అసంతృప్తి..అసహనం!

Devotees Suffered in Temple With Police Behave - Sakshi

రథసప్తమి దర్శనాల్లో భక్తుల అగచాట్లు

పోలీసుల హడావుడిపై వెల్లువెత్తిన విమర్శలు

తమవారిని అత్యధికంగా దర్శనాలకు పంపిన పోలీసు శాఖ

పట్టించుకోని దేవదాయ శాఖ అధికారులు

ఆలయ ఆదాయానికి గండి!

శ్రీకాకుళం, అరసవల్లి:  ప్రశాంతంగా.. భక్తిభావంతో అందరికీ సూర్యనారాయణస్వామి దర్శనభాగ్యం కల్పించాల్సిన పలు ప్రభుత్వశాఖల అధికారులు.. తమ కుటుంబ, సన్నిహితుల దర్శనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేలా వ్యవహరించారు. దీంతో వివిధ దర్శన మార్గాల్లో ఉన్న భక్తుల్లో తీవ్ర అసంతృప్తి...అసహనం కనిపించింది. ‘‘ఆదిత్యా..ఆరోగ్యాన్ని ప్రసాదించు..స్వామీ..’’ అంటూ వేడుకునేందుకు రథసప్తమి సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణస్వామి వారి ఆలయానికి వచ్చిన వేలాది మంది భక్తులు కొన్ని శాఖల సిబ్బంది వ్యవహరించిన తీరుతో ఇబ్బందులు పడ్డారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరూ వీవీఐపీలేనా? ఆలయ అధికారులు ఏం చేస్తున్నారంటూ క్యూలైన్ల నుంచి గొంతెత్తారు. అయినా ఫలితమేమీ లేదు..వారివారి కుటుంబీలకు దర్శనాలు చేయించినంతవరకు నిద్రపోం..అన్నట్లుగా కొందరు పోలీసు అ«ధికారులు వ్యవహరించడం కన్పించింది. ఏటా రథసప్తమి ఏర్పాట్ల ముందస్తు సమావేశాల వరకు అంతా దేవాదాయ శాఖాధికారులదే హడావుడిలా కన్పించినా..ఉత్సవం ముందు రోజు నుంచే సీన్‌ అంతా మారిపోతుంది. ఆలయ పరిసరాలన్నీ పోలీసుల పరమవుతాయి.

శాంతి భద్రతల విషయంలో కంటే కేవలం వారివారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను దర్శనాలకు పంపించడమే పనిగా పెట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లుతెత్తుతున్నాయి. దర్శన మార్గాల్లో ఆలయ, బ్యాంకు సిబ్బంది విధుల్లో ఉంటే, పరిస్థితులు అదుపు తప్పిపోకుండా పోలీసులు బా«ధ్యత తీసుకోవాల్సి ఉంది. అయితే ఇక్కడ సీన్‌ రివర్స్‌. ఈ విధానంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నప్పటికీ.. ఈ శాఖలో కొందరి అధికారుల తీరులో ఏమాత్రం మార్పు కన్పించలేదు. సోమవారం అర్ధరాత్రి తరువాత అరసవల్లిలో సూర్యజయంతి (రథసప్తమి) ఉత్సవం ప్రారంభమైనప్పటి నుంచి మంగళవారం సాయంత్రం వరకు భక్తులకు సవ్యమైన దర్శనం దొరక్కపోగా, పోలీసుల కుటుంబీకులతో పాటు మరో రెండు కీలక ప్రభుత్వ శాఖాధికారుల కుటుంబీకులు వీవీఐపీలుగా దర్జాగా దర్శనాలకు వస్తుంటే..ముక్కున వేలేసుకుంటూ దేవాదాయ శాఖాధికారులు ఉత్సవ విగ్రహాల్లా మిన్నకుండిపోవాల్సి వచ్చింది. ఏళ్లు గడుస్తున్నా..ఈ పోలీసు శాఖ తీరులో ఏమాత్రం మార్పు రాలేదని భక్తులు మండిపడుతున్నారు. ఇలా సిఫారసులున్న వారిని నేరుగా పంపించినప్పటికీ, వారి నుంచి కనీసం రూ.100 అయినా టిక్కెట్లుగా వసూళ్లు చేస్తే, ఆలయానికి ఆదాయం వచ్చేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

వీరే వీవీఐపీలు...
రథసప్తమి సందర్భంగా సింహద్వారం నుంచి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతరత్రా కీలక నేతలు, రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు వీవీఐపీలుగా దర్శనాలు చేసేందుకు అవకాశం కల్పించారు. అలాగే ఈ మార్గం పక్కనే దాతల పాసుల ఉన్న వారికి కూడా వీవీఐపీ ట్రీట్‌మెంట్‌ జరిగేలా ఏర్పాట్లు చేశారు. తీరా చూస్తే..ఈ ఏడాది సప్తమికి సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు అ«సలైన వీవీఐపీలు కేవలం ఐదారుగురు మాత్రమే రాగా... నకిలీ వీవీఐపీలు మాత్రం ఐదు వేల మంది వరకు వచ్చినట్లు సమాచారం. రెవెన్యూ, న్యాయశాఖల కంటే అత్యధికంగా పోలీసు అధికారులకు చెందిన వారే వీవీఐపీలకు కేటాయించిన మార్గంలో స్వామివారి దర్శనాలకు వెళ్లడం కన్పించింది. సింహద్వారం వద్ద పోలీసుల సిఫారసు భక్తులతో కిటకిటలాడింది. దీనికి తోడు సింహద్వారం వరకు పోలీసు ప్రత్యేక వాహనాలు, ద్విచక్రవాహనాలకు మాత్రం అనుమతించారు. దీంతో వాళ్ల కుటుంబ సభ్యులు ఎంచక్కా ఈ వాహనాల్లోనే ద్వారం వరకు వచ్చేశారు. అలాగే అంతరాలయంలో దర్శనాల వరకు ఒకరికొకరు బాధ్యతలను పంచుకుంటూ ఉత్సవంలో తమ కీలక పాత్ర ఏంటో భక్తులకు చెప్పకనే చెప్పారు. సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు ఆఖరికి భక్తుల సేవలో ఉండాల్సిన ఎన్‌సీసీ క్యాడెట్లు కూడా వాళ్ల కుటుంబీకులను దర్జాగా వీవీఐపీ, దాతల పాసుల మార్గాల్లో దర్శనాలకు పంపించారు. ఈ తంతుకు ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలే ప్రధాన సాక్ష్యాలుగా ఉన్నాయి.

అంతరాలయంలోనూ ఇదే తంతు!
ఆలయం బయట పరిస్థితి ఇలా ఉంటే..అంతరాలయంలో కూడా భక్తులు ఈ ఏడాది కూడా పలు పాట్లు పడ్డారు. ముఖ్యంగా దాతల పాసులతో వచ్చిన భక్తుల పరిస్థితి దారుణంగా మారింది. ఆలయ అభివృద్ధికి ఆర్థిక సాయం చేసిన దాతలు, తమ కుటుంబసభ్యులు, సన్నిహితులకు ఈ పాసుల ద్వారా దర్శనాలకు పంపించారు. అయితే ఈ దాతల పాసుదారులను వీవీఐపీలుగానే గుర్తించి దర్శనాలు చేయిస్తామని అటు ఆలయ అధికారులు, ఇటు పోలీసులు ప్రకటనలు గుప్పించారు. అయితే వాస్తవానికి మాత్రం వాళ్లు సాధారణ దర్శనాలకు వెళ్లే భక్తుల కంటే దారుణంగా పాట్లు పడ్డారు. అంతరాలయంలో క్యూలైన్లన్నీ ఒకే దగ్గర మెర్జింగ్‌ అవ్వడంతో ఎవరు దాతో..ఎవరు సిఫారసు దారుడో తెలియని పరిస్థితి అయ్యింది. మంగళవారం పలువురు దాతలకు ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. అలాగే అంతరాలయంలో అన్ని దార్లు దగ్గరగా ఉండడంతో పలు రకాల ఇబ్బందులు తలెత్తాయి. దీనికి తోడు పలువురు భక్తులు, అంతరాలయ దర్శనాలకు అర్చకులపై ఒత్తిడి పెంచారు. దీంతో నాన్‌ వీవీఐపీలు కూడా అంతరాలయంలోకి వెళ్లిన పరిస్థితులు నెలకున్నాయి. అలాగే ధ్వజస్తంభ మండపం వద్ద కూడా దాతలు, రూ.100 దర్శనాల లైన్లు కలిసిపోవడంతో ఒక్కసారిగా స్టీల్‌ క్యూలైన్‌ పూర్తిగా ఒరిగిపోయింది. అయితే వెంటనే ఈవో పుష్పనాథం తగు చర్యలు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది.

ఆలయ ఆదాయానికి పెద్ద గండి
రథసప్తమి ఉత్సవం వచ్చిందంటే లక్షలాది రూపాయల ఖర్చుతో భారీ ఏర్పాట్లు చేస్తుంటారు. అలాగే ఇదే ఉత్సవం సందర్భంగా దర్శనాల టిక్కెట్లతో పాటు హుండీ ఆదాయం కూడా భారీగా పెరుగుతోందని ఆలయ అధికారులు అంచనాలు వేస్తుంటారు. అయితే రథసప్తమి నాడు పరిస్థితులు చూస్తే ఆలయ ఆదాయానికి పెద్ద గండి పడినట్లు స్పష్టమవుతోంది. అందరూ వీవీఐపీల మార్గాల ద్వారా వచ్చేయడంతో దర్శనాల టిక్కెట్ల ఆదాయం పోయినట్‌లైంది. అలాగే అంతరాలయంలో సేవకులు అధికంగా విధుల్లో ఉండడంతో భక్తులకు హుండీల్లో మొక్కులు వేసేందుకు ఇబ్బందులు తలెత్తినట్టు తెలిసింది. అలాగే ఇక్కడే అన్ని దారులు కలిసిపోవడం.. భక్తుల రద్దీ కారణంగా హుండీల ఆదాయం దెబ్బతినే అవకాశముంది.

కేశఖండన శాలలో..
 కేశఖండన శాలలో పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. ఇంతవరకు కేశఖండన కోసం తీసుకునే టిక్కెట్లలో సగభాగం ఆలయానికి వచ్చేది. అయితే ఇటీవల ప్రభుత్వ నిర్ణయంతో టిక్కెట్టు ధర రూ.25 మొత్తంగా క్షురకులకే ఇచ్చేస్తుండడంతో ఆలయానికి పూర్తిగా ఒక్క రూపాయి కూడా రాకుండా పోయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top