పాలు పితికితే రక్తమొస్తోంది!

Cows Suffering With Rare Disease in Visakhapatnam - Sakshi

‘కార్పొరేషన్ల’ లబ్ధిదారుల ఆవేదన

నాసిరకం పశువులు పంపిణీ చేస్తున్నారని విమర్శ

కొనుగోళ్లలో లొసుగులు పాలుపోని స్థితిలో రైతులు

విశాఖ , నర్సీపట్నం: ముందు చూపు లేకుండా వ్యవహరిస్తే నిధులు వృథా కాక తప్పదనడానికి ప్రభుత్వం చేపట్టిన పాడి పశువుల పంపిణీయే ఓ ఉదాహరణ. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్‌కు పాడి రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి రుణాలు మంజూరు చేయాలంటే తప్పనిసరిగా పాడి పశువును లబ్ధిదారులు కొనుగోలు చేసి చూపిస్తే బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. ఈ కారణంగా పాడి రైతులు ఆసక్తి చూపకపోవడంతో కార్పొరేషన్‌ నిధులు మురుగుపోతున్నాయి. వీటి కొనుగోలు బాధ్యతను ప్రభుత్వం పశుసంవర్థకశాఖ అధికారులకు అప్పగించింది. ఈ మేరకు వారు పంజాబ్, హర్యానా, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక నుంచి పాడి పశువులను ఇబ్బడిముబ్బడిగా కొనుగోలు చేసి తీసుకువచ్చారు. వీటిలో మేలురకానికి బదులు నాసిరకం పశువులు ఎక్కువగా ఉన్నాయి.

కొనుగోళ్లలో అక్రమాలు
జిల్లాలో 2,200 పాడి పశువులు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 12 వేల పశువులు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో లొసుగులు చోటుచేసుకున్నాయి. అధిక సంఖ్యలో కొనుగోలు చేయాల్సి ఉండటంతో పొరుగు రాష్ట్రాల్లో గేదెలు, ఆవులకు డిమాండ్‌ పెరిగింది. అందువల్ల ధర కూడా ఎక్కువగా ఉందని పశువైద్యాధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి తీసుకువచ్చిన పశువుల్లో అధికశాతం అనారోగ్యంతో కూడినవి కూడా ఉండటంతో రైతులు తిరస్కరిస్తున్నారు. పశువైద్యాధికారులు ఒత్తిడి మేరకు తీసుకువెళ్లిన రైతులు వాటితో ఇబ్బందులు పడుతున్నారు. పాల ఉత్పత్తి కూడా అంతంత మాత్రంగా ఉన్నందున ఏంచేయాలో దిక్కుతోచడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదు నుంచి 8 లీటర్లు పాలిచ్చే పశువులను లబ్ధిదారులకు అందించాలి.  

వసతుల్లేని కెసాసిటీ కేంద్రం
నర్సీపట్నం పరిసర ప్రాంతాల విషయానికొస్తే పెదబొడ్డేపల్లి మార్కెట్‌యార్డులో కెసాసిటీ కేంద్రం ఏర్పాటుచేశారు. ఇతర రాష్ట్రాలనుంచి తీసుకువచ్చిన పశువులను ఇక్కడ పదిరోజులపాటు పశువైద్యాధికారుల పరిశీలనలో ఉంచుతున్నారు. అయినా వాటి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. అరలీటరు, లీటర్‌కు మించి పాలు ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. ఇక్కడ వాటికి సరియైన దాణా అందించకపోవడం వల్ల బక్కచిక్కి పోతున్నాయి. కనీస సౌకర్యాలు కూడా లేవు.  నర్సీపట్నం కెపాసిటీ కేంద్రం నుంచి నాలుగు రోజులక్రితం తీసుకువెళ్లిన రెండు గేదెలకు పాలు తీస్తుంటే రక్తం వస్తోందని గొలుగొండ మండలం అనంతసాగరం గ్రామానికి  చెందిన లింగేటి చినగంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది రైతులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. గేదెలకు బదులు ఆవులు ఇస్తుండటంతో కొయ్యూరు మండలం చీడిపాలెం గ్రామానికి చెందిన బాలరాజు తిరస్కరించారు.

కొన్ని ఇబ్బందులు ఉన్నాయి
రాయితీ పశువుల పంపిణీలో కొన్ని ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం. పది రోజుల పాటు కెపాసిటీ కేంద్రాల్లో ఉంచి పశువులు కోలుకున్న తరువాత రైతులకు ఇస్తున్నాం. రైతులు పాలు పితికి చూసుకున్న తరువాతే తీసుకువెళ్తే ఇబ్బందులు ఉండవు. పాలు ఇవ్వని పశువులను వెనక్కి పంపించి, ఆరోగ్యంగా ఉన్న పశువులను తీసుకువచ్చి రైతులకు ఇస్తాం. మృతి చెందిన గేదెలకు బీమా వర్తింపజేస్తాం.   – సీహెచ్‌ గణేష్, పశుసంవర్థకశాఖ ఏడీ, నర్సీపట్నం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top