రమంలో ఏ విటమిన్‌ గురించి ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఉండే క్లస్టర్‌ విధానం ద్వారా ఎప్పటికప్పుడు వ్యాధి నిరోధక టీకాలతోపాటు మాతా, శిశు సంరక్షణపై వైద్యాధికారుల పర్యవేక్షణ ఉండేది. ప్రతి క్లస్టర్‌కు 6 పీహెచ్‌సీలను అనుసంధానం చేసి ఒక సీనియర్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్‌ పర్యవేక్షించేవారు.  ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తరువాత క్లస్టర్‌ విధానాన్ని రద్దుచేసింది. దీంతో వైద్యసేవలపై పర్యవేక్షణ తగ్గింది. 

త్వరలో వస్తుంది
ఏ విటమిన్‌ ద్రవం రావాల్సి ఉంది. గత నవంబరులో వచ్చిన ద్రవం నాణ్యత లేదని తిప్పి పంపించాం. త్వరలోనే కొత్త స్టాకు వస్తుంది.  పలకరింపు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. టీకాలపై అవగాహన కల్పిస్తున్నాం. – పి. మోహన కృష్ణ, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి, ఏలూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top