డేంజర్‌ జర్నీ..!

Damage Highway Roads in Prakasam - Sakshi

గుంతలమయంగా ప్రధాన రహదారులు

నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్న వైనం

పట్టించుకోని పాలకులు, అధికారులు

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, ప్రజలు

ప్రకాశం, కారంచేడు: గ్రామీణ ప్రాంత రహదారులను  సుందరంగా తీర్చిదిద్దుతున్నామని గొప్పలు చెప్పుకొనే పాలకులు, అధికారులు క్షేత్ర స్థాయిలో మాత్రం రహదారుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రధాన రహదారులనే పట్టించుకోని వారికి ఇక గ్రామీణ రహదారులు ఏమి కనిపిస్తాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అడుగుకో గుంతతో ప్రజలు, ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. నిత్యం వందుల సంఖ్యలో ఆటోలు, ద్విచక్రవాహనదారులతో పాటు బస్సులు, లోడు లారీలు ఈ రహదారుల్లో ప్రయాణించే క్రమంలో అనేక ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇక రాత్రి సమయంలో గోతులతో ప్రయాణికులు నరకయాతన పడాల్సిందే. ద్విచక్రవాహనదారులతో పాటు, రైతులు చుక్కలు చూడాల్సిందే.

ప్రధాన రహదారి ఇలా..
వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారి. ఈ రహదారిలో నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రహదారిలో కారంచేడు–చీరాల మధ్య ఉన్న 8 కిలోమీటర్లు గుంతల మయంగా మారింది. చిన్నచప్టాలు, పెదచప్టాలు, చర్చి సెంటర్, బాంబుల గోదాముల ప్రాంతాల్లో ఇక నరకం చూడాల్సిందేనని ప్రయాణికులు వాపోతున్నారు. గత మూడు సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ రహదారిలో ఇప్పటి వరకు కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదని వాహనదారులు చెబుతున్నారు.

గ్రామీణ రహదారులు ఇంతేనా..?
మండలంలోని జరుబులవారిపాలెం–నాయుడువారిపాలెం గ్రామాల మధ్య రహదారి సుమారు 2 కిలోమీటర్లు ఉంటుంది. దీనిలో 80 శాతం వరకు రహదారి గుంతలతో నిండిపోయింది. మండల కేంద్రమైన కారంచేడుతో పాటు సమీప పట్టణమైన చీరాలకు వెళ్లాలంటే పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఈ రహదారిలోనే ప్రయాణిస్తుంటారు. దీనికి తోడు పై గ్రామాలకు చెందిన రైతులు కూడా పోలాలకు వెళ్లేందుకు ఎరువులు, విత్తనాలు తీసుకువెళ్లడానికి, తమ పొలాల్లో పండించిన పంటలను ఇళ్లకు చేరవేసుకోవడానికి ఈ రహదారిలోనే ప్రయాణిస్తుంటారు. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే ఈ రోడ్డులో గుంతలు ప్రయాణికులకు చెమటలు పట్టిస్తున్నాయి. ద్విచక్రవాహనదారులు పలు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే మండలంలోని స్వర్ణ–స్వర్ణపాలెం రహదారి కూడా బద్దలై ద్విచక్రవాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. రహదారులు మధ్యకు బద్దలవడం వలన వాహనాల టైర్లు గాడుల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రహదారికి ఇరువైపులా పంట కాలువలు ఉండటం, రోడ్డు కొత్తగా ఏర్పాటు చేయడం వలన ఇలాంటి పరిస్థితి వచ్చిందని ప్రయాణికులు చెబుతున్నారు.

ప్రమాదాలకు నిలయంగా..
ఆదిపూడి–తిమిడెదపాడు రహదారి మోకాలి లోతు గోతులతో ఇబ్బందికరంగా మారింది. ఈ రోడ్డులో నిత్యం విద్యార్థులు, ప్రయాణికులు, రైతులు ప్రయాణిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులు గుంతలతో ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి రహదారులను మరమ్మతులు చేయించి ప్రయాణాలకు అనువుగా చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

చాలా ఇబ్బందులు పడుతున్నాం,
ఆదిపూడి నుంచి తిమిడెదపాడు వెళ్లాలంటే వాహనదారులకు నరకం కనిపిస్తుంది. రోడ్డులో ఎక్కువ భాగం గుంతలమయంగా మారింది. దీనికి తోడు రోడ్డుకు ఇరువైపులా దట్టంగా పెరిగి ఉండే చిల్లచెట్లతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా మారుతోంది.వై. సీతారామిరెడ్డి, ఆదిపూడి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top