టిడిపి ప్రభుత్వం పనితీరుపట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోందని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
సాలూరు: టిడిపి ప్రభుత్వం పనితీరుపట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోందని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాము చేపట్టిన గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోందన్నారు.
ఇప్పటి వరకు సాలూరు పట్టణ పరిధిలోనున్న 1,2,3,4,5,8వార్డుల్లో పర్యటించామని చెప్పారు. ఏ ఇంటికి వెళ్లినా ప్రజాదరణ బాగుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా అని ప్రశ్నిస్తే అందరూ లేదనే బదులిస్తున్నారన్నారు. ప్రధానంగా వితంతువులు చాలామంది పింఛన్ మంజూరుకాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. వికలాంగులది సైతం అదే పరిస్థితి అన్నారు.
పేదలకు న్యాయం చేయూలి
తాను ఇప్పటికే పలుమార్లు పేదలకు న్యాయం చేయాలని శాసనసభలో ప్రభుత్వాన్ని కోరానని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో గృహనిర్మాణ పథకంలో అక్రమాలు జరిగాయని బావిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అంతేతప్ప అర్హులకు అన్యాయం చేయకూడదని డిమాండ్ చేశానన్నారు. చాలామంది తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులు ఐరిష్ పడడంలేదని, తమకు బియ్యం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇవేవీ ప్రభుత్వానికి తెలియనివి కాకపోయినా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. ఏఇంటికి వెళ్లినా ఇదే తీరున స్పందన వస్తోందని చెప్పారు.