డయల్‌ 100 112

Dial 100 And Dial 112 Comes To Rescue Of Woman Stuck - Sakshi

రెండు నంబర్లకూ ఒకే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

సాంకేతికంగా మరింత అభివృద్ధి చేసే ప్రయత్నాలు

ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సాయం అందించడానికి వీలుగా ఏర్పాట్లు

రాష్ట్ర ప్రభుత్వ చొరవతో పోలీస్‌ శాఖ కసరత్తు

సాక్షి, అమరావతి: ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే రక్షించడానికి ఏర్పాటు చేసిన డయల్‌ 100, డయల్‌ 112 టోల్‌ ఫ్రీ నంబర్లను ఒకే గొడుగు కిందకు తేవాలని పోలీస్‌ శాఖ నిర్ణయించింది. ఈ రెండు నంబర్లకు ఇప్పటివరకు వేర్వేరుగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు ఉన్నాయి. ఆపదలో ఉన్న మహిళలు ఈ రెండు నంబర్లకు ఒకేసారి ఫోన్‌ చేస్తే.. రెండు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ల పరిధిలో ఉన్న పోలీసులు అప్రమత్తమై రక్షిస్తున్నారు. అయితే.. వేర్వేరుగా ఉండటం వల్ల రెండు సెంటర్ల మధ్య సమన్వయలోపం తలెత్తుతోంది. అలా కాకుండా ఈ రెండు టోల్‌ ఫ్రీ నంబర్లకు కలిపి ఒకే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఉంటే సమయం కలిసి రావడంతోపాటు సమన్వయలోపాన్ని నివారించవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం చొరవతో పోలీస్‌ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఈ విషయంపై మూడు రోజుల కిందట మంగళగిరిలో అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 100, 112కు ఎవరు ఫోన్‌ చేసినా ఒకే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు వచ్చేలా చేయడంతోపాటు అందుకు అనుగుణమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించాలని ఆదేశించారు. కాగా, దిశ ఘటన జరిగాక ఈ రెండు నంబర్లకు ఫోన్‌ కాల్స్‌ బాగా పెరిగాయి.

డయల్‌ 100
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డయల్‌ 100కు నేరుగా ఫోన్‌ (వాయిస్‌ కాల్‌) చేసి సమస్యను వివరించాల్సి ఉంటుంది. ఈ నెంబర్‌కు రోజుకు 18 వేల నుంచి 20 వేల కాల్స్‌ వస్తున్నాయి. వీటిని స్వీకరించే కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బంది ఆయా జిల్లాల ఎస్పీలకు సమాచారం అందిస్తారు. బాధితులకు తక్షణ సాయం అందించేలా చర్యలు చేపడతారు.

డయల్‌ 112
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో దేశమంతా నిర్వహిస్తున్న డయల్‌ 112కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు మహిళలు ఉన్న చోటు, ఫోన్‌ నెంబర్, చిరునామా అన్నీ నమోదవుతాయి. ఈ వివరాల ఆధారంగా కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బంది తిరిగి ఫోన్‌ చేసి సమస్య అడిగి సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేస్తారు. దీనికి రోజూ 3.50 లక్షల కాల్స్‌ వస్తున్నాయి. రాష్ట్రంలో శనివారం నాటికి 56,142 మంది ‘డయల్‌ 112 ఇండియా’ మొబైల్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. వీరిలో 32 వేల మంది మహిళలే ఉండటం విశేషం. ఫోన్‌లో నేరుగా 112కు సందేశం పంపడంతోపాటు యాప్‌ ద్వారా కూడా డయల్‌ చేయొచ్చు.

ఈ రెండూ కలిపి..
ప్రస్తుతం వాయిస్, మిస్డ్‌ కాల్‌తోపాటు ఐడియా నెట్‌వర్క్‌ నుంచి మాత్రమే మెసేజ్‌ వెళ్లే వెసులుబాటు ఉంది. రానున్న రోజుల్లో ఆపదలో ఉన్నవారు అన్ని మొబైల్‌ నెట్‌వర్క్‌ల నుంచి మెసేజ్‌ ఇచ్చే అవకాశం కల్పించనున్నారు. అలాగే మిస్డ్‌కాల్‌ ఇస్తే చాలు ఆటోమేటిగ్గా జీపీఆర్‌ఎస్‌ అనుసంధానంతో ట్రాకింగ్‌ చేసేందుకు వీలుగా వారిని త్వరగా చేరుకునే ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా టోల్‌ ఫ్రీ నంబర్లకు వచ్చే ఫోన్‌ నుంచి మొబైల్‌ వీడియో ఆప్షన్‌ ఆన్‌ అయ్యి సుమారు 10 సెకండ్ల వీడియో చిత్రీకరణ జరిగేలా కూడా సాంకేతికంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల బాధితులకు తక్షణ సాయం అందించడంతోపాటు నేర స్థలంలో సాక్ష్యాలు, నేరస్తులను గుర్తుపట్టేందుకు వీలుంటుందని పోలీస్‌ శాఖ భావిస్తోంది.

అన్ని సేవలకు ఒకే నంబర్‌ – డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌
డయల్‌ 100, డయల్‌ 112 టోల్‌ ఫ్రీ నంబర్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జీపీఎస్‌ సిస్టమ్‌ అమర్చిన 1500 పోలీస్‌ వాహనాలు బాధితులకు తక్షణ సాయం అందిస్తున్నాయి. రెండు టోల్‌ ఫ్రీ నంబర్లను ఒకే గొడుగు కిందకు తెస్తే మరింత బాగా సేవలు అందించవచ్చని గుర్తించాం. 100, 112లలో దేనికి ఫోన్‌ చేసినా ఒకే చోటకు కాల్‌ వచ్చేలా చేయడంతోపాటు వాటిని సాంకేతికంగా మరింత అభివృద్ది చేస్తాం. రానున్న రోజుల్లో అన్ని సేవలకు ఒకే నంబర్‌ ఉండేలా దశలవారీగా చర్యలు తీసుకుంటాం.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top