రాష్ట్ర విభజన మీ సొంత వ్యవహారమా? | Do you think State bifurcaton your own affair, Venkaiah Naidu questions Congress | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజన మీ సొంత వ్యవహారమా?

Aug 10 2013 3:56 AM | Updated on Mar 29 2019 9:18 PM

రాష్ట్ర విభజన మీ సొంత వ్యవహారమా? - Sakshi

రాష్ట్ర విభజన మీ సొంత వ్యవహారమా?

రాష్ట్ర విభజనను కాంగ్రెస్ పార్టీ తన సొంత వ్యవహారంగా చూస్తోందని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు ధ్వజమెత్తారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను కాంగ్రెస్ పార్టీ తన సొంత వ్యవహారంగా చూస్తోందని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర అయినా, ప్రత్యేక తెలంగాణ అయినా తామే చేస్తాం, తామే సభను స్తంభింపజేస్తామన్నట్టుగా కాంగ్రెస్ తీరు ఉందని మండిపడ్డారు. ప్రజల్ని రెచ్చగొట్టి రెండు ప్రాంతాల్లోనూ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది కాంగ్రెస్ వ్యూహమని పేర్కొన్నారు. 
 
 ఈనెల 11న హైదరాబాద్‌లో జరిగే మోడీ సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన వెంకయ్య.. పలువురు పార్టీ నేతలతో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వివాదాస్పద అంశాలను తేల్చిన తర్వాతే విభజనకు పూనుకోవాలంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘మాట తప్పడం, రెచ్చగొట్టడం కాంగ్రెస్‌కు అలవాటే. సీఎం వ్యాఖ్యలపై మేమేమీ ఆశ్చర్యపోవడంలేదు. కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఒక మాట, రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు మరో మాట చెబుతున్నారు. ఎవరు మోసం చేస్తున్నారో, ఎవరు నిజం చెబుతున్నారో తెలియదు. వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ చేయాల్సిన పనేనా ఇది? మీదొక పార్టీయా? మీకొక విధానమా? లేనిపోని హామీలు ఇచ్చి ఎవర్ని మోసగిస్తారు? సీమాంధ్రలో ఉద్యమంపై నోరెందుకు మెదపరు? ఉభయుల్ని సముదాయించాల్సిన పని లేదా? ఇదేమన్నా మీ పార్టీ సొంత వ్యవహారమా? సమస్య తలెత్తిన తర్వాత ఆంటోనీ కమిటీ వేశారు. ముందే ఎందుకు మాట్లాడలేదు? సీఎం, మంత్రులు ఎవరికి వారు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారు’’ అని దుయ్యబట్టారు.
 
 సోనియా నాటకంలో భాగమే కిరణ్ వ్యాఖ్యలు
 కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆడిస్తున్న నాటకంలో భాగమే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అధిష్టానం మాటకు కట్టుబడడమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్‌రెడ్డి, కొంపల్లికి చెందిన ఆదిరెడ్డి, కుమార్‌గౌడ్ తదితరులు బీజేపీలో చేరిన సందర్భంగా జరిగిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. పూర్తి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సీహెచ్ విద్యాసాగరరావు, బండారు దత్తాత్రేయ, ఎన్.రామచంద్రరావు, డాక్టర్ కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement