బండి.. జోరు తగ్గిందండి! 

Decline in sales of cars and bikes nationwide - Sakshi

దేశవ్యాప్తంగా కార్లు, బైకుల విక్రయాల్లో క్షీణత

పండుగల సీజన్‌లోనూ మందకొడిగా విక్రయాలు

రాష్ట్రంలో కొంత మెరుగే అయినా తగ్గిన రాబడి

‘వాహనమిత్ర’తో పెరిగిన ఆటోల కొనుగోళ్లు

సాక్షి, అమరావతి: ఆర్థిక మందగమనంతో దేశవ్యాప్తంగా వాహనాల విక్రయాలు భారీగా పడిపోయినా రాష్ట్రంలో కాస్త మెరుగ్గా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం మీద వాహనాల విక్రయాలు తగ్గడంతో ఆ ప్రభావం రవాణా రంగం రాబడిపై పడింది. తొలి అర్థ సంవత్సరం అంటే ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు రవాణా రంగం ఆదాయం భారీగా తగ్గింది. తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ – జూన్‌)లో సమకూరిన రాబడి గత ఏడాదితో పోల్చి చూస్తే 11.81 శాతం మేర  తగ్గింది. రెండో త్రైమాసికం (జూలై – సెప్టెంబర్‌)లో రాబడి గత ఏడాదితో పోలిస్తే 12.42 శాతం తగ్గింది. అక్టోబర్‌లో కొంత పుంజుకున్నా గత ఏడాదితో పోల్చి చూస్తే మాత్రం 6.83 శాతం తగ్గింది.  

‘వాహనమిత్ర’తో జోరుగా ఆటోల విక్రయాలు!
ఆర్థిక మాంద్యంలోనూ రాష్ట్రంలో ఆటోల విక్రయాలు పెరగడం గమనార్హం. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు విక్రయాలను పోల్చి చూస్తే ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు రాష్ట్రంలో ఆటోల అమ్మకాలు 19.32 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఆటోల అమ్మకాలు 6.37 శాతం మేర తగ్గాయి. సొంతంగా ఆటో నడుపుకొనే వారికి ఏటా రూ.పది వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకం ద్వారా ఆర్థ్ధిక సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. స్వయం ఉపాధి కోసం రాష్ట్రంలో పేద, దిగువ మధ్య తరగతి వారు ఎక్కువ మంది ఆటోలను కొనుగోలు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఆర్థిక మందగమనమే కారణం
గత ఆరేడు నెలలుగా ద్విచక్ర వాహనాల విక్రయాలు బాగా తగ్గాయి. దీనికి ప్రధాన కారణం ఆర్థిక మంద గమనమే. దేశవ్యాప్తంగా పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఈసారి అక్టోబర్‌లో పండగ సీజన్‌లో కూడా కార్ల అమ్మకాలు పెరగలేదు. డిసెంబర్‌లో కూడా పరిస్థితి ఇలాగే ఉండవచ్చని భావిస్తున్నాం. ఇక ఆశలన్నీ కొత్త ఏడాదిపైనే. ఆటోల విక్రయాలు ప్రతి మూడు నాలుగేళ్లకు ఒక వలయం మాదిరిగా ఉంటాయి. మావద్ద బజాజ్‌ ఆటోల విక్రయాలు వంద శాతం పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తుండటం కూడా విక్రయాలు పెరగడానికి కారణం. డౌన్‌ పేమెంట్‌ కింద రూ.25 వేలు చెల్లించాల్సి ఉండగా వాహన మిత్ర ద్వారా ప్రభుత్వం రూ.10 వేలు చొప్పున సాయం అందిస్తుండటంతో స్వయం ఉపాధి కోసం ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు          
          – సత్యనారాయణ  (డైరెక్టర్, వరుణ్‌ మోటార్స్‌) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top